ఏపీలో జూన్ 7 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలాఖరు వరకు కర్ఫ్యూ అమలులో ఉండటం, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లను క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగిస్తుండటం, రేపు వాటినే పరీక్షా కేంద్రాలుగా మార్చాల్సి రావడం.. ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పది పరీక్షల్ని నెలరోజులు వాయిదా వేయాలంటూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఫైల్ సీఎం దగ్గరకు చేరుకోవడంతో.. ఆయన నిర్ణయం కోసం విద్యాశాఖ ఎదురు చూస్తోంది.
ఉపాధ్యాయ వర్గాల్లో భయం.. భయం..
ఇటీవల స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా.. విధులకు హాజరైన ఉపాధ్యాయుల్లో కొంతమంది కరోనా బారిన పడ్డారు. మరికొంతమంది చనిపోయారు కూడా. కొన్ని కుటుంబాలు అనాథలుగా మారాయి. దీంతో ఎన్నికలు, పరీక్షల విధులంటేనే ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు.
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయన్న భరోసా ఉన్నా.. పరీక్షలంటే నిత్యం వందలాది మంది విద్యార్థులతో నేరుగా ఇంటరాక్ట్ కావాల్సి ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఓ చోట కరోనా అంటించుకుంటే ఇంటిల్లిపాదీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఉపాధ్యాయ వర్గాలు నెల రోజులు వాయిదా కోరుతున్నాయి.
విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఆ భయం ఉండనే ఉంది. కరోనా సోకిన కుటుంబాలు, కరోనా వల్ల ఆప్తుల్ని కోల్పోయిన కుటుంబాలైతే ఇప్పట్లో సాధారణ స్థితికి రాకపోవచ్చు. అలాంటి కుటుంబాల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు తక్కువ. జూన్ 7 నుంచి పరీక్షలు పెడితే.. హాజరు శాతం కూడా పడిపోతుందనే అనుమానం ఉంది.
ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది..?
ఇప్పటివరకైతే ఏపీ ప్రభుత్వం పరీక్షల విషయంలో ముందుకే వెళ్లాలని ఆలోచిస్తోంది. ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పది పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య పడిపోయింది.
నెలాఖరు వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది కాబట్టి, కచ్చితంగా కేసులు మరింతగా తగ్గుతాయి. ఆ తర్వాత వారం రోజుల గ్యాప్ లో పది పరీక్షలకు రెడీ కావొచ్చనేది ప్రభుత్వం ఆలోచన. అందుకే టెన్త్ పరీక్షలపై ముందుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టెన్త్, ఆ తర్వాత వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు జూన్ లోనే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ దశలో విద్యాశాఖ అధికారుల ప్రతిపాదనలు మాత్రం ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి. నెల రోజులు పరీక్షలు వాయిదా వేయాలని వాళ్లంతా కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.