సమంత మాకొద్దు: ఫ్యామిలీ మేన్ ‘తమిళ’ కష్టాలు

ఇలా ట్రయిలర్ రిలీజైందో లేదో అలా ఫ్యామిలీ మేన్ సీజన్-2కు తమిళనాట కష్టాలు మొదలయ్యాయి. తమిళ ఈలంను కించపరచడంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల మనోభావాల్ని దెబ్బతీశారంటూ ఇప్పటికే తమిళనాట ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.…

ఇలా ట్రయిలర్ రిలీజైందో లేదో అలా ఫ్యామిలీ మేన్ సీజన్-2కు తమిళనాట కష్టాలు మొదలయ్యాయి. తమిళ ఈలంను కించపరచడంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల మనోభావాల్ని దెబ్బతీశారంటూ ఇప్పటికే తమిళనాట ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఇప్పుడీ ఆందోళనల పర్వంలోకి ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా చేరింది.

ఫ్యామిలీ మేన్ సీజన్-2 ప్రసారాన్ని తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రసారమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది తమిళనాడు సర్కార్. ఆ లేఖలో తమ అభ్యంతరాల్ని స్పష్టంగా వెల్లడించింది. 

తమిళ ఈలం పోరాటాన్ని కించపరిచేలా ఫ్యామిలీ మేన్ సీజన్-2 ట్రయిలర్ ఉందని, లంకలో తమిళుల పోరాటంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల మనోభావాల్ని కించపరిచేలా ఆ ట్రయిలర్ ఉందని ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. మరీ ముఖ్యంగా తమిళం మాట్లాడే, తమిళ నటి సమంతను సిరీస్ లో ఉగ్రవాదిగా చూపించడాన్ని సర్కారు తప్పుపట్టింది. 

సమంతను ఇలా చూపించడం నేరుగా తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, ఆమెతో తమిళంలో మాట్లాడించడం కూడా అభ్యంతరకరమని అందులో ఆరోపించింది. కేవలం తమిళనాడులోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఎక్కడా ఫ్యామిలీ మేన్ సీజన్-2 ప్రసారమవ్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది.

మరో 10 రోజుల్లో (జూన్ 4) ఫ్యామిలీ మేన్ సీజన్ -2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈలోగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాట 4 రోజులుగా సాగుతున్న ఈ వివాదంపై సమంతతో పాటు మేకర్స్ ఎవ్వరూ ఇప్పటివరకు స్పందించలేదు.