విశ్వాస పరీక్షను ఎదుర్కొనకుండానే రాజీనామా విషయాన్ని ప్రకటించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్. గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని ఇవ్వబోతున్నట్టుగా ఆయన ప్రకటించడంతో..మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలినట్టుగా అయ్యింది. దాదాపు 15 నెలల పాటు అక్కడ కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. వచ్చిన బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపించారు కాంగ్రెస్ వాళ్లు.
అయితే జ్యోతిరాదిత్య సింధియా రూపంలో కాంగ్రెస్ సర్కారుకు ఆటంకం ఏర్పడింది. మొత్తం 22 మంది ఎమ్మెల్యేలతో సింధియా బీజేపీ వైపు చేరారు. వారిలో కొందరు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనాలంటూ బీజేపీ ఒత్తిడి మొదలుపెట్టింది. కరోనా భయాల నేపథ్యంలో విశ్వాస పరీక్షను వాయిదా వేసే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా జరిగే పని కాదని, ఎలాగూ విశ్వాస పరీక్షను ఎదుర్కొనక తప్పదని.. కమల్ నాథ్ కు అర్థం అయినట్టుగా ఉంది.
దీంతో రాజీనామా విషయాన్ని ప్రకటించారు. తన హాయంలో మధ్యప్రదేశ్ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేసిందంటూ ధ్వజమెత్తారు. ఇక కమల్ నాథ్ రాజీనామాతో భారతీయ జనతా పార్టీకి లైన్ క్లియర్ అయినట్టే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకునేలా ఉంది. కరోనా ఫియర్స్ నేపథ్యంలో.. ప్రమాణ స్వీకారాన్ని సింపుల్ గా ముగించేసే అవకాశాలు లేకపోలేదు. ప్రజల చేత 15 నెలల కిందట తిరస్కారం పొందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడు మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి.