ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు …బీజేపీని దెబ్బకొట్టే ప్లానా?

ఏపీలో ప్రత్యేకించి విశాఖ పట్టణంలో కొంతకాలంగా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది. ఈ కథలో పిట్టకథలాగా ఈమధ్య తెలంగాణా మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అవసరమైతే నేరుగా…

ఏపీలో ప్రత్యేకించి విశాఖ పట్టణంలో కొంతకాలంగా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది. ఈ కథలో పిట్టకథలాగా ఈమధ్య తెలంగాణా మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అవసరమైతే నేరుగా విశాఖకు వెళ్లి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి అనుమతి తీకుంటానని అన్నారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో తెలంగాణా రాజకీయాల్లో విశాఖ ఉక్కు ప్రకంపనలు మొదలయ్యాయి.

దీంతో కేటీఆర్ ఇదే విషయాన్ని మరోసారి గట్టిగా నొక్కి చెప్పారు. ఏపీ భారతదేశంలో భాగం కాదా ? అని ప్రశ్నించారు. ఇవాళ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తారు. రేపు సింగరేణి గనులను, తెలంగాణలోని మరో కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తారు ? అప్పుడు మాకు ఎవరు మద్దతు ఇస్తారు అని అడిగారు. నేను ఏపీకి ఎందుకు పోవొద్దు అని ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తే రేపు తెలంగాణలో ఇలాంటిది ఏమైనా జరిగితే అక్కడివారు  మద్దతు ఇస్తారనే ఆశ కావొచ్చు.

సరే ఆయన ఆశ ఏదైనా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ ప్రకటన చేయగానే బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు ఆయన మీద విరుచుకుపడ్డాయి. తెలంగాణలోని ప్రధానంగా హైదరాబాదులోని ఆంధ్రుల ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా అని ఆరోపించాయి. కన్నతల్లికి తిండి పెట్టలేనోడు చిన్నమ్మకు  బంగారు గాజులు చేయిస్తానన్నాడట అని బీజేపీ నాయకురాలు విజయశాంతి విరుచుకుపడింది. ఉక్కు ఉద్యమంపై టీవీల్లో జరిగే చర్చా కార్యక్రమాల్లో కూడా ఏపీ బీజీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే మండిపడుతున్నారు. 

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై వార్తలు వచ్చిన తొలి రోజుల్లో ప్రైవేటీకరణను ఆపుతామని ఊదరగొట్టారు. కానీ ఎప్పుడైతే మంత్రులు పార్లమెంటులో ప్రైవేటీకరణ తప్పదని ప్రకటనలు చేశారో అప్పటినుంచి బీజేపీ నాయకులు చెలరేగిపోతున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించేవారిని దేశద్రోహులుగా చూస్తున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించాడుగాని ఆయన అక్కడికి వెళతాడా? లేదా ? అనేది స్పష్టంగా తెలియదు. బడ్జెట్ సమావేశాలు అయ్యాక కేసీఆర్ అనుమతి తీసుకొని వెళతానన్నాడు. 

మరి ఆయన ఏమంటాడో. సరే జరిగేది ఎలా ఉన్నా కేసీఆర్ ప్రకటనను ఆంధ్రాలో ఉద్యమకారులు స్వాగతించారు. ఆయన చిత్ర పటానికి పాలాభిషేకాలు చేశారు. తమకు ఓ అండ దొరికినట్లు ఫీలయ్యారు. అయితే కేటీఆర్ విశాఖ వెళ్లి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన ప్రైవేటీకరణ ఆగదు. ఢిల్లీలో సుదీర్ఘ కాలంగా జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని చూస్తున్నాం. కేంద్రం  పట్టిన పట్టును వీడలేదు కదా. విశాఖ ఉద్యమం కూడా అంతే. 

విశాఖ ఉద్యమం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పిస్తామంటున్నారు. ముఖ్యంగా లోక్ సభలో ఆర్ధిక మంత్రి  నిర్మాలాసీతారామన్ లిఖిత పూర్వక సమాధానం తరువాత ఉద్యమ రూపం మారింది. ఇక విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికే కేంద్రం సిద్ధమైందని వంద శాతం స్పష్టత రావడంతో కార్మిక సంఘాలు ఉద్యామానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నాయి.

ఇందులో భాగంగా ఇప్పటికే ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిసింది ఉక్కు పరిరక్షణ కమిటీ. విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరానికి కేటీఆర్ ను పోరాట కమిటీ నాయకులు ఆహ్వానించారు. ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్, కో–కన్వీనర్‌ గంధం వెంకటరావులు.. హైదరాబాద్ వెళ్లి.. కేటీఆర్‌ను కలిశారు. స్టీల్‌ప్లాంట్‌ పరిస్థితులు, ప్రభుత్వ విధానం, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఉద్యమ విధానం అన్ని ఆయనకు వివరించారు. 

తనను కలిసిన కార్మిక సంఘాలకు కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారట.  ఉక్కు పరిరక్షణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని కేటీఆర్‌ మరోసారి స్పష్టం చేసినట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. అయితే బడ్జెట్‌ సమావేశాల తరువాత.. కేసీఆర్ తో మాట్లాడి తాను నేరుగా విశాఖ వస్తానని వారికి హామీ ఇచ్చారట.  కేటీఆర్ హామీతో.. ఆయన కచ్చితంగా విశాఖ వస్తారని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఆయన వస్తారని అంచనా వేస్తున్నారు. 

నిజంగా కేటీఆర్ వచ్చి ఉద్యమానికి జై కొడితే.. తమ పోరాటం కొంతమేర సక్సెస్ అయిట్టే అని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. కేటీఆర్ లాంటి వారు నేరుగా ఉద్యమంలో పాల్గొంటే రాజకీయంగా గుర్తింపు వస్తుందని.. జాతీయ స్థాయిలో అందరి ఫోకస్ తమ ఉద్యమంపై పడుతుందని. అలాగే ఏపీలో రాజకీయ నేతలపైనా ఒత్తిడి పెరిగి అందరూ ముందుకు వస్తారని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి జై కొట్టారని.. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.  అయితే ఈ విమర్శలకు  కేటీఆర్ వెంటనే సమాధాం చెప్పారు.. ఆ విమర్శలు నిజం కాదని  నిరూపించాలి అంటే కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా విశాఖకు వెళ్లాల్సి ఉంటుంది. 

అలా రావడం టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని గట్టిగా ఢీ కొనాలి అంటే సెటిలర్ల ఓట్లు టీఆర్ఎస్ కు చాలా కీలకం అవుతాయి. సాధరణంగానే బీజేపీ నేతలపై ఏపీ ప్రజల్లో ఆగ్రహ ఉంది. 

దీనికితోడు ఇప్సుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనతో బీజేపీపై ఏపీ ప్రజలకు కోపం పెరిగింది అన్నది వాస్తవం.. ఇలాంటి సమయంలో కేటీఆర్ నేరుగా వచ్చి ఉద్యమంలో పాల్గొంటే.. సెటిలర్ల ఓట్లు కచ్చితంగా టీఆర్ఎస్ కే పడే అవకాశం ఉంటుంది.

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం