సాక్షిలో జనతంత్రం శీర్షిక కింద ఎడిటర్ మురళీ “ఎల్లో హెచ్చులు ఢిల్లీదాకా” అని కాలమ్ రాశాడు. ఎడిటర్ అన్న తర్వాత పాలసీ ప్రకారం రాయాల్సిందే. అయితే నిష్పక్షపాతంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండడంతో ద్రౌపది ముర్ము ఎంపికని వైఎస్సార్‌సీపీ స్వాగతించిందని రాశారు.
ఒకవేళ ముర్ము కాకుండా వెంకయ్యనాయుడైతే వ్యతిరేకించే వాళ్లా? లేదు కదా, అపుడు తెలుగు వాడు రాష్ట్రపతి కావడాన్ని స్వాగతించేవాళ్లు. వీళ్లిద్దరూ కాకుండా మోదీ తన చిన్ననాటి స్నేహితున్నో, గుజరాత్‌లో వుండే ఆర్ఎస్ఎస్ నాయకుడినో తెచ్చి నిలబెడితే మాత్రం మీ దగ్గర ఆప్షన్ వుందా? స్నేహాన్ని గౌరవిస్తూ మద్దతు తెలుపుతున్నామని ప్రకటన చేసేవాళ్లు. బీజేపీకి ఎదురుగా వెళ్లే ఆప్షన్, అవసరమూ వైసీపీకి లేదు. అది కరెక్ట్ కూడా!
ఎందుకంటే వైసీపీ వ్యతిరేకించినా కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుంది. కప్పల తక్కెడ లాంటి ప్రతిపక్షాన్ని మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. కేసీఆర్ వ్యతిరేకించాడంటే అర్థముంది. ఆయనకి రాష్ట్రంలో బీజేపీ గట్టి ప్రత్యర్థి. మరి వైసీపీకి ఏం అవసరం!
రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల్ని బేరం పెట్టాలని ఎల్లో గ్యాంగ్ ఒక వాదన లేవదీసింది. పల్లెల్లో ఒక సామెత వుంది. “ఊళ్లో వాళ్ల బిడ్డల్ని దించి బావిలోతు కొలిచే వాళ్లు” అని. అంటే ఇతరుల్ని సమస్యల్లోకి నెట్టి తమాషా చూసేవాళ్లు ఈ వాదన తీశారు. వాళ్లదేం పోయింది. బీజేపీతో గొడవ పెట్టుకుని రాష్ట్రానికి రావాల్సినవి కూడా ఆగిపోయి జగన్ ఆర్థికంగా పూర్తిగా డీలా పడితే అపుడు జనం తమకి ఓట్లు వేసేస్తారని దురాశ ఈ వాదన వెనుక ఉంది.
ఎందుకంటే జగన్ బేరం (దీన్నే బ్లాక్‌మెయిల్ అని కూడా అంటారు) పెడితే మోదీ వెంటనే దిగొచ్చి “తీసుకో జగన్ , ప్రత్యేక హోదా, ఇదిగో పోలవరం డబ్బులు” అనేస్తాడా? ఐదు సంవత్సరాలు సర్వీస్ ఆటోలాగా బీజేపీతో రాసుకుపూసుకు తిరిగిన చంద్రబాబు ఏమీ తేలేదు. బీజేపీతో భాగస్వామి కాని జగన్ బేరాలు ఆడాలి. రాజకీయ విజ్ఞత వున్న వాళ్లెవరూ (తప్పని సరి అయితే తప్ప) కేంద్రంతో గొడవ పెట్టుకోరు. పథకాల పంపిణీలో ఆర్థికంగా ఊగులాడుతున్న జగన్ అస్సలు పెట్టుకోకూడదు. జగన్‌కి రాజకీయం తెలుసు. అందుకే బీజేపీని బలపరిచాడు.
అదేమంటే కేసుల భయం అంటారు. కేసుల గురించి కేంద్రానికి భయపడుతున్నాడని వీళ్లు అంటున్నారు కదా. అంటే కేంద్రం తమ దర్యాప్తు సంస్థల్ని అక్రమంగా వాడుతుందని, కోర్టుల్ని ప్రభావితం చేస్తుందనే కదా దీని అర్థం. న్యాయ వ్యవస్థపై నమ్మకం వున్నవాళ్లు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. మరి సోనియాని జగన్ ఎదుర్కొన్నప్పుడు ఆమె పెట్టించిన కేసులు అక్రమమైనవి ఎందుకు కాకూడదు? జగన్ విషయంలో అవి సక్రమ కేసులు. సోనియా , రాహుల్ నేషనల్ హెరాల్డ్ కేసు మాత్రం అక్రమం అంతేనా?
బీజేపీ మద్దతు విషయంలో జగన్ వందశాతం కరెక్ట్. ఇక్కడ బేరాలు లేవమ్మా!