నది లోంచి నీరు వెళ్లిపోయిన తర్వాత వంతెన కట్టడాన్ని గతజల సేతుబంధనం అంటారు. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేయడానికి నిర్ణయించేశాం, ఎవర్నీ అడిగే పని లేదు అని కేంద్రం కుండబద్దలు కొట్టి చెప్పేశాక కూడా ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ ఉద్యమాలు చేయడం, మీరు చిత్తశుద్ధితో చేయడం లేదంటే మీకే చిత్తశుద్ధి లేదంటూ ఒకరినొకరు దెప్పి పొడుచుకోవడం.. యివన్నీ అవసరమా? మీ నిర్ణయం తప్పు అని కేంద్రంలో వున్న పార్టీకి చెప్పలేరు కానీ, నువ్వు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తున్నావ్ అంటూ స్థానిక రాజకీయ ప్రత్యర్థిపై విరుచుకు పడుతున్నారు. రాజీనామా చేసి చూపించండి అని ఎంపీలను వూరిస్తున్నారు. ఇదంతా ఓ నాటకం, బిజెపి తలచుకున్నది చేసి తీరుతుంది, దాన్ని అడ్డుకునే మొనగాడు దేశంలో లేడు అని అందరికీ తెలుసు.
ఎవరి మాటా వినని పరిస్థితికి బిజెపి యీనాడు వచ్చిందంటే దానికి కారణం మనం కాదా? పబ్లిక్ సెక్టార్ దండగ, ప్రయివేటు సెక్టారే ముద్దు అని ప్రభుత్వాలు చెపుతూ వస్తూంటే ఏనాడైనా ప్రతిఘటించామా? దండగ ఎందుకైంది? ఎలా అయింది? తప్పుడు నిర్ణయాలను తీసుకున్న వారిని శిక్షించకుండా, సంస్థనే శిక్షిస్తే ఎలా అని అడిగామా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వసంస్థల్లో తమ వాటాలు అమ్మి పారేసి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ వుంటే, యిదెక్కడి అన్యాయం అని అడిగామా? నష్టాలలో వున్నదాన్ని లాభాల బాట పట్టించి మీ ప్రజ్ఞ చూపండి, మరమ్మత్తు చేయడానికి వీల్లేని స్థితికి వచ్చేస్తే, దాన్ని కొంతకాలం ఎవరికైనా లీజుకిచ్చి చూసి, అదీ వర్కవుట్ కాకపోతే, అమ్మేసి ఆ డబ్బుతో మరో కొత్త సంస్థ పెట్టి, మీ సత్తా చాటండి అని అడిగామా? అబ్బో, ప్రయివేటు సెక్టార్ అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారే, మరి అవి నష్టాల్లోకి ఎందుకు వెళుతున్నాయి? ఆ నష్టాలు పూడ్చడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డిపాజిటర్ల డబ్బు పట్టుకెళ్లి యిస్తున్నారేం? అని అడిగామా?
ఏదైనా ప్రయివేటు బ్యాంకు మునిగితే, దాన్ని పట్టుకుని వచ్చి ప్రభుత్వ రంగ బ్యాంకులో కలుపుతున్నారు కానీ మరో ప్రయివేటు బ్యాంకులో ఎందుకు కలపటం లేదు? సమర్థులు కదా వారు! ప్రయివేటు సంస్థలకు ఆధునిక టెక్నాలజీ యిచ్చి, ప్రభుత్వ సంస్థలకు యివ్వకుండా తొక్కిపెట్టి, పోటీలో వెనకబడేట్లు చేశారేం అని అడిగామా? ఏదైనా సంస్థ యిబ్బందుల్లో పడితే తన స్థిరాస్తుల్లో కొంత అమ్ముకుని అప్పుల్లోంచి బయటపడి బండిని పట్టాలెక్కిస్తుంది. ప్రభుత్వసంస్థ అయితే మాత్రం ప్రభుత్వం దానికి ఆ అనుమతి యివ్వదు. రైల్వే, ఆర్‌టిసి, ఎయిర్‌లైన్స్, బిఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకులు యిలా అన్నిటికి ఎప్పుడో కొనిపారేసిన స్థిరాస్తులున్నాయి. కష్టకాలంలో వాటిని అమ్ముకోనిస్తే నష్టాల్లోంచి బయటపడిపోవచ్చు. మరి వాటికి అనుమతి ఎందుకు యివ్వదు అని అడిగామా?
ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రభుత్వ భూములు మాత్రం ఎందుకు అమ్ముతున్నారు? మీరు ఐదేళ్లు పాలించడానికి వచ్చి సంక్షేమపథకాల పేరుతో ఓట్లు కొనడానికి, మీ పేరు చిరస్థాయిగా వుండిపోతుందనే దురాశతో పాతకాలం నుంచి వున్న ప్రభుత్వాస్తులను అమ్మడానికి హక్కెవరిచ్చారు అని అడిగామా? చేతనైతే ఆదాయం పెంచే వనరులు వెతకండి. పరిశ్రమలు పెట్టి, పెట్టించి, ప్రజల చేతిలో డబ్బు ఆడేట్లు చేసి, పన్నుల ద్వారా సంపాదన పెంచుకుని వాటిలో కొంత సంక్షేమానికి పెట్టండి. తరతరాల ఆస్తి కరిగించి, పప్పుబెల్లాలు పంచడం దేనికి అని అడిగామా? ‘పాతవి అమ్ముకు తినడం తప్ప కొత్తవి పెట్టడం రాకపోతే ఆ ముక్కే చెప్పండి. అబ్బే, ప్రభుత్వం తరఫున కొత్త ఫ్యాక్టరీ పెడుతున్నాం, దాని వలన మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి అని ఓటర్లను ఊరించడం దేనికి? ఆ ఫ్యాక్టరీ పేరు చెప్పి రైతుల దగ్గర్నుంచి భూములు గుంజుకోవడం దేనికి?’ అని పాలకులను నిలదీశామా?
ఈనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్నారు. మరి విశాఖ జింకు హక్కు కాదా? గంగవరం రేవు హక్కు కాదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమ్మేసిన అనేకానేక సంస్థలేవీ హక్కు కాదా? ఉక్కు-హక్కు ప్రాస కుదిరింది కదాని యిప్పుడు అంటున్నారా? ఇదో ఉద్యమం అనగానే కెటియార్ ఔనౌను, ఆంధ్రుల హక్కే, మేం కూడా కలిసి వస్తాం అంటున్నాడు, ఓ పక్క తన ప్రభుత్వాధ్వర్యంలో నడుస్తున్న టూరిజం శాఖను ప్రయివేటు సెక్టార్‌కు అప్పగించేస్తూ! విజయశాంతి భలేగా అడిగారు – ఆల్విన్, నిజాం సుగర్స్ వంటివి తిరిగి తెరిపిస్తామన్న వాగ్దానం ఏమైంది అని. పాలకులు ఎవరొచ్చినా అమ్ముకోవడమే మరిగారు. ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు అంటే హైదరాబాదులో కొత్త సెక్రటేరియట్ కడుతున్నారు కెసియార్. దిల్లీలో 900 కోట్లతో కొత్త పార్లమెంటు కడుతున్నారు మోదీ. పార్లమెంటు ఒక్కటేనా? ఇంకా బోల్డు భవనాలను కూల్చి, కొత్తవి కట్టబోతున్నారు. వాటికి లక్షల కోట్ల డబ్బు కావాలంటే మరి యిలాటివి అమ్మాలి కదా!
భవంతులు ఒకటేనా? విగ్రహాలు కట్టాలి. 600 అడుగులు ఎత్తుగా పటేల్ విగ్రహం కట్టారా? టూరిజం పేరు చెప్పి దాని చుట్టూ బోల్డు డబ్బు పోసి డెవలప్ చేస్తున్నారా? రేపు అవసరమైతే సావర్కార్ విగ్రహం కట్టాలి కూడా. ఇలా బోల్డు మంది వున్నారు. అంతేనా? ఆటల స్టేడియంలు, గోల్ఫ్ మైదానాలు, బుల్లెట్ రైళ్లు, అండర్‌వాటర్ సిటీలు కట్టాలా? తన పేరు మీద ప్రపంచంలో కల్లా పెద్దదైన స్టేడియం కడదామనుకున్నపుడు యిలాటి చిల్లర ఫ్యాక్టరీలను వదుల్చుకోక తప్పదు కదా! వదుల్చుకోవడానికి మొదట్లో ‘అవి నష్టదాయకమైనవి, పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని హరించేవి’ అనే ముద్ర కొట్టడానికి చూశారు.
