సంపాదనకు కొందరు వక్రమార్గం పడుతున్నారు. అందమైన అమ్మాయిల ఫొటోలను డేటింగ్ యాప్‌లో పెట్టి కొందరు పోకిరీలు యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సినీ సెలబ్రిటీ తీవ్ర మనోవేదన ఎదుర్కోవాల్సి వచ్చింది.
డేటింగ్ యాప్‌లో తన ఫొటో పెట్టారని, దీంతో కంటిన్యూగా ఫోన్‌కాల్స్ వస్తూ, మానసికంగా వేధిస్తున్నారని సినీ నటి గీతాంజలి లబోదిబోమని వాపోతున్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించారు.
నటి గీతాంజలి ఫొటోలను డేటింగ్ యాప్‌లో పెట్టినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఆమెకు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. వెకిలిగా, కవ్విస్తూ మాట్లాడుతుండడంతో అసలు విషయం తెలుసుకుని గీతాంజలి అవాక్కయ్యారు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. 'సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో నా ఫొటో పెట్టినట్లు తెలిసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫొటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. మరో అమ్మాయికి ఇలాంటి ఘటన జరగకూడదు' అని గీతాంజలి కోరారు.
గీతాంజలి ఫిర్యాదు మేరకు ఐపీసీ 501 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. విచారణ చేపట్టామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.