రూట్ మార్చిన నారా లోకేశ్‌

తాను ఎన్నిసార్లు చెప్పినా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హించిన టీడీపీ ఆశాకిర‌ణం నారా లోకేశ్ ఈ ద‌ఫా రూట్ మార్చారు. జ‌గ‌న్‌పై ఏకంగా ఢిల్లీ పెద్ద‌సార్ , కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షాకే ఫిర్యాదు…

తాను ఎన్నిసార్లు చెప్పినా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హించిన టీడీపీ ఆశాకిర‌ణం నారా లోకేశ్ ఈ ద‌ఫా రూట్ మార్చారు. జ‌గ‌న్‌పై ఏకంగా ఢిల్లీ పెద్ద‌సార్ , కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షాకే ఫిర్యాదు చేయ‌డం విశేషం. ఇంత‌కూ లోకేశ్ కోపానికి కార‌ణాలేంటో తెలుసుకుందాం.

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ గ‌త కొంత కాలంగా అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఆయ‌న ప‌లు ద‌ఫాలుగా లేఖ‌లు రాశారు. 

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ నిర్ణ‌యాన్ని విర‌మించుకోవాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆయ‌న డెడ్‌లైన్ కూడా పెట్టారు. అయితే లోకేశ్ హెచ్చ‌రిక‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ఏ మాత్రం ఖాత‌రు చేయ‌లేదు.

హైకోర్టు సూచ‌న‌ల మేర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఒక నెల వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో టెన్త్ ప‌రీక్ష‌ల‌ను వ‌చ్చే నెల 7 నుంచి నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. 

టెన్త్ ప‌రీక్ష‌ల త‌ర్వాత ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా నిర్వ‌హించే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. దీంతో నారా లోకేశ్‌కు కోపం వ‌చ్చింది. తాను నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా, క‌నీసం చీమ కుట్టిన‌ట్టైనా లేదా? అని లోకేశ్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

ఏపీలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు నారా లోకేశ్ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా చాలా రాష్ట్రాల్లో ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ బోర్టులు పరీక్షలు రద్దు చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలున్నాయని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. 

కరోనా ఉధృతిలో విద్యార్థుల ప్రాణాలు ఫణంగా పెట్టడం తగదని లేఖ‌లో పేర్కొన్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై జ‌గ‌న్  ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అమిత్‌షాకు ఆయ‌న ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. లోకేశ్ ఢిల్లీ లేఖాస్త్రం ఎంత వ‌ర‌కు ఫ‌లితం ఇస్తుందో చూడాల్సిందే.