మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ లకు జన్మనిచ్చిన తల్లి అంజనాదేవి జనసేన పార్టీ కౌలు రైతులకు ఇస్తున్న సాయం కోసం తన వంతు విరాళం ఇచ్చారు. ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన తల్లి లక్ష రూపాయల మొత్తాన్ని కౌలు రైతుల కోసం జనసేన సేకరిస్తున్న విరాళాల నిధికి ఇచ్చినట్టుగా పవన్ చెప్పారు. మంచి విషయమే.
తన తండ్రి పెన్షన్ మొత్తాన్ని ఈ విరాళ నిధికి తన తల్లి అందించినట్టుగా పవన్ కల్యాణ్ చెప్పారు. అంతే కాదు.. ఆ పెన్షన్ విధానం తమకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నదని, ఆ పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలనేది జనసేన డిమాండ్ అని కూడా పవన్ చెప్పుకొచ్చారు.
పవన్ తండ్రి ఒకప్పటి ప్రభుత్వ ఉద్యోగి. కాబట్టి ఆయనకు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ వచ్చేది. ఆయన కాలం చేశాకా.. పవన్ తల్లి ప్రభుత్వం నుంచి భర్త కు అందే పెన్షన్ ను పొందుతూ వస్తోంది! ఇది సాంకేతికంగా జరిగేదే!
మెగాస్టార్ పారితోషికం 90లలోనే ఒక్కో సినిమాకు కోటి రూపాయలను దాటేసిందంటారు. ఇప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నాగబాబు కొడుకు..వీరి పారితోషికాలు ఒక్కోరివి అంచనా వేయడం కూడా కష్టం. పవన్ కల్యాణ్ అయితే ఒక్కో సినిమాకు యాభై కోట్లు అంటున్నారు. రామ్ చరణ్, చిరుల పారితోషికాలు దాదాపు అదే స్థాయి.
నాగబాబు కొడుకు కూడా పది కోట్ల స్థాయి! మరి ఇలా ఒక్కో సినిమాకు ఇన్నిన్ని కోట్ల రూపాయల పారితోషికాలు అందుకునే కొడుకులు, మనవళ్లు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తమకు అందే పెన్షన్ మొత్తంలో లక్ష రూపాయలను జనసేన పార్టీ విరాళ నిధికి ప్రకటించి, మెగా ఫ్యామిలీ తమ దాతృత్వాన్ని మంచి మనసును చాటుకుంది.