వైజాగ్ స్టీల్ 2010లో నవరత్నాల్లో ఒకటి. 13 ఏళ్లు లాభాల్లో వున్నాక బిజెపి అధికారంలోకి వచ్చాకనే నష్టాల్లోకి తెచ్చారు. అనేక ప్రయివేటు కార్పోరేట్లకు రాయితీలిచ్చి, పన్ను మినహాయింపులిచ్చి, గట్టున పడేయడానికి కంకణం కట్టుకున్న బిజెపి ప్రభుత్వం, మరి దీన్ని మాత్రం నష్టాల్లోనే వుంచిదెందుకు? కాప్టివ్ మైన్స్ యివ్వలేదు, దారుణంగా వున్న వడ్డీ రేటు తగ్గించలేదు, పన్ను మినహాయింపు యివ్వలేదు. ఆరేళ్లగా నష్టాల్లో వుంది అని చాటింపు వేసి మరీ అమ్మేద్దామని చూసింది.
నాకు తెలియక అడుగుతాను – ఎవరైనా దేన్నయినా అమ్మాలంటే మేలిముసుగు వేసి, విండో డ్రెసింగ్ చేసి అమ్ముతారు. కానీ యిదేమిటి? వీళ్లు మొఖానికి నష్టాల మసిపూసి మరీ అమ్ముతున్నారు! కొందరు బిజెపి విద్యాధికులు ‘వైజాగ్ స్టీల్ వంటి యింటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీలు యిప్పుడు ఔట్‌డేటెడ్. వీటిని నిభాయించడం కష్టం. అందుకే అమ్మడం సబబు.’ అంటున్నారు. అదే నిజమైతే వీళ్ల దగ్గర కొన్నవాడు మాత్రం ఏం బావుకుంటాడు? అసలు ఎందుకు కొంటాడు?
ప్రభుత్వమే కావాలని ఇమేజి చెడగొట్టి మార్కెట్లో పెట్టి, కారు చౌకగా తనవాళ్లకు అమ్ముకోవడానికి చూస్తున్నట్లు అనిపించటం లేదూ? కొన్నవాడు జింకు ఫ్యాక్టరీ విషయంలో చేసినట్లే ఉత్పత్తి ఆపేసి, మొత్తం స్థలాన్ని రియల్ ఎస్టేటు వెంచర్‌గా మార్చేసుకుంటాడని తోచటం లేదూ? ఇవన్నీ వైజాగ్ ఉద్యమకారులు ముందే ఊహించలేదా? పెట్టుబడులు ఉపసంహరణే మా విధానమని బిజెపి అంటూ వచ్చినపుడు వైజాగ్ స్టీలుకి కూడా ముప్పు వస్తుందని ఊహించి, దీనికి కాప్టివ్ మైన్స్ లేకపోవడం చేత ముడిసరుకుకై ఏడు రెట్లు ఎక్కువ ఖర్చవుతోంది. కాప్టివ్ మైన్స్ వుండాలని డిపిఆర్‌లోనే వుంది. ఇప్పటిదాకా ఎందుకివ్వలేదు? మైన్స్ సంస్థ కూడా ప్రభుత్వసంస్థే కాబట్టి దీనితో మెర్జ్ చేయండి. డివోటెడ్ పోర్టు యివ్వండి అని ఎప్పుడో అడగవద్దా? అంతా అయిపోయాక యిప్పుడు జండాలు పట్టుకుని తిరిగితే ప్రయోజనమేముంది?
‘‘కేంద్రం వైజాగ్ స్టీలుకి యిచ్చినది 5 వేల కోట్లు. డివిడెండు రూపంలో తిరిగి పొందినది 42 వేల కోట్లు. ఇక ప్రభుత్వానికి ఖర్చెక్కడైంది? పైగా చచ్చేటంత వడ్డీ గుంజుతోందే! కేవలం బాలన్స్ షీట్ చూసి, లాభనష్టాలు గణిస్తారా? స్టీల్ ఫ్యాక్టరీ కారణంగా అక్కడ జరిగిన అభివృద్ధి మూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయానికి లెక్క లేదా? సిమెంటు, స్టీల్ సంస్థల మోనోపలీ వలన నిర్మాణవ్యయం పెరుగుతోంది అని నితిన్ గడ్కరీ అన్నాడు కదా, మరి ప్రభుత్వసంస్థను ప్రయివేటు పరంచేయడంలో విజ్ఞత ఏమిటి? దీన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి కొనగలిగే ప్రయివేటు సంస్థ వుందా? బాంకుల దగ్గర్నుంచి తీసుకుంటే నష్టాలొస్తే కష్టం ఎవరికి? బ్రాహ్మణి స్టీల్ ప్రభుత్వం కేటాయించిన భూముల్ని యాక్సిస్ బాంకులో తాకట్టు పెట్టి డబ్బు తినేసింది. వీళ్లూ అలా చేస్తే..? పోస్కోకు అనుమతులిచ్చినా బెంగాల్‌లో, ఒడిశాలో ప్రారంభించలేదెందుకు?
