స‌ర్ ప్రైజింగ్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘ది గేమ్’

క‌థ మొత్తం నేల విడిచి సాము చేస్తుంది. ఏమాత్రం న‌మ్మ‌శ‌క్యం కాని రీతిలో జ‌రిగే క‌థే. అయితే ట్విస్టింగ్ లాజిక్ ల‌తో ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోయే ఎంట‌ర్ టైన్ మెంట్ ను అందించే సినిమా '…

క‌థ మొత్తం నేల విడిచి సాము చేస్తుంది. ఏమాత్రం న‌మ్మ‌శ‌క్యం కాని రీతిలో జ‌రిగే క‌థే. అయితే ట్విస్టింగ్ లాజిక్ ల‌తో ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోయే ఎంట‌ర్ టైన్ మెంట్ ను అందించే సినిమా ' ది గేమ్'. క‌థ‌లో భాగంగా ఒక ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచాన్ని సృష్టించి, ఏది వాస్త‌వ‌మో, ఏది గేమ్ లో భాగ‌మో అర్థం కాని  రీతిలో ప్రేక్ష‌కుడికి ఈ సినిమా ఇచ్చే స‌ర్ ప్రైజ్ అలాంటిలాంటిది కాదు. క‌థ‌లో అప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించిన ఒక్కో పాత్రా.. క్లైమాక్స్ లో ఒకే చోట మ‌రో ర‌కంగా క‌నిపిస్తూ ఇచ్చే ట్విస్ట్ లు అదిరిపోతాయి. చాలా ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్విస్ట్ ల‌తో ఈ సినిమా క‌థ‌ను అల్లుకున్న ఒరిజిన‌ల్ ఐడియా, దాన్ని చ‌క్క‌గా ఎగ్జిక్యూట్ చేసిన తీరు ద‌ర్శ‌కుడు డేవిడ్ ఫించ‌ర్ ప‌ని త‌నానికి నిద‌ర్శ‌నంగా ఉంటుంది. అత్యుత్త‌మ స్థాయి న‌ట‌న‌తో, నేర్పుతో అల్లుకున్న స్క్రిప్ట్ తో క్లాసిక్ థ్రిల్ల‌ర్ గా నిలిచిపోయిన సినిమా 'ది గేమ్స‌.

అంద‌రూ ఉన్నా, అన్నీ ఉన్నా.. ఒంట‌రిగా బ‌తుకీడుస్తున్న త‌న అన్న నికోల‌స్ కు ఎంట‌ర్ టైన్ మెంట్ కోస‌మ‌ని ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేయ‌మ‌ని స‌ల‌హా ఇస్తాడు త‌మ్ముడు కాన్. చిన్న‌త‌నంలో త‌మ‌ తండ్రి ఆత్మ‌హ‌త్య ప్ర‌భావం గ‌ట్టిగా ప‌డి ఉంటుంది నికోల‌స్ పై. అనునిత్యం క‌ల‌లో ఆ ఘ‌ట‌నే వ‌స్తూ ఉంటుంది. అత‌డి భ‌యం ఏమిటంటే.. త‌న జీవితం కూడా త‌న తండ్రిలాగానే ముగుస్తుందేమో అని. అంత‌ర్లీనంగా ఆ భ‌యం వెంటాడుతూ ఉంటుంది. పెద్ద భ‌వ‌నం మీద నుంచి త‌న తండ్రి దూకి చ‌నిపోయిన వైనం క‌ల‌లో లీల‌గా వెంటాడుతూ ఉంటుంది అత‌డిని. ఈ మాన‌సిక ప‌రిస్థితిలో ఉన్న నికోల‌స్ త‌న వాళ్ల‌ను దూరం చేసుకుంటూ ఉంటాడు. 

