ఇటీవల కాలంలో యంగ్ హీరో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీనికి బలమైన నేపథ్యం, కారణం కూడా లేకపోలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడం, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంతకంటే దారుణమైన ఫలితాలు పునరావృతం కావడమే. అయితే ఇది టీడీపీ పతనమా? చంద్రబాబు నాయకత్వ ఫెయిల్యూరా? అనేది ప్రశ్నగా మిగిలింది.
క్షేత్రస్థాయిలో టీడీపీకి బలమైన కార్యకర్తల బలం ఉంది. దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకునే నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని ఎవరూ నడిపించాల్సిన పనిలేదు. దానికదే ఏదో రకంగా ముందుకు సాగుతుంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, పార్టీ వెంట నడిచే నిజమైన నాయకులు, కార్యకర్తలెవరో తేలుతుంది. దీనికి భవిష్యత్‌పై భరోసా కల్పించే నాయకత్వం ఎంతో ముఖ్యం.
ఇప్పుడు టీడీపీలో ప్రధానంగా నాయకత్వ సమస్య ఓ పెద్ద కొరతగా కనిపిస్తోంది. చంద్రబాబు వయసు పైబడడం, ఆయన వారసుడిగా వచ్చిన లోకేశ్ పార్టీ ఆశించిన మేరకు రాణించలేకపోవడం … అన్నీ కలిసి టీడీపీ పతనానికి దారి తీశాయి.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ టీడీపీది ఓటమి సమస్య కానే కాదు. అది పతనావస్థలో దూసుకుపోతోంది. దీన్ని నిలువరించకపోతే మిగిలేది కనుమరుగే. అందుకే టీడీపీ శ్రేణుల్లో అంతులేని ఆవేదన, ఆక్రోశం. వీటి నుంచి పుట్టుకొస్తున్నదే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఆయన ఎదురుగానే కార్యకర్తలు ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలని, ప్రచారానికి తిప్పాలని డిమాండ్ చేయడాన్ని ఈజీగా తీసుకోకూడదు.
చంద్రబాబు, లోకేశ్ ఉన్నంత వరకూ ఇక టీడీపీకి భవిష్యత్ ఉండదనే భావన, నమ్మకం రోజురోజుకూ ఆ పార్టీ కార్యకర్తల్లో బలప డుతున్నాయి. ఇది తండ్రీకొడుకులను భయపెడుతోంది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల అనుమానాలను మరింత స్థిరపరిచాయి. దీంతో టీడీపీ బతికి బట్ట కట్టాలంటే ఎన్టీఆర్ నాయకత్వం తప్ప, మరో గత్యంతరం లేదనే అభిప్రాయాలు ఇటు సామాన్య ప్రజలు మొదలుకుని నాయకుల వరకూ ఒకే రకంగా వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల రాజకీయ ప్రవేశంపై ఎన్టీఆర్ స్పందించారు. ఇది సమయం, అంతకు మించి సందర్భం కాదని తప్పించు కున్నారు. కానీ చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంపై ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో పూర్తిగా విశ్వాసం పోయేంత వరకూ ఎన్టీఆర్ వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో ఉన్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పోలికలను పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే టీడీపీ కార్యకర్తల్లో క్రేజ్ ఉంది.
తాను కోరుకుని పార్టీలోకి వెళ్లడం కంటే, తన అవసరాన్ని గుర్తించి , ఇక రావాల్సిందే అనే బలమైన డిమాండ్ వచ్చినప్పుడే వెళ్లడం ఉత్తమమని తమ హీరో అభిలాషగా ఉన్నట్టుందని అభిమానులు చెబుతున్నారు. ఎన్టీఆర్ వ్యూహాత్మక మౌనం కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వ ఫెయిల్యూర్, పార్టీలో తన నాయకత్వంపై వెల్లువెత్తుతున్న డిమాండ్లు, తదితర పరిణామాలపై ఎన్టీఆర్ డేగకన్ను వేశారని రాజకీయంగా చర్చ జరుగుతోంది. మొత్తానికి తన నాయకత్వ అవసరాన్ని క్రియేట్ చేసుకునే క్రమంలో ఎన్టీఆర్ మరికొంత కాలం మౌనాన్నే ఆశ్రయించేలా ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం, సందర్భం ఎప్పుడొస్తుందో మరి!