జబర్దస్త్ కార్యక్రమానికి ఓ అట్రాక్షన్ వుంది. తిట్టుకుంటూనే, విమర్శిస్తూనే చూడడం మాత్రం మానరు. దానికి కౌంటర్ గా ఎన్ని కార్యక్రమాలు వచ్చినా నిలబడలేకపోతున్నాయి. మా టీవీ, జీ టీవీ ఎంత ట్రయ్ చేసినా వర్కవుట్ కావడం లేదు. ఆ మధ్య జబర్దస్త్ కు కాస్త సెట్ బ్యాక్ తప్పలేదు. డైరక్టర్లు, తెరవెనుక జనాలు మానేయడం, స్కిట్ లు రొటీన్ అవుతున్నాయనే అపప్రధ వచ్చింది.
ఈ మధ్య మరి కొత్త నెత్తురు ఎక్కించే ప్రయత్నం, వున్న టీమ్ ల్లో పొల్లు ఏరిపారేసే ప్రయత్నం ఇలా కొంత జరిగింది. ఇలాంటి టైమ్ లో జడ్జ్ ప్లేస్ లో పర్మనెంట్ గా కూర్చున్న రోజా తన వ్యక్తిగత అనారోగ్య కారణాల వల్ల పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్ లోకి సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వచ్చి కూర్చున్నారు.
లక్కీగా ఇంద్రజ ఆ ప్లేస్ లో పెర్ ఫెక్ట్ గా ఫిట్ అయిపోయారు. మనో, ఇంద్రజ కాంబినేషన్ హడావుడి ఏమీ లేకుండా జనాలను ఆకట్టుకుంటోంది. ఇలాంటి టైమ్ లో మళ్లీ జడ్జ్ ప్లేస్ లో రోజాను చూపిస్తో ఓ ప్రోమో వదిలారు మేకర్లు అయిన మల్లెమాల యూనిట్ జనాలు.
ఇదిగో ఇక చూడాలి. వందలు, వేలు కామెంట్లు. రోజా వద్దు బాబోయ్…ఇంద్రజ నే కావాలి. ఇంద్రజనే బాగుంది. ఆమె బిహేవియర్ నే బాగుంది. రోజా ఓవర్ యాక్షన్ వద్దు..ఇలా రకరకాల కామెంట్లతో యూ ట్యూబ్ విడియో కింద హల్ చల్ చేస్తున్నారు. కానీ మల్లెమాల యూనిట్ రోజాను కాదని అంటుందని అనుకోవడానికి లేదు.
ఇప్పటి వరకు ఎవరు పక్క సీట్లో వున్నా, ఇటు మాత్రం రోజానే వుంటూ వస్తున్నారు. అందువల్ల కామెంట్లు చూసీ చూడనట్లు వదిలేసి రోజానే కంటిన్యూ చేస్తారనుకోవాలి.