‘‘ప్రయివేటు రంగం ఎంటరైతే పోటీ వలన ధరలు తగ్గుతాయని మీ థియరీ. విద్య, వైద్య రంగాల్లో ప్రయివేటు రంగం వచ్చాక ఫీజులు తగ్గాయా? ప్రయివేటు ఇన్సూరెన్సు కంపెనీలున్నా ఎల్‌ఐకికి 70% వాటా ఎందుకుంది? ప్రయివేటు సెక్టార్ అనగానే ముకేశ్ అంబానీనే ఎందుకు చూపాలి? తమ్ముడు అనిల్ అంబానీ లాభసాటిగా నడిపిన వ్యాపారం ఒక్కటుందా? అయినా రఫేల్‌లో పబ్లిక్ సెక్టార్‌ను కాదని అతనికి ఎందుకు యిచ్చారు? వ్యాపారం పబ్లిక్ సెక్టార్ చేతిలో వుంటే మోనోపలీ అంటారు. మరి జిఎంఆర్‌కు రెండు కంటె ఎయిర్‌పోర్టులు యివ్వమంటూ, అదానికి 6 యిచ్చారు. అది దేని కిందకు వస్తుంది? గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పెట్రోలియం సంస్థకు నష్టం వస్తే 2017లో మోదీ ప్రభుత్వసంస్థ ఐన ఒఎన్‌జిసి చేత కొనిపించాడు. ప్రయివేటు పార్టీకి అమ్మేయలేదేం? ఇప్పటికీ గుజరాత్‌లో నష్టాలు వచ్చి మూతపడిన పబ్లిక్ సెక్టార్ సంస్థలు 16 ఉన్నాయి, వాటిని అమ్మలేదేం? ఉన్నది అమ్ముకుంటూ ఆత్మనిర్భర్ అంటే ఎలా? తాతల నాటి ఆస్తిని తాగుబోతు తండ్రి అమ్మినట్లుగా అమ్మేస్తూంటే అది తన కాళ్ల మీద తను నిలబడడం అవుతుందా?’’
.. ఇలా పలువురు అడిగే ప్రశ్నలకు బిజెపి వద్ద ఏ సమాధానమూ లేదు. నష్టాలు వస్తున్నాయి కాబట్టి.. అని చెప్తే ‘ఎందుకు వచ్చాయి? మీరు వచ్చాకనే వచ్చాయంటే దాని అర్థమేమిటి? దీనిలో కుట్ర వుందా? మరి లాభాలొచ్చే ఎల్‌ఐసి ఎందుకమ్ముతున్నారు?’ వంటి ప్రశ్నలు వేస్తున్నారని, ‘లాభమొచ్చినా, నష్టమొచ్చినా అమ్మడమే మా పని, మేం గద్దె దిగేనాటికి ఏదీ మిగల్చం చూసుకోండి’ అని బిజెపి బాజాప్తా చెప్పేసింది. 75 ఏళ్లగా కూడబెట్టినది యీ పదేళ్లలో చుప్తాగా చుట్టబెట్టేయడమే తమ ఘనత అని వాళ్ల గర్వం. ఏమైనా అంటే ప్రభుత్వమంటే వ్యాపారం చేయడం కాదు అని పెద్ద ఫిలాసఫీ ఒకటి. వ్యాపారం చేయం అనుకుంటే సన్యాసం తీసుకున్నట్లేగా. ఫ్యాక్టరీని కార్మికుల కో-ఆపరేటివ్‌కు అప్పగించి చేతులు దులుపుకుని వెళ్లిపోవచ్చుగా! అమ్ముకోవడం వ్యాపారం కాదా? కొనడం, పరిశ్రమలు నెలకొల్పడం మాత్రమే వ్యాపారమా?
