ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతల అతి విశ్వాసం. బీజేపీతో కలసి జనసేన అధికారాన్ని చేపడుతుందనేది పవన్ కల్యాణ్ అనంత విశ్వాసం. అయితే ఏపీలో బీజేపీ స్థానమేంటి..? ఆత్మకూరు ఉప ఎన్నిక ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
తనతోపాటుగా ఇతరులు ప్రత్యర్థులు ఉన్నా..(తిరుపతి), తానొక్కటే ప్రధాన ప్రత్యర్థి అయినా(బద్వేల్).. ప్రజల్లో మార్పు మాత్రం రాలేదు. కాంగ్రెస్ ని ఎలా చావుదెబ్బ కొట్టారో, బీజేపీని కూడా (ఆత్మకూరు) అలానే చావుదెబ్బ కొట్టారు, కొడుతున్నారు, కొడుతూనే ఉంటారు కూడా. ఎందుకంటే.. ప్రత్యేక హోదా అనే మోసం అలాంటిది.
ఏపీలో కాంగ్రెస్, బీజేపీ ఒకటే..
ఏపీ ప్రజలు కాంగ్రెస్ పై ఒకరకమైన ఏహ్యభావంతో ఉన్నారు. విభజన పాపం వల్ల ఆ పార్టీపై వచ్చేసిన అప నమ్మకంతో ఇప్పుడా పార్టీలో నాయకులంటూ ఎవరూ లేని పరిస్థితి. ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డిని బతిమిలాడి, బామాలినా.. పీసీసీ పదవి నాకొద్దుపొమ్మంటున్నారు. రాజకీయంగా ఎదగాలనే ఆశ ఉన్నవారెవరూ ఆ పార్టీలో ఉండరు.
ఇక బీజేపీ విషయానికొద్దాం. రాష్ట్ర విభజనతో ఏపీకి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ అయితే, విభజన హామీ అంటూ ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లంటూ హామీ ఇచ్చి ఆ తర్వాత దారుణంగా మోసం చేసింది బీజేపీ. ఆ మోసం కంటే, ఈ మోసం మరీ పెద్దది. 2014లో కేవలం హోదా ఇస్తారనే అశతో అక్కడక్కడా బీజేపీకి ఓట్లు పడ్డాయి. అది మోసం అని తేలేసరికి 2019లో బీజేపీ స్కోర్ జీరో. అప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు ఏపీలో ఎక్కడ బీజేపీ పోటీ చేసినా అదే పరిస్థితి. ఎందుకంటే హోదా పేరుతో మోసం చేసిన బీజేపీని జనం అంత తేలిగ్గా నమ్మరు.
ఎమ్మెల్సీలు వచ్చారు, రాజ్యసభ సభ్యులు ప్రచారానికి వచ్చారు. కానీ బీజేపీకి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కేవలం 19332. అంటే రెండు లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న ఒక నియోజకవర్గంలో లక్షా 37వేల ఓట్లు పోలైన ఉప ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన స్కోర్ కేవలం 20వేలు.
అటు టీడీపీ పోటీలో లేదు, జనసేన పోటీలో లేదు, మరి వారి ఓట్లన్నీ ఏమయ్యాయి. వీలైతే వారు సైలెంట్ గా ఉన్నారు, లేదంటే వైసీపీకి వేశారు. అంతే కానీ, బీజేపీకి మాత్రం ఓటు వేయలేదనే విషయం ఇక్కడ స్పష్టం. అంటే మొదట్నుంచీ బీజేపీపై నమ్మకం ఉన్న వారు, ఆర్ఎస్ఎస్ అభిమానులు, వైసీపీని ద్వేషించే ఓ సామాజిక వర్గం వారు మాత్రమే బీజేపీకి ఓట్లు వేశారు. రేపు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే, బీజేపీకి ఆమాత్రం స్కోర్ కూడా రాదనేది వాస్తవం.. ఇదీ ఏపీలో బీజేపీ పరిస్థితి.
అదే డైలాగ్.. అదే రిజల్ట్..
తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం అన్నారు, బద్వేల్ లో అదే మాట రిపీట్ చేశారు, ఆత్మకూరులో కూడా సేమ్ డైలాగ్. ప్రతి ఎన్నికలో కూడా అధికార దుర్వినియోగం అంటూ తప్పించుకుంటున్నారే కానీ.. ఎక్కడా ఆత్మవిమర్శ చేసుకోలేదు బీజేపీ. మంత్రి అంబటి మాటల్లో చెప్పాలంటే ఏపీలో బీజేపీ సైజ్ ఎంత..? అవును ఏపీలో బీజేపీ సైజ్ ఎంత..? వైసీపీ నిలువెత్తు మనిషి అయితే బీజేపీ సైజ్ చిటికెన వేలంత. ఆమాత్రం దానికే ఎగిరెగిరి పడే కాషాయదళం.. ఇప్పటికైనా తమ స్థాయి ఏంటో తెలుసుకుంటే మంచిది.
కేంద్రంలో అధికారంలో ఉన్నారు సరే, ఏపీ ప్రజలు తమని విశ్వసించడంలేదనే వాస్తవాన్ని ఇకనైనా గ్రహించాలి. కాంగ్రెస్ ని పాతిపెట్టినట్టే, బీజేపీకి కూడా ఎప్పుడో ఏపీ ప్రజలు పాతర వేశారు. ఆ విషయం కాంగ్రెస్ గ్రహించింది, ఒప్పుకుంది. బీజేపీ గ్రహించినా ఒప్పుకోదు. అదే మేజిక్కు.