భార్య‌కు విడాకులు ఇచ్చేసి ఒక పెద్ద భ‌వ‌నంలో ఒక్క‌డే బ‌తుకుతూ ఉంటాడు. ప‌ని చేసి పెట్ట‌డానికి ఒక వృద్ధ ప‌నిమనిషి. ఆఫీసుకు వెళ్తే ఒక లేడీ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్. చాలా మంది నికోలస్ ను డిన్న‌ర్ కు పిలుస్తుంటారు, బ‌య‌ట క‌లుద్దామంటూ ఉంటారు. అయితే నికోల‌స్ అంద‌రి ఆహ్వానాల‌నూ స్కిప్ చేస్తూ త‌ను, త‌న వృత్తే జీవితంగా బ‌త‌కుతూ ఉంటాడు. త‌న పుట్టిన రోజున ఎవ‌రైనా హ్యాపీ బ‌ర్త్ డే అంటూ చెప్పినా ఇబ్బందిక‌రంగా మొహం పెట్టేంత ఒంట‌రిత‌నంలో జీవిస్తూ ఉంటాడు. స‌రిగ్గా అలాంటి పుట్టిన రోజున త‌మ్ముడు కాన్ ఒత్తిడి చేయ‌డంతో డిన్న‌ర్ క‌ని వెళ్తాడు నికోల‌స్. ఆ సంద‌ర్భంగా నికోల‌స్ కు కాన్ ఒక గిఫ్ట్ కార్డ్ ఇస్తాడు. ఒక రిక్రియేష‌న్ క్ల‌బ్ గిఫ్ట్ కార్డ్ అది. 

క‌స్ట‌మ‌ర్ రిక్రియేష‌న్ స‌ర్వీసెస్ అని ఒక క్ల‌బ్ ఉంద‌ని, ఆ గిఫ్ట్ కార్డ్ తో ఆ క్ల‌బ్ కు వెళితే వారు నిన్నో గేమ్ లో జాయిన్ చేసుకుంటార‌ని కాన్ చెబుతాడు. త‌ను ఆల్రెడీ అలాంటి గేమ్ లో కొన‌సాగుతున్న‌ట్టుగా, నువ్వు కూడా జాయిన్ కావొచ్చ‌ని చెబుతాడు కాన్. అనాస‌క్తిగానే ఆ క్ల‌బ్ అడ్ర‌స్ కు వెళ్తాడు నికోల‌స్. ఆ గేమ్ లో జాయిన్ కావాలంటే ఒక సుదీర్ఘ‌మైన మెంట‌ల్ ఎలిజిబుల్ టెస్ట్ లో పాస్ కావాలంటూ.. బోలెడ‌న్ని తింగ‌రి కొశ్చ‌న్ ల‌తో టెస్ట్ పెడ‌తారు నిర్వాహ‌కులు. ఆ టెస్టే నికోల‌స్ ను బాగా విసిగిస్తుంది. ఎట్ట‌కేల‌కూ పూర్తి చేస్తాడు. నికోల్ ఆ టెస్టులో ఫెయిల్ అంటూ అత‌డి ఫోన్ కు మెసేజ్ వ‌స్తుంది. కాబ‌ట్టి గేమ్ లో ఛాన్స్ లేదంటారు. కానీ, ఆ రోజు రాత్రే..  మ‌ళ్లీ గేమ్ మొద‌లైంది అంటూ.. స‌మాచారం ఇస్తారు నిర్వాహ‌కులు.

ఇంత‌కీ ఆ గేమ్ ఏమిటి? ఎలా సాగుతుంది అనే అంశాల గురించి నికోల‌స్ కు కానీ, ప్రేక్ష‌కుల‌కు కానీ ముందుగా ఎలాంటి క్లూ ఇవ్వ‌డు ద‌ర్శ‌కుడు. నికోల‌స్ జీవితంలో మాత్రం చాలా అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌లు మొద‌ల‌వుతాయి. రాత్రి ఇంటికి వెళ్లే స‌రికి త‌న ఇంటి భ‌వంతి నుంచి ఎవ‌రో దూకి చ‌నిపోయిన‌ట్టుగా ఒక శవం ప‌డి ఉంటుంది. తీరా ద‌గ్గ‌ర‌కు వెళ్లి చూస్తే.. అది శ‌వం కాదు ఒక బొమ్మ‌. ఆ బొమ్మ‌ను ఇంట్లోకి తీసుకెళ్తాడు. బిజినెస్ న్యూస్ చూస్తూ ఉంటే.. న్యూస్ రీడ‌ర్ టీవీ నుంచినే నికోల‌స్ తో సంభాష‌ణ మొద‌లుపెడ‌తాడు. అదెలా సాధ్య‌మ‌ని నికోల‌స్ ఆశ్చ‌ర్య‌పోతాడు. ఇంట్లో కెమెరాలు సెట్ చేశార‌ని అర్థం అవుతుంది. త‌న ఇంట్లోకి ఎలా ప్ర‌వేశించారంటూ టీవీ ప్ర‌జెంట‌ర్ ను నిల‌దీస్తే.. నికోల్ స్వ‌యంగా ఇంట్లోకి తీసుకొచ్చిన బొమ్మ‌లో కెమెరా ఉంద‌నే విష‌యాన్ని అత‌డికి తెలియ‌జేస్తారు. ఇదంతా గేమ్ లో భాగ‌మ‌ని చెబుతారు. ఇలా కాస్త స‌ర‌దాగా, మ‌రికాస్త మిస్టీరియ‌స్ గా మొద‌ల‌య్యే ఈ గేమ్ లో నికోల‌స్ రోజు రోజుకూ చుక్క‌లు క‌నిపించ‌డం మొద‌ల‌వుతుంది. 

