ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొంది. తృటిలో ఆయనకు ప్రమాదం తప్పింది. అత్యవసరంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో వరుసగా రెండోసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రత్యర్థుల ఆస్తులపై బుల్డోజర్ నడిపే సంప్రదాయానికి యోగి తెరలేపారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అలాగే రైతు ఉద్యమాలు ఆయన్ను రెండోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసికి శనివారం యోగి వెళ్లారు. కాశి విశ్వనాథ్ ఆలయాన్ని యోగి సందర్శించుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు.
తిరిగి లక్నో వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం వారణాసి నుంచి లక్నోకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. వారణాసి ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ కాగానే విండోను పక్షి ఢీకొట్టింది. దీంతో పైలట్ ప్రమాదాన్ని శంకించాడు. వెంటనే అత్యవర ల్యాండింగ్‌ను కోరాడు. వారణాసి పోలీస్ లైన్స్ గ్రౌండ్‌లో సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.
ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండానే ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత యోగి ఆదిత్యనాథ్ సర్క్యూట్ హౌస్‌కు తిరిగి వెళ్లారు. కాసేపటి తర్వాత ప్రభుత్వ విమానంలో లక్నోకు వెళ్లారు.