అక్కడ పార్టీ నిర్ణయం… ఇక్కడ అధినేత ఇష్టారాజ్యం

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో మమతా బెనర్జీని ఓడించిన సువెందు అధికారి మమతా బెనర్జీకి నైతిక విలువలు లేవని అన్నాడు. ఆయన ఎందుకలా అన్నాడు? మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన…

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో మమతా బెనర్జీని ఓడించిన సువెందు అధికారి మమతా బెనర్జీకి నైతిక విలువలు లేవని అన్నాడు. ఆయన ఎందుకలా అన్నాడు? మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. టీఎంసీ అఖండ విజయం సాధించినా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. అంటే పార్టీకి బ్రహ్మరథం పట్టిన జనం మమతా బెనర్జీని ఆదరించలేదు. ఒక విధంగా ఇది మమతకు అవమానమే. 

ఇది ఆమె సొంత పార్టీ కాబట్టి తన ఓటమిని పట్టించుకోని ఆమె ముఖ్యమంత్రి పీఠం అలంకరించింది. ఎన్నికల్లో ఓడిపోయినా సీఎం అయ్యే అవకాశం ఉంది. అయ్యాక ఏదో ఒక చట్ట సభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. ఇంతటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆమె ఉపయోగించుకుంటోంది. చట్ట ప్రకారం అందులో తప్పులేదు. కానీ సువెందు అధికారి మమతకు నైతిక విలువలు లేవని అన్నాడు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించడం అనేది నాయకుల వ్యక్తిగత విషయం.

పాతకాలపు రాజకీయాల్లో నాయకులు నైతిక విలువలు పాటించారుగానీ ఇప్పటి రాజకీయాల్లో నైతిక విలువలు పాటించేవారు కనబడతారా ? పార్టీకి అఖండ మెజారిటీని ఇచ్చిన ప్రజలు తనను ఎందుకు ఇష్టపడలేదు ? ఎందుకు ఓడించారు ? తనలో ఏం లోపం ఉంది ? అని ఆమె విశ్లేషించుకుని ఉండదు. టీఎంసీ అనేది తన సొంత ఆస్తి. దీనిపై తనకు సర్వ హక్కులు ఉన్నాయి. ఇది తన కష్టార్జితం. కాబట్టి నైతిక విలువల పేరుతో తన పార్టీని మరొకరికి అప్పగించడమా ? తన ఆస్తిని మరొకరు అనుభవించడమా ? అది జరగడానికి వీల్లేదు. మళ్ళీ పోటీ చేసే హక్కు తనకుంది.

చేపట్టిన ముఖ్యమంత్రి పదవికి చట్ట ప్రకారం ఆమోద ముద్ర వేయించుకునే హక్కు తనకుంది. కాబట్టి నైతిక విలువలంటూ మడిగట్టుకొని కూర్చుంటే పార్టీ మటాషే. ఇదీ మమత ఆలోచన. సువెందు అధికారి ఓ ఉదాహరణ చెబుతూ 1996 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీపీఎం ముఖ్యమంత్రి అత్యుతానందన్ ఎన్నికల్లో ఓడిపోయాడని, పార్టీ మాత్రం మెజారిటీ సాధించిందని, అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కాలేదని నైతిక విలువలకు ఉదాహరణగా చెప్పాడు. అయితే బెంగాల్ లో టీఎంసీకి, మమతా బెనర్జీకి, కేరళలో సీపీఎం కు , అత్యుతానందన్ కు చాలా తేడా ఉంది.

సీపీఎం అత్యుతానందన్ సొంత పార్టీ కాదు. కాబట్టి ఆయనకు దానిపై ఎలాంటి హక్కులు లేవు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశంలేదు. ఆయన ఓడిపోయినా చట్ట ప్రకారం మళ్ళీ పోటీ చేయొచ్చు. కానీ ఓడిపోయిన నాయకుడు ముఖ్యమంత్రి కాకూడదని పార్టీ నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం ఆయన నడుచుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లో జ్యోతి బసు ఎంత గొప్ప నాయకుడో అందరికీ తెలుసు. ఒకసారి ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. కానీ పార్టీ వద్దు అని చెప్పింది. అంతే…పక్కకు తప్పుకున్నాడు.

ప్రాంతీయ పార్టీల్లో అధినేత ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. కాదనేందుకు ఎవరికీ అధికారం లేదు. ప్రాంతీయ పార్టీ ఒక ఆస్తి కాబట్టి ఇతర ఆస్తుల మాదిరిగానే అది వారసులకు దక్కాలి. ప్రాంతీయ పార్టీల్లో సమష్టి నిర్ణయాలు ఉండవు. ప్రాంతీయ పార్టీలకు సమర్థులైన వారసులు లేకపోతే దాన్ని స్థాపించిన అధినేతలు పోయాక అవి కనుమరుగవుతాయి. లేదా చీలికలు పీలికలవుతాయి. తెలంగాణలో టీఆరెస్ అధినేత కేసీఆర్ కు వారసుడిగా కేటీఆర్ ఉన్నాడు.

ఆంధ్రాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సరైన వారసుడు లేడు. బాబు తరువాత పార్టీని నడిపించడం కుమారుడు లోకేష్ వల్ల అవుతుందా అనే సందేహం ఉంది. జగన్ పార్టీ వైసీపీకి వారసులు ఎవరో తెలియదు. పశ్చిమ బెంగాల్ లో మమతకు వారసులు లేరు. కాబట్టి జాతీయ పార్టీల మాదిరిగా ప్రాంతీయ పార్టీల మనుగడ సుదీర్ఘ కాలం ఉండటం అరుదు.