అనేక మంది నికోల్ ను వెంటాడుతున్న‌ట్టుగా అనిపిస్తుంటుంది. గేమ్ లో భాగ‌మ‌య్యే యాక్టివిటీస్ అనేకం నికోల్ ప్రాణాల మీద‌కు వ‌స్తుంటాయి. తృటిలో అలాంటి ప్ర‌మాదాల నుంచి బ‌య‌ట‌ప‌డుతూ ఉంటాడు. ఈ గేమ్ అంటే విసిగెత్తిపోయి ఆ సీఆర్ఎస్ ఆఫీసుకు వెళితే అక్క‌డ ఏమీ ఉండ‌దు! ఆఫీసు అబ‌ద్ధ‌మని అర్థం అవుతుంది! దీంతో త‌న లాయ‌ర్ కు స‌మాచారం ఇచ్చి, ఎఫ్బీఐకి రిపోర్ట్ చేస్తాడు. ఎఫ్బీఐ అధికారులు రంగంలోకి దిగి, ఈ గేమ్ పూర్వాప‌రాలు ఆరా తీస్తారు. అప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిందంతా తెలుసుకుని, కూపీ లాగేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందులో చాలా వాటికి ప‌రిశోధ‌న అధికారులు లాజిక‌ల్ గా నికోల‌స్ కు స‌మాధానం ఇస్తారు. సీఆర్ఎస్ కు సంబంధించిన వివ‌రాలు మాత్రం మిస్ట‌రీగానే మిగిలిపోతాయి.

ఈ క్ర‌మంలో ఈ గేమ్ నిర్వాహ‌కులు ఏర్పాటు చేసిన ఒక యువ‌తి నికోల‌స్ కు ద‌గ్గ‌ర‌వుతుంది. త‌న‌ను గేమ్ నిర్వాహ‌కులే ఏర్పాటు చేశార‌ని ఆమె చెబుతుంది. ఆమెతో నికోల్ స‌న్నిహితంగా ఉన్న‌ట్టుగా కొన్ని ఫొటోలు అత‌డికే హోట‌ల్ రూమ్ లో దొరుకుతాయి. త‌ను చాలా పెద్ద ట్రాప్ లో చిక్కుకున్న‌ట్టుగా  నికోల్ కు అర్థం అవుతుంది. ఇంత‌లో త‌మ్ముడు కాన్ కూడా నికోల్ ద‌గ్గ‌ర‌కు చేరి గోడు వెళ్ల‌బోసుకుంటాడు. గేమ్ నిర్వాహ‌కులు త‌న‌ను కూడా మోసం చేశారంటూ వాపోతాడు. త‌న ఆస్తి స‌ర్వాన్నీ వారు దోచేశార‌ని, త‌న ప్రాణాల‌ను తీస్తార‌ని భ‌యంగా ఉదంటూ నికోల్ ద‌గ్గ‌ర ఏడ్చిపెడ‌బొబ్బ‌లు పెడతాడు కాన్. అంతే కాదు.. నికోల్ ద‌గ్గ‌ర దొరికిన కీస్ ను బ‌ట్టి.. ఇత‌డిని కూడా అనుమానిస్తాడు కాన్. నిర్వాహ‌కులు నికోల్ ను కూడా వాడుకుంటూ త‌న ప్రాణాల‌ను తీయాల‌ని చూస్తున్నారంటూ కాన్ పారిపోతాడు. గేమ్ ఆడ‌మంటూ త‌న‌కు గిఫ్ట్ కార్డ్ ఇచ్చిన త‌మ్ముడే ఆ గేమ్ మొత్తం మోస‌మ‌ని వాపోయే స‌రికి నికోల్ మ‌రింత నిశ్చేష్టుడు అవుతాడు.

