టీడీపీ యువకిశోరం నారా లోకేశ్ అరుపులే తప్ప, బాధితుడైన ధూళిపాళ్ల నరేంద్ర నోరు తెరవడం లేదు. సంగం డెయిరీలో అక్రమాలు చేసుకున్నాయనే ఆరోపణలపై ఆ సంస్థ చైర్మన్ , మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
నిన్న రాత్రి ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. రానున్న రోజుల్లో టీడీపీ పెద్ద దిక్కు నారా లోకేశ్, తమ పార్టీ నేత నరేంద్రను విజయవాడలోని ఆయన ఇంట్లో పరామర్శించారు. ఈ సందర్భంగా నరేంద్రతో లోకేశ్ ఏకాంతంగా చర్చించడం గమనార్హం.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి యోగక్షేమాలను ఆరా తీశారు. ఆ తర్వాత లోకేశ్ తనదైన స్టైల్‌లో మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై పంచ్‌లు విసిరారు. జగన్‌ను అమూల్ బేబీతో పోల్చారు. సంగం డెయిరీ వ్యవహారంలో నరేంద్ర చేసిన తప్పేంటో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాడి రైతులకు లీటరుకు రూ.4 ఎక్కువ ఇవ్వడం, ఆస్పత్రి ఏర్పాటు చేసి రైతులకు 50 శాతం రాయితీతో వైద్యం అందించడం నరేంద్ర చేసిన తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని లోకేశ్ ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి, భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, చింతమ నేని ప్రభాకర్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి.. ఇలా అందరిపైనా అక్రమకేసులు పెట్టారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనపై కేసుకు సంబంధించి ధూళిపాళ్ల నరేంద్ర మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.