లోక్ సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలప్పుడు కమ్యూనిస్టులు-బీఎస్పీతో జత కట్టి, ఆ ఎన్నికల్లో చిత్తు కాగానే, సొంతంగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, అర్జెంటుగా రంగులు మార్చేసి కాషాయ పార్టీతో జట్టారు పవన్ కల్యాణ్.
ఎర్ర జెండాతోనూ అంటకాగి, కాషాయ జెండాతోనూ అంటకాగగల శక్తి తనకు ఉందని, ఈ విషయంలో చంద్రబాబుకు తనేం తీసిపోననే సందేశాన్ని గట్టిగా ఇచ్చారు పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబే పెద్ద ఊసర వెల్లి అనుకుంటే, ఆయన శిష్యుడిగా తనూ కూడా రంగులు మార్చడంలో దిట్టే అని ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ వరస పెట్టి నిరూపించుకుంటూ వస్తున్నారు.
నిర్లజ్జగా ఈ రాజకీయ ఊసరవెల్లి రూపాలను చూపిన పవన్ కల్యాణ్ కు ఏపీ ప్రజలు ఎప్పటికిప్పుడు గట్టిగా బుద్ధి చెబుతూనే ఉన్నారు. మున్సిపోల్స్ తో మరోసారి అదే జరిగింది.
ఏపీ మొత్తం మీద జనసేన గెలిచిన కార్పొరేషన్ డివిజన్ల సంఖ్య ఏడు, మున్సిపాలిటీల్లో జనసేన గెలిచిన వార్డుల సంఖ్య 19! రాష్ట్రం మొత్తం మీద జనసేన సాధించిన అన్ని వార్డులనూ కలిపినా ఒక మోస్తరు మున్సిపాలిటీని ఓన్ చేసుకోవడానికి సరిపోదు. ఇక రాష్ట్రమంతా కలిసి ఏడు డివిజన్లలో నెగ్గిన పార్టీని ఎలా చూడాలో వేరే చెప్పనక్కర్లేదు.
ఇక జనసేనతో జట్టు కట్టిన మిత్రపక్షం బీజేపీకి కార్పొరేషన్లలో దక్కినది ఒక్కటంటే ఒక్క డివిజన్! ఇక మున్సిపాలిటీల్లో 14 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు!
ఒక జాతీయ పార్టీ బీజేపీ, పవన్ కల్యాణ్ పార్టీ కలిసి సాధించిన వార్డులు, డివిజన్లకు రెట్టింపు స్థాయిలో స్వతంత్రులు నెగ్గారు! ఇండిపెండెంట్లు గెలిచిన వార్డులు, డివిజన్ల సంఖ్య 60కి పైగా ఉన్నాయి.
కనీసం స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడిక్కడ సంపాదించుకున్న పాటి జనాదరణను కూడా బీజేపీ-జనసేనలు పొందకపోవడం గమనార్హం. పవన్ కల్యాణ్ రాజకీయం విషయంలో ఏపీ ప్రజలు మరోసారి క్లారిటీ ఇచ్చారు. మరి ఇంతటితో అయినా చంద్రబాబు శిష్యుడికి తత్వంబోధపడిందో లేదో!