ఏపీలో తదుపరి ఆసక్తి రేపుతున్న ఆసక్తిదాయక ఘట్టాల్లో ఒకటి తిరుపతి లోక్ సభ సీటు ఉప ఎన్నిక. త్వరలోనే తిరుపతి లోక్ సభ సీటు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇలాంటి నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్, తిరుపతి లోక్ సభ సీటు పరిధిలోని మున్సిపాలిటీల్లో వచ్చిన ఫలితాలపై ఆసక్తి నెలకొని ఉంది. అక్కడ వచ్చిన సీట్ల- ఓట్ల లెక్కలు.. తిరుపతి ఫలితం మీద కూడా క్లారిటీ ఇస్తున్నాయి.
ప్రత్యేకించి తిరుపతి కార్పొరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 22 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ-జనసేనలు కనీసం అభ్యర్థులను పెట్టుకోలేకపోయాయి. ఈ రెండు కూటములకు తోడు కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. వీరెవరూ అభ్యర్థులు పెట్టుకోలేనంత స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపించింది.
ఇక పోలింగ్ వరకూ వెళ్లిన డివిజన్ల విషయానికి వస్తే… 27 డివిజన్ల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల సంఖ్య 47,745 కాగా, ఇవే డివిజన్ల పరిధిలో టీడీపీ అభ్యర్థులకు మొత్తం 18,712 ఓట్లు దక్కాయి. బీజేపీకి సుమారు 2,546 ఓట్లు రాగా, జనసేన అభ్యర్థులకు దక్కిన ఓట్లు 231!
కామెడీ ఏమిటంటే.. సీపీఐ, సీపీఎంలు రెండూ కలిపి రెండు వేల ఓట్లను తెచ్చుకున్నాయి. బీజేపీ- జనసేనలు వాటితో పోటీ పడ్డాయి. బలిజలు గణనీయంగా కలిగిన తిరుపతి కార్పొరేషన్ పరిధిలో జనసేన 231 ఓట్లకు పరిమితమై.. తనను ఎవ్వరూ నమ్మడం లేదనే క్లారిటీని ఇచ్చుకుంది.
ఇక సూళ్లూరు పేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల్లో కూడా ఇదే కథ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన ఓట్లలో సగం స్థాయిలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు ఓట్లను పొందలేకపోయారు. బీజేపీ-జనసేనలు వందల ఓట్ల స్థాయికే పరిమితం అయ్యాయి.
పట్టణాల్లోనే ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో అంతంతమాత్రపు మెజారిటీతో బయటపడ్డ తిరుపతి కార్పొరేషన్లోనే ఇప్పుడు ఇలాంటి ఫలితాలు అంటే.. పల్లెలు కూడా ఓటేసే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీతో సహా బీజేపీ-జనసేనల కూటమి కూడా డిపాజిట్లను పొందడం కూడా కష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.