దేశంలో కరోనా (కోవిడ్-19) వైరస్ చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తాజాగా ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 206కు చేరినట్టు ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకటించింది. అటు ఇండియాలో కరోనా మృతుల సంఖ్య తాజాగా 5కు చేరింది. 69 ఏళ్ల ఇటాలియన్ టూరిస్ట్ జైపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మృతిచెందాడు. అతడి భార్య మాత్రం కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. నిన్న ఒక్క రోజే దేశంలో 53 కొత్త కేసులు నమోదవ్వడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3కు చేరింది. సౌదీ అరేబియా నుంచి విశాఖకు వచ్చిన ఓ వ్యక్తికి టెస్టుల్లో పాజిటివ్ తేలింది. ప్రస్తుతం అతడ్ని క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడు నివశిస్తున్న అల్లిపురంలోని ఇంటికి చుట్టూ కిలోమీటర్ మేర క్లోరినేషన్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించారు. నిజానికి ఇతడు సౌదీ నుంచి నేరుగా రాలేదు.
65 ఏళ్ల ఈ వ్యక్తి అమెరికా నుంచి తన కుమార్తెను చూసేందుకు హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ నుంచి మక్కా వెళ్లాడు. తిరిగి హైదరాబాద్ వచ్చి 3 రోజులుండి, విశాఖ వచ్చాడు. దీంతో హైదరాబాద్ లో అతడి కుమార్తె ఉన్న ఇంటికి కూడా వైద్య బృందం వెళ్లింది. అంతేకాదు.. అతడు ప్రయాణించిన కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలో ఇతర పాసింజర్ల వివరాల్ని కూడా ఏపీ ప్రభుత్వం ఆరాతీస్తోంది. వాళ్లందర్నీ క్వారంటైన్ లో ఉంచబోతోంది.
తెలంగాణ ప్రభుత్వం కూడా విదేశీ ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టింది. ఇన్నాళ్లూ కొన్ని దేశాల నుంచి మాత్రమే వచ్చే ప్రయాణికుల్ని పరిశీలించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏ దేశం నుంచి వచ్చిన ప్రయాణికుడినైనా క్వారంటైన్ లో ఉంచుతోంది. అది కూడా వాళ్లను ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా నగర శివార్లలో ఉన్న రాజేంద్రనగర్, వికారాబాద్ ప్రాంతాలకు తరలిస్తోంది. తద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించగలుగుతోంది. అయినప్పటికీ తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య (విదేశీయులతో కలిపి) 16కు చేరుకుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్ని కరోనా వణికిస్తోంది. మృతుల సంఖ్యలో చైనాను ఇటలీ అధిగమించింది. చైనాలో ఇప్పటివరకు 3245 మంది కరోనా వల్ల మరణించగా.. ఇటలీలో ఈ సంఖ్య 3405కు చేరింది. ఈ రెండు దేశాల తర్వాత అత్యధికంగా ఇరాన్, స్పెయిన్, ఫ్రాన్స్ లో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలకు కరోనా విస్తరించింది.