ఇదేం బాస‌ట బాసూ…

బాస‌ట అంటే అండ‌గా నిల‌బ‌డ‌టం. ఆప‌ద‌లో ఉన్న వారి అవ‌స‌రాల‌ను తీర్చ‌డం బాస‌ట అవుతుంది. ఇబ్బందుల్లో ఉన్న వారి గురించి సానుభూతి, ప‌రామ‌ర్శల వ‌ల్ల ఒరిగేదేమీ ఉండ‌దు. ఓదార్పు పేరుతో ప్ర‌చారం పొంద‌డం త‌ప్ప‌.…

బాస‌ట అంటే అండ‌గా నిల‌బ‌డ‌టం. ఆప‌ద‌లో ఉన్న వారి అవ‌స‌రాల‌ను తీర్చ‌డం బాస‌ట అవుతుంది. ఇబ్బందుల్లో ఉన్న వారి గురించి సానుభూతి, ప‌రామ‌ర్శల వ‌ల్ల ఒరిగేదేమీ ఉండ‌దు. ఓదార్పు పేరుతో ప్ర‌చారం పొంద‌డం త‌ప్ప‌. దీన్నే ఛీప్ ట్రిక్స్ అంటారు. “క‌రోనా బాధితుల‌కు బాస‌ట” పేరుతో టీడీపీ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం చేసిన హ‌డావుడి కేవ‌లం ప‌బ్లిసిటీ స్టంట్ త‌ప్ప‌, ప‌బ్లిక్ స‌ర్వీస్ కాద‌ని తేలిపోయింది.

పిల్లాడు ఏడ్చేది పాల కోస‌మే అనే చందంగా, టీడీపీదంతా ప్ర‌చార యావే. క‌రోనా బాధితుల‌కు బాస‌ట పేరుతో టీడీపీ చేప‌ట్టిన ఆస్ప‌త్రుల సంద‌ర్శ‌న‌ను పోలీసులు అడ్డుకోవ‌డం, దానికి సంబంధించి ఆ పార్టీ అనుకూల ప‌త్రిక‌ల్లో ప‌తాక శీర్షిక‌ల్లో క‌థ‌నాలు, చాన‌ళ్ల‌లో గ‌గ్గోలు పెట్ట‌డాన్ని గ‌మనిస్తే ….ఓహో ఇందుకోసమా ఏడుపంతా అని ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది.  ఆక‌లిగొన్న వాళ్ల‌కు అన్నం, ద‌ప్పిక‌గొన్న వాళ్ల‌కు నీళ్లు అందిస్తే …అది బాస‌ట అవుతుంది.

కానీ టీడీపీ వాల‌కం చూస్తే, ప‌డిపోతున్న గ్రాఫ్‌ను ఎలా పెంచుకోవాల‌నే ఆతృత క‌నిపిస్తోంది. అలాగ‌ని ప్ర‌జ‌ల‌కు చేయూత ఇస్తోందా? అంటే , అబ్బే అదేం లేదు. జేబులో నుంచి రూపాయి ఖ‌ర్చు కాకుండానే , ఉచిత ప్ర‌చారం, ఆద‌ర‌ణ కావాలి.

క‌రోనా బాధితుల‌కు నిజంగా టీడీపీ బాస‌ట‌గా నిల‌బ‌డాల‌నే చిత్త‌శుద్ధి ఉంటే… సోనూసూద్‌, మెగాస్టార్ చిరంజీవి, రేణుదేశాయ్‌తో పాటు  ఇంకా అనేక మంది అదృశ్యంగా ఉంటూ రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్‌, బెడ్స్‌, మెరుగైన వైద్యం అందించాలి. క‌రోనా వ‌ల్ల త‌ల్లిదండ్రులు, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున ప‌డ్డ బాధితుల‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా అండ‌గా నిల‌బ‌డొచ్చు. కానీ ఆ ప‌ని టీడీపీ చేయ‌క‌పోగా, ఏదో చేస్తున్న‌ట్టు బిల్డ‌ప్‌.

ఈ దిక్కుమాలిన బాస‌ట నినాదాల‌తో రోగుల బాధ‌లు తీర‌వు. అంతెందుకు, ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీపై టీడీపీ ఇంత వ‌ర‌కూ ఎందుకు నోరు మెర‌ప‌లేదు. కార్పొరేట్ దోపిడీకి వ్య‌తిరేకంగా టీడీపీ ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తే ప్ర‌తి ఒక్క‌రూ స్వాగ‌తించేవాళ్లు. క‌రోనా రోగుల‌కు బాస‌ట‌గా ప్రైవేట్ దోపిడీకి వ్య‌తిరేకంగా టీడీపీ ఆందోళ‌న అని పిలుపునిచ్చే ఉంటూ…పార్టీకి రాజ‌కీయాల‌కు అతీతంగా బాస‌ట‌గా నిలిచేవారు. ఎందుకంటే కార్పొరేట్ ఆస్ప‌త్రుల దోపిడీకి కుల‌మ‌తాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ బాధితులే.  

నిజంగా క‌రోనా రోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వ‌దిలేసి, త‌మ‌కు సౌక‌ర్యంగా ఉన్న స‌బ్జెక్టుల‌ను ఎంచుకుని ఏదో చేస్తామంటే జ‌నం ప‌సిగ‌ట్ట‌లేని స్థితిలో లేరు. ఇలాంటి గిమ్ముక్కులు ఓట్లు రాల్చ‌వు. పార్టీపై ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెంచ‌దు. పైపెచ్చు ఏమిటీ చిల్ల‌ర చేష్ట‌ల‌నే ఏహ్య భావ‌న క‌లుగుతుంది.  క‌రోనా బాధితుల‌కు బాస‌ట పేరుతో టీడీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం వ‌ల్ల రోగుల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏంటో వివ‌రిస్తే ప్ర‌తి ఒక్కరూ సంతోషిస్తారు.

ఎటూ ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకునేందుకే… ముంద‌స్తు కార్య‌క్ర‌మ ప్ర‌క‌ట‌న ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌చారం త‌ప్ప‌, ప్ర‌జ‌లు బాస‌ట‌గా నిల‌వ‌ర‌నే స‌త్యాన్ని టీడీపీ గ్ర‌హిస్తే మంచిది. తామింతే అని టీడీపీ నేత‌లు మొండిగా వాదిస్తే… ప్ర‌జ‌లు కూడా తామింతే అని మ‌రోసారి గుణ‌పాఠం చెబుతారు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!