ఇది వ‌ర‌కూ గేమ్ లో భాగంగా ప‌రిచ‌యం అయిన యువ‌తి ద‌గ్గ‌ర‌కు వెళ్లి అస‌లు ఈ మోసం వెనుక ఎవ‌రున్నారంటూ నిల‌దీస్తాడు నికోల‌స్. ఇంత‌లో వారిని కొంద‌రు గ‌న్ మెన్ వెంబ‌డిస్తారు. అక్క‌డ నుంచి పారిపోయే స‌మ‌యంలో ఆ యువ‌తి నికోల్ ను మ‌రింత‌గా న‌మ్మిస్తుంది. నీ బ్యాంక్ అకౌంట్ల నుంచి డ‌బ్బు మొత్తం మాయ‌మైంద‌ని చెబుతుంది. నిజ‌మో కాదో తెలుసుకోవ‌డానికి క‌స్ట‌మ‌ర్ కేర్ కు కాల్స్ చేస్తాడు నికోల్. ఆ స‌మ‌యంలో మ‌రిన్ని క్లూస్ తెలుసుకుని.. అప్పుడు అత‌డి అకౌంట్ల నుంచి డ‌బ్బును మాయం చేస్తారు! ఆ యువ‌తి కూడా త‌న‌ను మోసం చేస్తోంద‌ని నికోల్ కు చాలా లేట్ గా అర్థం అవుతుంది. 

అత‌డికి మందులో ఇచ్చిన డ్ర‌గ్స్ తో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోతాడు. తీరా లేచేస‌రికి మెక్సికోలో ఉంటాడు. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేని ప‌రిస్థితుల్లో అక్క‌డి అమెరిక‌న్ ఎంబ‌సీకి వెళ్లి త‌ను టూర్ కు వ‌స్తే త‌న‌ను మోసం చేశారంటూ చెబుతాడు. నికోల్ చేతిలోని వాచ్ తీసుకుని.. అమెరికాకు చేరేందుకు అవ‌కాశం ఇస్తాడు అక్క‌డి అధికారి. తిరిగి త‌న సొంతూరికి వెళ్లిన నికోల్ కు ఈ గేమ్ ముఠా ఆట క‌ట్టించాల‌నిపిస్తుంది. త‌ను కోల్పోయేందుకు ఇంకేం లేద‌ని పోరాటం మొద‌లుపెడ‌తాడు. 

ఈ క్ర‌మంలో.. అత‌డికి ఇంకా మ‌రెన్నో విస్మ‌య‌క‌ర‌మైన విష‌యాలు తెలుస్తాయి. త‌ను ఆడిన గేమ్ వెనుక ఎవ‌రున్నారు, అస‌లు త‌న‌ను ఏ ఉద్దేశంలో ఆ గేమ్ ఆడించారో తెలుస్తుంది. ఇలా ఎన్నో ట్విస్ట్ లు, మ‌రెన్నో ట‌ర్న్స్ తో సాగే 'ది గేమ్' థ్రిల్ల‌ర్ సినిమాల‌ను చూడాల‌నుకునే వారికి అప‌రిమిత‌మైన స‌ర్ ప్రైజ్ గా నిలుస్తుంది. 'గాన్ గ‌ర్ల్' ద‌ర్శ‌కుడు డేవిడ్ ఫించ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా క్లాసిక్ మిస్ట‌రీగా నిలిచింది. అంతే కాదు.. ఈ త‌ర‌హాలో అనేక సినిమాలు రావ‌డానికి కూడా మూలంగా నిలిచింది. ది గేమ్ 1997లో రాగా.. ఈ త‌ర‌హా కాన్సెప్ట్ ను తెలుగులో కూడా అరుదుగా వాడారు. 

నీలకంఠ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'నంద‌న‌వ‌నం 120 కిలోమీట‌ర్స్' సినిమాకు ఇన్సిపిరేష‌న్ బ‌హుశా 'ది గేమ్' అయి ఉండ‌వ‌చ్చు. నంద‌న‌వ‌నం సాఫ్ట్ గా సాగిపోయే సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అయితే,  ఇది యాక్ష‌న్ ప్యాక్డ్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్. అయితే మూల‌క‌థ‌లో కూడా నంద‌న‌వ‌నంలో చాలా మార్పు క‌నిపిస్తుంది. నంద‌న‌వ‌నం బిగ్గెస్ట్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ది గేమ్ మాత్రం చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో అంతుబ‌ట్ట‌ని రీతిలో సాగుతుంది.

-జీవ‌న్ రెడ్డి.బి