తుది శ్వాస వ‌ర‌కూ రాజ‌కీయాల్లోనే…

రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డంపై విశ్వ‌న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ అధినేత క‌మ‌ల్‌హాస‌న్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ రాజ‌కీయాల్లో కొన‌సాగుతాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌క్క‌ల్…

రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డంపై విశ్వ‌న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ అధినేత క‌మ‌ల్‌హాస‌న్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ రాజ‌కీయాల్లో కొన‌సాగుతాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ అధినేత క‌మ‌ల్‌హాస‌న్ ఘోర పరాజ‌యాన్ని చ‌వి చూసిన సంగ‌తి తెలిసిందే. 

ఓట‌మి అనంత‌రం పార్టీ నుంచి ఒక్కొక్క‌రుగా ముఖ్య నాయ‌కులంతా బ‌య‌ట‌కు పోతుండ‌డం కూడా ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చింది. దీంతో ఇక ఆయ‌న రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెబుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్‌హాస‌న్ ఆ ప్ర‌చారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ ట్వీట్ చేశారు. త‌న పార్టీ శ్రేణుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు.

తుది శ్వాస వ‌ర‌కూ రాజకీయాల్లో కొనసాగుతానని కమలహాసన్‌ స్పష్టం చేశారు. మక్కల్‌ నీది మయ్యం నుంచి ఎంత మంది బయటకు వెళ్లినా, తాను మాత్రం రాజకీయ పయనాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వీడేది లేద‌ని స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటు సమయంలో నోరు మెదపని వాళ్లంతా ఇప్పుడు కుంటి సాకులు చెప్పడం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

పూర్వ కాలంలో వ్యాపారులు ఓ చోట పని ముగించుకుని మరో చోటకు వెళ్ల‌డాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఇక్కడ వ్యాపారం లేని దృష్ట్యా, మరో చోటకు వెళ్తున్నట్టుందని… పార్టీని వీడే వాళ్ల గురించి క‌మ‌ల్‌హాస‌న్ దెప్పి పొడిచారు. అలాంటి వ్యాపారులు ఎంత మంది పార్టీని వీడినా, తాను మాత్రం రాజకీయ పయనాన్ని కొనసాగిస్తానని స్ప‌ష్టం చేశారు. 

కావున కేడర్ అధైర్య పడొద్ద‌ని, మరింత ఉత్సాహంగా పనిచేద్దామని, మరింత బలాన్ని పంజుకునేలా శ్రమిద్దామని ఆయ‌న పిలుపునిచ్చారు. దీంతో మెగాస్టార్ చిరంజీవిలా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని క‌మ‌ల్‌హాస‌న్ ముగిస్తార‌నే ప్ర‌చారానికి ముగింపు ప‌లికిన‌ట్టైంది. మ‌రి ఇది ఎన్నాళ్లో చూడాలి.