తన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు సీనియర్ నటుడు చంద్రమోహన్. తనకు సీరియస్ గా ఉందని హాస్పిటల్ లో ఉన్నానంటూ కొన్ని ఫేక్ న్యూస్ లు వచ్చాయని, కానీ తను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి సమస్యలు లేవని ప్రకటించారు ఈ నటుడు.
రీసెంట్ గా 81వ వడిలోకి ప్రవేశించారు చంద్రమోహన్. ఈ సందర్భంగా వర్చ్యువల్ గా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. 14 దేశాల నుంచి ఎంతోమంది తెలుగు రచయితలు చంద్రమోహన్ సినిమాల గురించి, ఆయన నటన గురించి ప్రస్తావిస్తూ ఆయన్ను పొగిడారు.
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు చంద్రమోహన్. ఆ వీడియోలో తన ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన పుకార్లను ఆయన ఖండించారు. తను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నానన్నారు ఈ సీనియర్ నటుడు.
వయసు మీద పడ్డంతో ప్రస్తుతం ఆయన చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దాదాపు నటించడం మానేశారాయన. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రాఖీ సినిమా షూటింగ్ టైమ్ లో చంద్రమోహన్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది.
ఆ టైమ్ లో బైపాస్ సర్జరీ చేశారు. ఆ తర్వాత దువ్వాడ జగన్నాధమ్ సినిమా టైమ్ లో మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్నుంచి మెల్లమెల్లగా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు చంద్రమోహన్. 55 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు చంద్రమోహన్.
హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు ఎన్నో పాత్రలు పోషించారు. కామెడీ, విలనీ అనే తేడా లేకుండా లెక్కలేనన్ని పాత్రలు పోషించారు. ఎవరైనా కొత్త హీరోయిన్ చంద్రమోహన్ సరసన నటిస్తే ఆమె కెరీర్ కు ఇక తిరుగుండదనే సెంటిమెంట్ అప్పట్లో ఉండేది.