శివసేనలో తలెత్తిన తిరుగుబాటు వ్యవహారం బహుశా ఇద్దరు నటీమణులకు బాగా సంతృప్తిని ఇచ్చే విషయం కావొచ్చు. వారిలో ఒకరు మాజీ హీరోయిన్ కాగా మరొకరు ఫీల్డ్ లో ఉన్న నటీమణి. వారి పేర్లు అందరికీ తెలిసినవే. గతంలో సినిమాల్లో నటించి, ఆ తర్వాత రాజకీయ నేత కు భార్య అయ్యి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న నవనీత్ కౌర్. మరొకరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్!
వీరిద్దరూ గత కొన్నాళ్లు పరిణామాల్లో శివసేన వ్యతిరేకులు అయ్యారు. బీజేపీ మద్దుతు వ్యవహారాలతో మహారాష్ట్ర సర్కారుతో మాటల యుద్ధానికి దిగింది కంగనా. దీంతో ఠాక్రే ప్రభుత్వం ఆమె విషయాలపై కన్నేసింది. ముంబై మున్సిపాలిటీ అయితే కంగనా ఆఫీసునేదో కూల్చేసింది అప్పట్లో. ఆ తర్వాత కంగనాకు కోర్టులో ఊరట లభించింది.
అలాగే కంగనాపై వేర్వేరు కేసులు కూడా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. తనకు వ్యతిరేకంగా అదంతా కుట్ర అంటూ కంగనా ధ్వజమెత్తేది. మరేమైందో కానీ.. సేన సర్కారుపై కంగనా మాటల దాడి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది.
ఇక ఇటీవల ఉద్ధవ్ ఠాక్రేకు సవాళ్లతో వార్తల్లో నిలిచింది నవనీత్ కౌర్. ఆమె, ఆమె భర్త మహారాష్ట్ర సీఎంకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ ఛాలీసాను పఠిస్తామంటూ వివాదాన్ని రేపారు. ఈ విషయం కోర్టు వరకూ వెళ్లింది. మతపరమైన కలహాలను రేపే ప్రయత్నం చేస్తున్న నవనీత్, ఆమె భర్త రాణాను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజులకు నవనీత్ , రాణాలకు బెయిల్ వచ్చింది. కేసు విచారణలు అయితే కొనసాగుతూ ఉన్నాయి.
మరి సేన ప్రభుత్వం పై ఇలాంటి బహిరంగ పోరాటానికి దిగిన కంగనా, నవనీత్ కౌర్ లు ఇప్పుడు సంతోషంగా ఉండవచ్చు. సేనలో తలెత్తిన సంక్షోభంపై కంగనా స్పందించలేదు కానీ, నవనీత్ కౌర్ మాత్రం ఇప్పటికే స్పందించింది. మహారాష్ట్రలో తక్షణం ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆమె తన డిమాండ్ ను తెలియజేసింది.