కొన్నాళ్లుగా కరోనాతో బాధపడుతున్న ఎన్టీఆర్ ఎట్టకేలకు ఆ వైరస్ నుంచి బయటపడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తనకు కరోనా నెగెటివ్ వచ్చినట్టు ప్రకటించాడు ఈ హీరో. తను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పాడు.
మే 10వ తేదీన తనకు కరోనా సోకినట్టు ప్రకటించాడు ఎన్టీఆర్. ఆ వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. పెద్దగా లక్షణాలు లేనప్పటికీ కిమ్స్ కు చెందిన వైద్య బృందం ఆధ్వర్యంలో మెడిసిన్స్ తీసుకున్నాడు. ఐసొలేషన్ లోనే ఎన్టీఆర్ బర్త్ డే కూడా అయిపోయింది.
అలా 2 వారాలుగా ట్రీట్ మెంట్ తీసుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ సందర్భంగా వైద్యులకు థ్యాంక్స్ చెప్పాడు.
కొవిడ్-19ను సీరియస్ గా తీసుకోవాలంటున్న ఎన్టీఆర్.. అదే సమయంలో పాజిటివ్ దృక్పథంతో, సరైన జాగ్రత్తలతో దాన్ని ఎదుర్కోవచ్చని అంటున్నాడు. కరోనాపై పోరాటంలో భాగంగా వ్యక్తులంతా మానసిక స్థైర్యంతో ఉండాలని, అదే అన్నిటికంటే పెద్ద మెడిసిన్ అని అంటున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ చేయాల్సిన షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉంది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు తారక్.