ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో తేలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా మేకపాటి కుటుంబం సంతోషానికి అవధుల్లేవు. తన కుమారుడు 82 వేల పైచిలుకు భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనంలో ఆదరణ తగ్గలేదనేందుకు ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ విజయమే నిదర్శనమన్నారు.
తన కుమారుడికి భారీ విజయాన్ని అందించిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాల పథకాలే విజయానికి కారణమని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఏపీలో బీజేపీకి ఉనికే లేదన్నారు. ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
ఏపీ విభజనకు గురైన తర్వాత కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. ఏపీకి జగన్ నాయకత్వం అవసరమన్నారు. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. ఆత్మకూరు విజేత మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన అన్న గౌతమ్ పేరు నిలబెడతానన్నారు.
విజయంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయన్నారు. ఓడిపోయామనే అక్కసుతో బీజేపీ విమర్శలు చేస్తోందన్నారు. తన గెలుపునకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రధాన కారణమన్నారు.