ఇప్పుడు ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు. తోటకార నాడే ప్రజలు మేల్కోవాల్సింది. పివి నరసింహారావుగారు ఆర్థిక సంస్కరణల పేర దిగుమతులు పెంచి, స్వదేశీ ఉత్పాదనలను నీరుకార్చి, పెట్టుబడుల ఉపసంహరణ మొదలుపెట్టినపుడే అడ్డుకోవవలసినది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రపంచబ్యాంకు చేత భేష్‌భేష్ అనిపించుకుంటూ, ప్రభుత్వ సంస్థలను ఎడాపెడా అమ్మేసినపుడు వద్దని చెప్పవలసినది. కానీ అప్పుడు వాళ్లది దూరదృష్టి అని మీడియాలో డప్పు వేశారు. అన్నిట్లోనూ విదేశీ పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆహ్వానించే మీడియా, తమ రంగంలో మాత్రం ఆహ్వానించదు. ప్రభుత్వం కూడా వారిని మచ్చిక చేసుకోవడానికి చాలా పరిమితంగా పెట్టనిస్తోంది. అందుకే యీ మీడియా ప్రజలను యిలాటి ముప్పు గురించి హెచ్చరించటం లేదు. పాలకులు అనుసరించే యిలాటి విధానాలను మెచ్చుకోవడమే వారి పని.
తెల్లారి లేస్తే కాంగ్రెసును తిట్టడమే పనిగా పెట్టుకున్న బిజెపి యిలాటి విధానాలలో కూడా కాంగ్రెసును అనుకరిస్తోంది. ఆ మాట కొస్తే గురువుని మించిన శిష్యుళ్లా వారిని తలదన్నుతోంది కూడా. 1991లో పివి, మైనారిటీ వాటాల ఉపసంహరణకే అనుమతించారు. మొత్తం ఉపసంహరించింది రూ.10 వేల కోట్ల లోపే! వాజపేయి దీనికి ఓ మంత్రిత్వశాఖ పెట్టి రూ.34 వేల కోట్లను ఉపసంహరించారు.
2014-19లో లెఫ్ట్ వాళ్లు అంకుశంలా వుండడంతో యుపిఏ1 రూ.9 వేల కోట్లు మాత్రమే ఉపసంహరించింది. 2019 నాటికి ఆ అంకుశం తొలగిపోవడంతో యుపిఏ2 దాదాపు లక్ష కోట్ల రూ.లు ఉపసంహరించారు. ఇక మోదీ తొలి టెర్మ్‌లో రూ. 2 లక్షల కోట్లు ఉపసంహరించారు. తాజా బజెట్‌లో యీ ఏడాది రూ.1.74 లక్షల కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. కొన్ని కీలకరంగాల్లో తప్ప తక్కినవన్నీ అమ్మిపారేస్తామని చెప్పారు.
ఇలా అమ్మగా వచ్చిన డబ్బంతా ఏమవుతోంది? అని అడిగితే మోదీ యింటికి పట్టుకెళుతున్నా డనుకుంటున్నారా? ఆయనకు యిల్లాలే లేదు అని కోప్పడతారు ఆయన భక్తులు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెడుతున్నామంటారు. పెట్రోలు ధరలు పెంచినా అదే చెప్తారు, దీనికీ అదే చెప్తారు. మళ్లీ వాటికి విడిగా సెస్‌లు వసూలు చేస్తున్నారు.
2018లో 42 రకాల సెస్‌ల పేర రూ.2.18 లక్షల కోట్లు వసూలు చేశారు కానీ ఆ మొత్తాన్ని ఆ రంగాలకు బదిలీ చేయలేదని కాగ్ చెప్పింది. 2019లో వసూలు చేసినది రూ.3.60 లక్షల కోట్లు. ఇలా వసూలు చేసిన మొత్తాలతో ఏ పన్లు చేస్తున్నారో, ఏ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారో, ప్రతిగా వారు బిజెపి ఎన్నికల ఖర్చును ఏ మేరకు భరిస్తున్నారో ఎవరైనా చెప్పగలిగితే బాగుండును. ప్రశ్నలడగగానే దేశభక్తి లేదని విరుచుకు పడిపోవడం మానితే సామాన్యుడికి నోరు పెగులుతుంది.
