ప్రేమించిన వాడ్ని పెళ్లి చేసుకోవాలి. లేదంటే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించిన వ్యక్తిని మరిచిపోవాలి. ఈ రెండింట్లో ఏది జరక్కపోయినా విపరీత పరిణామాలకు అది దారితీస్తుంది. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. పెళ్లయినప్పటికీ, ప్రియుడ్ని మరిచిపోలేని భార్య.. ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.
అనంతపురం జిల్లా యాడికి మండలంలో ఉంటున్న శేఖర్ కు నాగమ్మతో పెళ్లయింది. అయితే శేఖర్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ నాగమ్మకు మాత్రం వరసకు బావ అయిన బలరాముడు అంటేనే ఇష్టం. అందుకే అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా చాన్నాళ్లు ఈ వ్యవహారం సాగింది.
అయితే భర్తకు విషయం తెలిసిపోయింది. నాగమ్మను కొట్టాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలిగించుకోవాలని చూసింది నాగమ్మ. బావ బలరాముడితో కలిసి పన్నాగం పన్నింది. ఓబులేసుకోన కొండకు వెళదామని చెప్పి ఉదయాన్నే భర్తను సిద్ధంచేసింది. వేకుమజామున బండిపై ఇద్దరూ బయల్దేరారు.
కొంతదూరం వెళ్లిన తర్వాత భర్తను ఓ చోట బండి ఆపమంది నాగమ్మ. అదే టైమ్ కు వాళ్లను మరో బైక్ లో ఫాలో అవుతూ వస్తున్న బలరాముడు అక్కడికి చేరుకున్నాడు. క్రికెట్ బ్యాట్ తో శేఖర్ తలపై గట్టిగా కొట్టాడు. అలా ఇద్దరూ కలిసి శేఖర్ ను చంపి, దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
అయితే పోలీసులు అంత అమాయకులు కాదు కదా. యాక్సిడెంట్ జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తంచేశారు. నాగమ్మను తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో నిజం ఒప్పుకుంది నాగమ్మ. శేఖర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.