తాడిపత్రి టౌన్ పై జేసీ కుటుంబం ఒకరకంగా తమ పట్టును నిరూపించుకుంది. పల్లెలకు సంబంధం లేని మున్సిపల్ ఎన్నికలో.. టీడీపీ తరఫున తాము కనీసం పోటీ ఇవ్వగలమనే సందేశాన్ని ఇచ్చింది జేసీ ఫ్యామిలీ. దశాబ్దాలుగా కంచుకోటలా కొనసాగించుకున్న ప్రాంతంలో తమ ఉనికిని నిరూపించుకున్నారు.
మొత్తం వార్డుల సంఖ్య 36 కాగా జేసీ ఫ్యామిలీ గెలిపించుకున్న వార్డుల సంఖ్య 18. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నెగ్గిన వార్డులు 16. ఒకటి కమ్యూనిస్టు పార్టీ, ఇంకోటి స్వతంత్రుడు. ఇండిపెండెండ్ అభ్యర్ఢి తమవాడే అని జేసీ ఫ్యామిలీ చెప్పుకుంటోందట.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నట్టే. అంటే ఆ పార్టీ బలం సరిగ్గా 18 ఓట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్, కమ్యూనిస్టు వార్డు మెంబర్ ఎవరికి మద్దతు ఇస్తే వారిదే తాడిపత్రి మున్సిపల్ పీఠం. ఇండిపెండెంట్ అభ్యర్థి ఇప్పుడు తన మద్దతును ఎవరికైనా ఇచ్చే స్వతంత్రం అతడికే ఉంటుంది. అలాగే కమ్యూనిస్టు పార్టీ వార్డు మెంబర్ కూడా ఎటు అయినా మొగ్గు చూపవచ్చు. తటస్థంగానూ ఉండవచ్చు!
ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోవడం జేసీ ఫ్యామిలీకి అంత తేలిక కాదు. ఒకవేళ టీడీపీ అభ్యర్థులు ఎవరైనా జారిపోతే.. అది మరింత ఝలక్ కాగలదు.
ప్రస్తుతానికి అయితే క్యాంపును నిర్వహిస్తున్నారట. కానీ, గతంలో అనంతపురం జడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు టీడీపీ క్యాంపు నుంచి ఇద్దరు జడ్పీటీసీ మెంబర్లను జేసీ చీల్చారు. తోపుదర్తి కవిత జడ్పీ చైర్మన్ గా ఎన్నికైనప్పుడు.. తెలుగుదేశం నుంచి గెలిచిన ఇద్దరు జడ్పీటీసీ మెంబర్ల మద్దతు ఇచ్చారు. అలాంటి పాలిటిక్స్ లో కూడా జేసీ దివాకర్ రెడ్డి పండితుడే. కాబట్టి.. ఇప్పుడు ఆయన క్యాంపులోని ఒకరిద్దరు వార్డు మెంబర్లు జారిపోయినా పెద్ద వింతేం లేదు.
వాస్తవానికి అనంతపురం రాజకీయంలో అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. పరిటాల రవి హయాంలో .. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల అంకం ముగిశాకా, నాటి కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరించి విత్ డ్రా చేయించిన సందర్భాలున్నాయి. ఈ ఉదాహరణల నేపథ్యంలో.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరం!