తమ్ముళ్లు పార్టీ కోసం పాటు పడతారు. నిజానికి అధినాయకుడి కంటే కూడా గట్టిగా నిలబడి వాయిస్ పెంచుతారు. వారెపుడూ పదవులు కోరుకోరు. తమ పార్టీ జెండా ఎగరాలనే ఆశపడతారు. అలాంటి తమ్ముళ్ళు చాలా మంది విశాఖలో కరోనా వేళ బలి అయిపోయారు. మరి విశాఖ వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వారిని పరామర్శించారా. వారి కుటుంబాలకు భరోసా ఇచ్చారా.
ఇదే ప్రశ్నను వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ బాగానే వేస్తున్నారు. నీకు తమ్ముళ్ళ కంటే కూడా కుల రాజకీయాలు ఎక్కువైపోయాయా లోకేషూ అంటూ గట్టిగానే మాట్లాడారు. శవ రాజకీయాలు చేయడంతో తండ్రి చంద్రబాబుతో పోటీ పడుతున్న లోకేష్ కరోనా కాటుకు బలి అయిన సొంత పార్టీ నేతల కుటుంబాలను మాత్రం అసలు పట్టించుకోలేదని ఆయన అన్నారంటే దాన్ని రాజకీయ విమర్శగా పక్కన పెట్టగలరా.
ఇక లోకేష్ పర్యటల మీద మరో కామెంట్ కూడా వస్తోంది. గత ఏడాది ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ తో దాదాపుగా పదిహేను మంది దాకా మరణించారు. వందలాది మంది జబ్బు పడ్డారు. మరి విశాఖ టూర్ కి పర్మిషన్ కావాలని నాడు లాక్ డౌన్ వేళ చంద్రబాబు కేంద్రాన్ని పర్మిషన్ కూడా అడిగారు.
ఆ తరువాత చంద్రబాబు, లోకేష్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి వచ్చినా ఆ వైపు పోలేదు అన్న విమర్శ కూడా ఉంది. పోనీ ఇపుడు మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించిన వేళ అయినా కాస్తా అటుగా వెళ్తే పోయేది ఏముంది అన్న మాటా ఉంది.
ఏది ఏమైనా జగన్ని తిట్టాలి, అందుకు శవ రాజకీయాలు చేయాలి అన్న అజెండాతోనే లోకేష్ విశాఖ టూర్ పెట్టుకున్నారు అంటూ గుడివాడ అమరనాధ్ అంటున్నారు అంటే తమ్ముళ్ళూ ఆలోచించాల్సిందేనేమో.