నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద మందు తయారీదారుడు బొడిగ ఆనందయ్యకు పోలీసులు రక్షణ కల్పించారు. ఒక ఎస్ఐ, నలుగురు పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
ఆనందయ్యకు భద్రత కల్పించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి నిన్న నెల్లూరు పోలీస్ ఉన్నతాధికారులకు విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు.
నెల్లూరు నగరంలోని సీవీఆర్ అకాడమీలోని ఆరో బ్లాక్‌లో ఆనందయ్యను ఉంచినట్టు తెలుస్తోంది. ఆనందయ్యతో పాటు ఆయన కుమారుడు, సోదరుడి కుమారుడు ఉన్నారని సమాచారం. కరోనాను ఆనందయ్య మందు మటుమాయం చేస్తోందనే సమాచారంతో అందరి దృష్టి ఆ ఆయుర్వేద వైద్యుడిపై పడింది.
వేలాది మంది ఆయన ఇచ్చే మందు కోసం కృష్ణపట్నానికి వస్తుండడంతో అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. మరోవైపు ఫార్మా మాఫియా నుంచి ఆయనకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించింది.
ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందుపై త్వరలో స్పష్టత వస్తుందని, అంత వరకూ ఆయన్ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉందని ఎమ్మెల్యే కాకాని స్వయంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే వినతికి పోలీస్ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు.