అమెజాన్ నుంచి మరో పెద్ద ప్రకటన వచ్చేలా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతిపెద్ద ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకటైన ఎంజీఎం స్టుడియోస్ ను అమెజాన్ దక్కించుకోబోతోంది. దీనికి సంబంధించి ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం.. ఎంజీఎం సంస్థను 850 కోట్ల నుంచి 900 కోట్ల డాలర్ల మధ్య కొనుగోలు చేసేందుకు అమెజాన్ సంస్థ సిద్ధంగా ఉంది. ఈ మేరకు చర్చలు తుది దశకు చేరుకున్నాయి. డీల్ ఓకే అయితే.. అమెజాన్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద ఒప్పందం అవుతుంది. ఇంతకుముందు 13 వందల కోట్ల డాలర్లకు హోల్ ఫుడ్స్ మార్కెట్ చైన్ ను అమెజాన్ దక్కించుకుంది.
అమెజాన్ కు ఇప్పటికే ప్రొడక్షన్ హౌజ్ ఉంది. దీనిపై ఒరిజినల్ కంటెంట్ తో పాటు, మరెన్నో వెబ్ సిరీస్ లు అది నిర్మిస్తోంది. అయితే ఈ విభాగంలో మరింత చొచ్చుకుపోయేందుకు ఓ భారీ కంపెనీని కొనుగోలు చేసేందుకు అమెజాన్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. అటు ఎంజీఎం స్టుడియోస్ నష్టాల్లో పడింది. ఈ సంస్థకు 200 కోట్ల డాలర్ల దీర్ఘకాలిక రుణాలున్నాయి. సంస్థ అమ్మకానికి సంబంధించి లైన్ ట్రీ బ్యాంక్, మోర్గాన్ స్టాన్లే సంస్థకు గతేడాదిలోనే ఎంజీఎం అనుమతినిచ్చింది.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి అమెజాన్ సంస్థ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఒక దశలో అమెజాన్ కు ఎంజీఎంను కట్టబెట్టేందుకు ఆ సంస్థ భాగస్వాములు అంగీకరించలేదు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో (కరోనా, రాజకీయ ఒత్తిళ్లు, దీర్ఘకాలిక అప్పులు) కంపెనీని అమ్మేయడమే ఉత్తమమని అది భావిస్తోంది. ఈ మేరకు 900 కోట్ల డాలర్లకు ఎంజీఎం అమ్ముడుపోయే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ అంచనా వేస్తోంది.
అమెజాన్ చేతికి ఎంజీఎం వస్తే.. మార్కెట్లో ఇప్పటికే ఉన్న డిస్నీ, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలకు అమెజాన్ మరింత గట్టిపోటీదారుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఎంజీఎం వద్ద 400 కోట్ల డాలర్ల విలువ చేసే క్లాసిక్స్ ఉన్నాయి. సింగింగ్ ఇన్ ది రెయిన్, బ్లాక్ పాంథర్ తో పాటు జేమ్స్ బాండ్ మూవీస్ కూడా కొన్ని ఈ సంస్థ వద్ద ఉన్నాయి. వీటిలో పాటు మరెన్నో టీవీ సిరీస్ లున్నాయి. డీల్ కుదిరితే స్టుడియోస్ తో పాటు ఇవన్నీ అమెజాన్ వశమౌతాయి.
ఓవైపు ఎంజీఎంతో డీల్ ను తుది దశకు తీసుకొస్తూనే మరోవైపు సోనీ పిక్చర్స్ తో కూడా చురుగ్గా చర్చలు జరుపుతోంది అమెజాన్. ప్రస్తుతం సోనీ పిక్చర్స్, నెట్ ఫ్లిక్స్ కు మధ్య కొన్ని ఒప్పందాలున్నాయి. అవన్నీ త్వరలోనే ముగియబోతున్నాయి. ఆ ఒప్పందాలు ముగిసేలోపు, సోనీతో మరో కీలక ఒప్పందం చేసుకోవాలని అమెజాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇది కూడా సాకారమైతే.. ప్రపంచ వినోద రంగంలో అమెజాన్, అతిపెద్ద శక్తుల్లో ఒకటిగా నిలబడుతుంది.