మోదీ ఏం చేసినా అందులో పరమార్థం వుంటుంది అనుకుంటూ చప్పట్లు కొడుతూ కూర్చున్న ప్రజలు యిప్పుడు యీ స్టీలు ప్లాంటు విషయంలో మాత్రం మేల్కొంటామంటే ఏం ప్రయోజనం? ఇన్నాళ్లూ ప్రజలంతా మోదీ భజనలో మునిగివుండడంతో ప్రతిపక్షాలు పూర్తిగా చప్పబడ్డాయి. ఏం చెప్పినా ప్రజలు వినేట్లు లేరు అనే నిస్పృహ ఆవరించి నోరెత్తడం మానేశాయి. ఇప్పుడీ ఉద్యమం నిరర్థకమని తెలిసినా బయట కాస్సేపు హడావుడి చేస్తున్నాయి తప్ప ‘తాంబూలాలు యిచ్చేశాను, తన్నుకు ఛావండి అని మోదీ అనేసిన తర్వాత మనం ఏం చేసినా ప్రయోజన మేముంది?’ అని ఆంతరంగికంగా పెదవి విరుస్తున్నారు.
ఎవరు సపోర్టు చేసినా, మానినా లోకసభలో బిజెపి మాటే చెల్లుతుంది. ఈ ప్రాంతీయ పార్టీలు యిలాటి విషయాల్లో సణిగినా అసలు విషయానికి వచ్చేసరికి రాజ్యసభలో బిజెపి పల్లకీయే మోస్తున్నాయి. ఇక మోదీకి అడ్డేముంది? ఆ జగన్నాథ రథం అలా సాగిపోవాల్సిందే. ఆయన గద్దె దిగిన తర్వాత మన దగ్గర ఏం మిగిలిందో (మిగిల్తే) లెక్క పెట్టుకోవాలంతే!
హిట్లర్ అంతలేసి అత్యాచారాలు చేస్తూ వుంటే సాధారణ జర్మన్లు చూస్తూ ఎలా వూరుకున్నారు అని అందరూ ఆశ్చర్యపడుతూ వుంటారు. సమాజంలో జరిగే అన్యాయాలను సరైన సమయంలో ఎదురించకపోతే మనకే ముప్పని హెచ్చరిస్తూ జర్మన్ కవి మార్టిన్ నిమోలర్ రాసిన ‘ఎ ప్లీ ఫర్ యాక్షన్’ చదివితే ఆ సందేహం తీరిపోతుంది.
‘నాజీ సైనికులు వచ్చి కమూనిస్టుల నెత్తుకెళ్లారు – ..నేను కమూనిస్టు కాదు కాబట్టి పట్టించుకోలేదు
నాజీ సైనికులు వచ్చి యూదుల నెత్తుకెళ్లారు – ..నేను యూదుణ్ని కాదు కాబట్టి ఊరుకున్నాను
నాజీ సైనికులు వచ్చి కార్మిక నాయకుల నెత్తుకెళ్లారు – …నేను కార్మికుణ్ని కాదు కాబట్టి కిమ్మనలేదు
నాజీ సైనికులు వచ్చి కాథలిక్స్ నెత్తుకెళ్లారు – ..నేను కాథలిక్‍ను కాదు కాబట్టి మిన్నకున్నాను
నాజీ సైనికులు వచ్చి నన్నే ఎత్తుకెళ్లారు – ..ఎదురాడేందుకైనా ఎవరూ మిగలలేదు
కాబట్టి… అంతా మౌనం… స్మశాన నిశ్శబ్దం’
అలాగే – గత 30 ఏళ్లగా పాలకులు ఏవేవో సిద్ధాంతాల పేరు చెప్పి మన ఆస్తులు అమ్మేస్తూంటే కళ్లప్పగించి చూసి, యీ రోజు ఆంధ్ర అమరవీరుల త్యాగఫలం వంటి సెంటిమెంటు కబుర్లు చెపితే వినేవాడెవడు? పక్క రాష్ట్రాలలో స్పందన ఏమైనా వుందా? కెటియార్ మాట వదలండి. శాసన మండలి ఎన్నికల మూడ్‌లో ఏదైనా అని వుండవచ్చు. కెసియార్ ప్రతిఘటించారా? ఆ మాటకొస్తే అనేకానేక సంస్థలు అమ్మేసినపుడు యీ నాయకులెవరైనా నోరు విప్పారా? ఆంధ్ర ప్రజలు యితర ప్రాంతాల సంస్థల ఉనికికై ఉద్యమించారా? అందుకే, తన దాకా వస్తే కానీ తెలియదంటారు పెద్దలు!
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)