హీరోయిన్ నిధి అగర్వాల్ ఓ వెబ్ సైట్ పెట్టబోతోంది. అయితే ఇది తన కోసం పెడుతున్న సైట్ కాదు. కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు పెట్టబోతున్న సైట్. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ టీమ్ ను సెట్ చేసుకున్న నిధి.. ''డిస్ట్రిబ్యూట్ లవ్'' అనే ఆర్గనైజేషన్ ను లాంఛ్ చేయబోతోంది. దీనికి అనుబంధంగా వెబ్ సైట్ కూడా రాబోతోంది.
కరోనా బాధితులు ఎవరికి, ఏ అవసరం ఉన్నా ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి తమకు కావాల్సినవి కోరవచ్చు. వెంటనే నిధి టీమ్ స్పందిస్తుంది. రోజూవారీ నిత్యావసరాల నుంచి ఔషధాలు, డాక్టర్ సపోర్ట్, ఆక్సిజన్.. ఇలా ఏది కావాలంటే అది అందులో అడగొచ్చు. అతిత్వరలో ఈ పబ్లిక్ డొమైన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని చెబుతోంది నిధి.
గతేడాది లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువగా ఇంట్లోనే గడిపింది నిధి అగర్వాల్. తమిళ్ నేర్చుకోవడం, బొమ్మలు గీయడం, వంటలు చేయడం, యాక్టింగ్ నేర్చుకోవడం లాంటివి చేసింది.
అయితే ఈసారి మాత్రం తనకు లెక్కలేనన్ని విజ్ఞప్తులు వస్తున్నాయని, చాలామంది తనను అభ్యర్థిస్తున్నారని, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలా ''డిస్ట్రిబ్యూట్ లవ్'' అనే ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేస్తున్నానని వెల్లడించింది.
సోషల్ మీడియాలో తనకొచ్చే విజ్ఞప్తుల్లో నిజమైనవి ఏవో, నకిలీవి ఏవో తెలుసుకోవడం కష్టంగా మారిందని.. అందుకే ఈసారి వెబ్ సైట్ తో పాటు, టీమ్ ను కూడా పెట్టినట్టు స్పష్టంచేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ, పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తోంది.