నటుడిగా, దర్శకుడిగా వరస విజయాలు ఇస్తున్న ఉత్సాహంతో మలయాళీ హీరో పృథ్విరాజ్ తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా తన సినిమా ప్రమోషన్ల కోసం పక్క రాష్ట్రాల పర్యటనలు కూడా పెట్టుకుంటున్నాడు.
మలయాళీ సినిమాలతో వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు పక్క భాషల్లో కమర్షియల్ మార్కెట్ ను సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఈ హీరో. ఇది వరకూ అనేక మంది బాలీవుడ్ హీరోలు, ఆ తపై తమిళ హీరోలు, తెలుగు హీరోలు అనుసరిస్తున్న తీరును ఫాలో అవుతున్నాడు పృథ్వి.
తన తాజా సినిమా కడువ ప్రమోషన్ కోసం పృథ్విరాజ్ హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. భారీ సినిమాలు విడుదల అయ్యే సమయంలో ఇలా హీరోలు వేరే భాషల వెర్షన్లను ప్రమోట్ చేసుకోవడం రొటీనే. ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం ఆ సినిమా హీరోలు, దర్శకుడు దేశమంతా తిరిగారు.
ఇక బాలీవుడ్ స్టార్లు తమ సినిమాలు విడుదల అయ్యే ముందు హైదరాబాద్ కచ్చితంగా వస్తుంటారు. తెలుగు లోని ఇతర స్టార్ హీరోలు కూడా తమ సినిమాల విడుదల సమయంలో చెన్నై, బెంగళూరు లను విజిట్ చేయడం.. ప్రమోట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు పృథ్విరాజ్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. తమ సినిమా మలయాళీ వెర్షన్ టైటిల్ తోనే ఇతర భాషల్లో విడుదల చేయడంపై కూడా వివరణ ఇచ్చుకున్నాడు. కడువ అంటే మలయాళంలో పులి అని, అయితే ఇందులో క్యారెక్టర్ పేరులో కూడా కడువ అనే పదం ఉంటుందని, అందుకే ఆ టైటిల్ నే కొనసాగించినట్టుగా చెబుతున్నాడు పృథ్విరాజ్.
ఇక డైరెక్టు తెలుగు సినిమాల గురించి ఇతర భాషల స్టార్లు చెప్పేరొటీన్ డైలాగునే ఈ హీరో కూడా చెప్పాడు. తను అలాంటి అవకాశం కోసం వేచి చూస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికై సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, అలాగే తన మలయాళీ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్ దర్శకత్వం విషయంలో కూడా తనతో సంప్రదించారని పృథ్వి చెప్పుకొచ్చాడు.
అయితే ఆ రెండు సినిమాల విషయంలో తను చేయలేకపోయినట్టుగా.. ఇప్పుడు మలయాళంలో తను చేస్తున్న లూసీఫర్ సీక్వెల్ తెలుగు రీమేక్ దర్శకత్వం అవకాశం వస్తే వదులుకోనంటున్నాడు!