ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలంటే పక్క రాష్ట్రాల్లో క్యాంపులు పెట్టడం రాజకీయాల్లో ఆది నుంచి ఆనవాయితే. అదే రాష్ట్రంలో క్యాంపులు పెడితే.. పవర్ చేతిలో ఉన్న వారు క్యాంపులను విచ్ఛిన్నం చేస్తారనే భయం ఉండనే ఉంటుంది. ఎన్టీఆర్ ను దించేసిన చంద్రబాబు మాత్రం అప్పట్లో హైదరాబాద్ లోనే తన క్యాంపును నడిపారు. చంద్రబాబుది ముందే జరిగిన వ్యూహరచన. ఎన్టీఆర్ ను దించే వ్యవహారంలో అన్ని వ్యవస్థలనూ తనదైన రీతిలో చంద్రబాబు మేనేజ్ చేశాడనే పేరు చెరిపేతే చెరిగేది కాదు.
బహుశా వెన్నుపోట్ల వ్యవహారాల్లో చంద్రబాబు అంత శక్తిమంతులు మళ్లీ తయారు కాలేదు కాబోలు! ఇప్పుడు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా గౌహతీలో క్యాంపు పెట్టారు. వారి నాయకుడు ఏక్ నాథ్ షిండే మాత్రం గుజరాత్ కు వెళ్లి, మళ్లీ గౌహతి చేరుకుంటున్నారట! గుజరాత్ లో బీజేపీ అగ్రనాయకులతో ఆయన సమావేశాలు నిర్వహించి కింకర్తవ్యాన్ని బోధపరుచుకుంటున్నారట!
మరి ఇంతకీ ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైలో అడుగుపెట్టేదెన్నడు? అనేది ఇంకా సమాధానం లేని ప్రశ్నే! వీరు అక్కడ అడుగుపెడితే శివసైనికులు ఊరికే ఉండరనేది బహిరంగ సత్యం. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేల ఆఫీసులపై శివసైనికుల దాడులు జరిగాయి. ప్రభుత్వం కూడా వారి, వారి కుటుంబీకులకు భద్రతను ఉపసంహరించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలకు ఏ కేంద్ర బలగాల రక్షణో అవసరం కావొచ్చు! బహుశా అది దక్కే వరకూ రెబల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో అడుగుపెట్టే అవకాశాలు లేనట్టేనేమో.ఈ నెల ముప్పైయవ తేదీ పైన ఈ రెబల్స్ అంతా ముంబైలో అడుగుపెడతారట.
రెబల్ క్యాంపులో 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయనేది టాక్. వారిలో 16 మందికి మాత్రమే శివసేన పార్టీ తరఫు నుంచి అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ అయ్యాయి. వారు ముంబైలో అడుగుపెడితే తమ దారిలోకి తెచ్చుకోవచ్చని సంజయ్ రౌత్ భావిస్తున్నట్టుగా ఉన్నాడు. ముంబైలో అడుగుపెట్టే వరకే వారి ఆటలు అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే వారేమో ముంబై మాట ఎత్తడం లేదు!