మొద్దు నిద్ర‌లో ఏపీ స‌ర్కార్‌లో ఓ శాఖ‌

ఏపీ స‌ర్కార్‌లో ఓ విభాగం మొద్దు నిద్ర‌లో ఉన్న‌ట్టుంది. ఐదు రోజులుగా సాంకేతిక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక జ‌నాన్ని నానా తిప్ప‌లు పెడుతోంది. ఏపీ స‌ర్కార్‌లో వివిధ శాఖ‌ల ప‌నితీరుకు ఇదో మ‌చ్చుకు ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే.…

ఏపీ స‌ర్కార్‌లో ఓ విభాగం మొద్దు నిద్ర‌లో ఉన్న‌ట్టుంది. ఐదు రోజులుగా సాంకేతిక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక జ‌నాన్ని నానా తిప్ప‌లు పెడుతోంది. ఏపీ స‌ర్కార్‌లో వివిధ శాఖ‌ల ప‌నితీరుకు ఇదో మ‌చ్చుకు ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. గ‌త ఐదు రోజులుగా ఆంధ్ర‌ప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయాయి.  

స‌ర్వ‌ర్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఎక్క‌డిక‌క్క‌డ రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయాయి. క‌రోనా క‌ట్ట‌డి నేప‌థ్యంలో ఏపీ వ్యాప్తంగా ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కే దుకాణాలు , ర‌వాణా వ్య‌వ‌స్థ ప‌ని చేసేందుకు పోలీసులు అనుమ‌తిస్తున్నారు. ఆ త‌ర్వాత ఇళ్ల నుంచి బ‌య‌టికొస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉద‌యం 8 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ల కార్యాల‌యాలు ప‌ని చేస్తున్నాయి. ఆ నిర్ణీత స‌మ‌యంలోపు రిజిస్ట్రేష‌న్లు పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఏదైనా పెండింత్ ప‌డితే ఆ త‌ర్వాత రోజు మ‌ళ్లీ వెళ్లాల్సి ఉంది. దీంతో భూక్ర‌య‌విక్ర‌యాలు, ఇత‌ర‌త్రా ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేష‌న్ల‌కు వెళ్ళితే నిరాశ ఎదుర‌వుతోంది. 

గ‌త ఐదు రోజులుగా రిజిస్ట్రేష‌న్ల కార్యాల‌యాల‌కు ప్ర‌జ‌లు వెళ్ల‌డం, స‌ర్వ‌ర్ ప‌నిచేయ‌లేద‌ని సిబ్బంది స‌మాధానంతో వెనుతిర‌గ‌డం ప‌రిపాటిగా మారింది. ఒక‌ట్రెండు రోజులు స‌మ‌స్య త‌లెత్తిందంటే అర్థం చేసుకోవ‌చ్చ‌ని, రోజులు గ‌డుస్తున్నా క‌నీసం ప‌రిష్క‌రించాల‌నే ఆలోచ‌న‌, స్పృహ సంబంధిత శాఖ ఉన్న‌తాధికారుల్లో కొర‌వ‌డింద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

రిజిస్ట్రేష‌న్లు ఆగిపోవ‌డంతో ప్ర‌భుత్వ ఆదాయానికి గండి ప‌డ‌డంతో పాటు ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌య ప్ర‌యాస‌ల‌కు లోను కావాల్సి వ‌స్తోంద‌నే ఆవేద‌న‌, ఆగ్ర‌హం క‌నిపిస్తోంది.

ఇదే మాదిరిగా రెవెన్యూశాఖ‌లో కూడా ఆడంగ‌ల్ క‌రెక్ష‌న్‌కు సంబంధించి ఏడాదిగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేదు. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను ప‌సిగ‌ట్టి స‌మస్య ప‌రిష్క‌రించే నెట్‌వ‌ర్క్ ప్ర‌భుత్వం వ‌ద్ద లేదా? ఈ క‌ష్టాలు ఇంకెన్నాళ్లు?