నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరవడం, ఫ్రెండ్ రిక్వెస్ట్ కోరడం, అనుమతి లభించిన వెంటనే డబ్బులు అడగడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. దేశవ్యాప్తంగా ఎక్కడచూసినా ఇలాంటి మోసాలు లక్షల్లో కనిపిస్తున్నాయి.
ప్రొఫైల్ ఫొటోలు కాపీ చేసి, నకిలీ ఎకౌంట్లు సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. అందరికీ ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. ఎవరైనా చెక్ చేసుకోకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే, వెంటనే డబ్బులు అడగడం మొదలుపెడుతున్నారు. అర్జెంట్ అవసరం ఉందని, డబ్బు కావాలని కోరుతున్నారు. అడిగింది ఫ్రెండ్ కదా అనే ఉద్దేశంతో చాలామంది ఇలా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి నష్టపోతున్నారు.
ఇలాంటి కేసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లెక్కలేనన్ని వస్తున్నాయి. 10-15వేలు పోగొట్టుకున్నోళ్లు కేసుల వరకు వెళ్లడం లేదు. ఇవి కూడా కలుపుకుంటే కేసుల సంఖ్య ఊహించడమే కష్టం.
కరోనా సెంటిమెంట్ తో కొడుతున్నారు
నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించుకున్నోళ్లంతా చేస్తున్నది ఒకటే పని. తమకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అర్జెంట్ గా హాస్పిటల్ లో జాయిన్ అయ్యామని, డబ్బులు కావాలని సెంటిమెంట్ తో కొడుతున్నారు. హాస్పిటల్ పేరు అడిగితే ఎవ్వరూ రావొద్దని ఇంట్లోనే ఉండమని కబుర్లు చెబుతున్నారు. కరోనా పాజిటివ్ అనగానే చాలామంది నమ్మేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ఇలాంటి వాళ్లకు చెక్ పెట్టాలంటే ముందుగా చేయాల్సిన పని ఏంటంటే.. వ్యక్తులంతా తమ ప్రొఫైల్స్ ను లాక్ చేసి పెట్టుకోవాలి. ఫేస్ బుక్ లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఇలా ప్రొఫైల్ లాక్ చేయని వ్యక్తుల ఖాతాలే ఎక్కువగా హ్యాక్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఖాతాను ప్రొటెక్ట్ చేసుకోవడం అత్యవసరమని సూచిస్తున్నారు.
ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే.. డబ్బులు అడిగిన వెంటనే ఫ్రెండే కదా అని గుడ్డిగా నమ్మేయకుండా ఓసారి కాల్ చేసి, చెక్ చేసుకోమని సూచిస్తున్నారు. ఒకవేళ ఫోన్ కూడా చేయలేని పక్షంలో మనీ ట్రాన్సఫర్ కు కొత్త నంబర్ ఇస్తే మాత్రం కచ్చితంగా అనుమానించాల్సిందేనని చెబుతున్నారు.
కాస్త విచక్షణతో వ్యవహరిస్తే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టొచ్చని, అడిగింది తక్కువ మొత్తమే కదా అని నగదు బదిలీ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బాధితుల లిస్ట్ లో కొన్ని రోజుల కిందట నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా చేరిన సంగతి తెలిసిందే.