టీడీపీ అధినేత చంద్రబాబు తాను నమ్ముకున్నోళ్లే నట్టేట ముంచారు. కానీ ఆయన ఎవరినైతే అవమానించారో వారే ఈ రోజు ఆదరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయంగా పునరాలోచించాల్సిన అవసరాన్ని, గుణపాఠాన్ని తాజా మున్సిపల్ ఫలితాలు నేర్పాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తన సామాజికవర్గంపై ప్రేమతో చంద్రబాబు ఏకంగా రాజధానినే ఏర్పాటు చేశారు. రాష్ట్ర సంపదనంతా “నా” అనుకునే వాళ్ల కోసం ఆయన గంపగుత్తగా ఒకేచోట కుమ్మరించేందుకు సిద్ధమయ్యారు. కోట్లాది రూపాయలను రాజధానిపై పెట్టుబడిగా పెట్టి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దీంతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రతో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.
కరువుతో అల్లాడుతున్న తమ ప్రాంతాలను పట్టించుకోండి మహాప్రభో అని వేడుకున్నా చంద్రబాబు కరుణ చూపలేదు. పైగా యుద్ధప్రాతిపదికన పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి సంపన్న ప్రాంతాలకు సాగు, తాగునీటి సౌకర్యానికి లోటు లేకుండా చేశారు. ఇంత చేసినా …చంద్రబాబును వారేమైనా ఆదరించారా? అంటే లేదనే చెప్పాలి.
గత సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలోనే టీడీపీని ఓడించి గట్టి బుద్ధి చెప్పారు. దీంతో బాబుకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అనంతరం జగన్ సర్కార్ మూడురాజధానుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అమరావతిలో కేవలం శాసన రాజధాని మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో జగన్ ప్రభుత్వంతో పాటు వైసీపీపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటుందని అందరూ భావించారు. వైసీపీ భయాందోళనకు గురైంది.
కర్నూలుకు హైకోర్టు , విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని చంద్రబాబు వద్దన్నా… ఆ ప్రాంత ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఎంతోకొంత మేరకైనా ఆదరించి ఆయన పరువు కాపాడారు. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతింది. రాజధానిని తరలించిన వైసీపీ కంటే, వద్దని పోరాటం చేస్తున్న టీడీపీపై ఆ రెండు కార్పొరేషన్లలో తీవ్ర వ్యతిరేకత చూపడం ఆశ్చర్యమే.
విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉండగా, వైసీపీ 49, టీడీపీ కేవలం 14 సీట్లకు పరిమితం కావడం గమనార్హం. విజయవాడలో వైసీపీ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నట్టైంది. రాజధాని తరలింపుపై వ్యతిరేకత ఎక్కడున్నట్టు? ఇక గుంటూరు కార్పొరేషన్ విషయానికి వస్తే 58 డివిజన్లు ఉన్నాయి. వీటిలో వైసీపీ 45, టీడీపీ 9 సీట్లలో గెలుపొందాయి. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న కార్పొరేషన్లలో టీడీపీ ఘోరమైన ఫలితాలను చవి చూడాల్సి వచ్చింది. సామాజిక వర్గంపై ప్రేమతో రాజధాని ఏర్పాటు చేసిన చంద్రబాబుపై జనానికి ఎందుకంత కోపమో అర్థం కాని పరిస్థితి.
ఇదే రాయలసీమకు వెళితే… చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యమే చేశారు. కానీ ఇదే రాయలసీమలోని అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాబు బామ్మర్ది బాలయ్యను ఆదరిస్తున్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే బాబు పరువును రాయలసీమే కాపాడిందని చెప్పాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ మంచి ఫలితాలు సాధించింది. ఇక్కడ 36 వార్డులుండగా, రెండింటిని వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక 34 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 18 స్థానాల్లో టీడీపీ, 14 స్థానాల్లో వైసీపీ గెలుపొందడం గమనార్హం.
కడప జిల్లా మైదుకూరుకు వెళితే… దాదాపు ఇలాంటి ఫలితమే వచ్చింది. అక్కడ 24 వార్డులున్నాయి. వీటిలో 12 వార్డుల్లో టీడీపీ, 11 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. ఫ్యాన్ స్పీడ్‌కు మున్సిపాల్టీలకు మున్సిపాల్టీలే ఊడ్చుకుపోయిన పరిస్థితుల్లో తాడిపత్రి, మైదుకూరులో అందుకు భిన్నమైన ఫలితాలు రావడం చిన్న విషయం కాదు. రాయలసీమను వ్యతిరేకించిన చంద్రబాబును అక్కడి ప్రజలు ఆదరించిన విధానం ఇది.
ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది గ్రేటర్ వైజాగ్ గురించి. ఏపీలో ఏకైక గ్రేటర్ కార్పొరేషన్ అయిన విశాఖపట్నంలో మొత్తం 98 డివిజన్లున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలో వైసీపీ 58, టీడీపీ 30 స్థానాల్లో గెలుపొందాయి. ఎగ్జిక్యూటివ్ రాజధాని తెచ్చిన వైసీపీని ఆదరిస్తూనే, వద్దనే వద్దంటున్న టీడీపీకి గౌరవ స్థానాన్ని కల్పించిన ఘనత ఉత్తరాంధ్రలోని విశాఖకే చెల్లింది. ఒకవైపు రాజధాని కోసం మిగిలిన ప్రాంతాలకు చంద్రబాబు రాజకీయంగా వ్యతిరేకి అయ్యారు.
ఎవరి కోసమైతే అందరికీ వ్యతిరేకమయ్యారో, అలాంటి వారే చంద్రబాబును ఆదరించకపోవడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గుంటూరు, విజయవాడలో వచ్చిన ఫలితాలతో పోల్చుకుంటే విశాఖ, తాడిపత్రి, మైదుకూరులో టీడీపీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కాయని చెప్పక తప్పదు. ఇప్పటికైనా కొందర్ని గుడ్డిగా ప్రేమించడం, ఇతర ప్రాంతాలను వ్యతిరేకించడమనే విధానానికి స్వస్తి పలికి …చంద్రబాబు కళ్లు తెరవాల్సిన ఆవశ్యకతను ఈ ఎన్నికలు చెప్పకనే చెప్పాయి.