జ‌గ‌న్‌కు ఆర్కే మేలు… అంతాఇంతా కాదు!

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో మునుప‌టి మోజు ఉంద‌ని ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ఫ‌లితం తేల్చి చెప్పింది. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ప‌క్కాగా జ‌రిగింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పోల్చితే ఈ…

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో మునుప‌టి మోజు ఉంద‌ని ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ఫ‌లితం తేల్చి చెప్పింది. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ప‌క్కాగా జ‌రిగింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పోల్చితే ఈ ఉప ఎన్నిక‌లో దాదాపు 18 శాతం ఓటింగ్ త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ 82 వేల పైచిలుకు మెజార్టీ వైసీపీ అభ్య‌ర్థి మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డికి ద‌క్క‌డం విశేషం.

ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఒక రోజు ముందు చంద్ర‌బాబు అనుకూల ప‌త్రిక‌లో రాసిన క‌థ‌నం… నేడు భారీ మెజార్టీ సాధించిన నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌కు జ‌నంలో ఎంత ప్ర‌జాద‌ర‌ణ ఉందో చెప్ప‌క‌నే చెబుతాయి. ఉప ఎన్నిక‌లో అధికార పార్టీకి అధికారులు ఏ మాత్రం స‌హ‌క‌రించ‌లేద‌ని ఎల్లో ప‌త్రిక రాయ‌డంతో వైసీపీకి  ఈ విజ‌యం ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని చెప్పొచ్చు.

“వైసీపీపై మొహం మొత్తిందా!?”  శీర్షిక‌తో రాసిన ఆ క‌థ‌నంలోని ఆణిముత్యాలు క్షేత్ర‌స్థాయిలో వైసీపీ ఎంత బ‌లంగా ఉందో చెప్ప‌క‌నే చెప్పాయి. శీర్షిక చ‌దివితే చాలు, ఆ క‌థ‌నం ఉద్దేశం ఏంటో తెలుసుకోడానికి. ఆ క‌థ‌నంలోని ప్ర‌ధాన అంశాలేంటో తెలుసుకుందాం.

“మూడేళ్లకే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు మొహం మొత్తిందా? ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఉద్యోగులు ఆత్మకూరు ఉప ఎన్నికను వేదికగా వాడుకున్నారా? ఆత్మకూరులో గురువారం ఓటింగ్‌ సరళిని, ఆ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల వ్యవహారశైలిని గమనిస్తే ఇది నిజమేనన్న విపక్షాల వాదనకు బలం చేకూరుతోంది “

“ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఆ పార్టీకే వత్తాసు పలుకుతుంటారు. ప్రధాన ప్రతిపక్షం బరిలో లేకపోతే అడ్డూఅదుపు లేకుండా పాలక పక్షానికి మరింతగా సహకరిస్తారు. గురువారం జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో ఇవేమీ కనిపించలేదు. జగన్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రదర్శించడానికి ఉద్యోగులు ఈ ఉపఎన్నికను వేదికగా చేసుకున్నారేమోనని అనిపించింది. దొంగఓట్లను చాలా వరకు కట్టడి చేశారు. వృద్ధులకు సహాయకులుగా వస్తామన్నా వైసీపీ నేతలను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించలేదు. పోలింగ్‌ శాతం తక్కువగా ఉండడంతో పెంచుకోవడానికి సహకరించాలని అధికార పార్టీ నేతలు ఎంత ఒత్తిడి తెచ్చినా సిబ్బంది లెక్క చేయలేదు. కొన్ని చోట్ల కొందరు ఒత్తిళ్లకు తలొగ్గినా.. మెజారిటీ సిబ్బంది మాత్రం నిక్కచ్చిగానే విధులు నిర్వర్తించడం విశేషం”

అధికార పార్టీకి ఎన్నిక‌ల సిబ్బంది ఒక‌ట్రెండు చోట్ల త‌ప్ప ఎక్క‌డా స‌హ‌క‌రించ‌లేద‌ని టీడీపీ అనుకూల ప‌త్రిక రాయ‌డం గ‌మ‌నార్హం. మూడేళ్ల‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌ల్లే ఈ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని ఎల్లో ప‌త్రిక అత్యుత్సాహంతో రాసింది. చివ‌రికి  ఫ‌లితం ఎల్లో టీం చెంప ఛెళ్లుమ‌నిపించింది. ఎన్నిక‌ల్లో ఉద్యోగుల స‌హాయ నిరాక‌ర‌ణ చేసినా వైసీపీ మాత్రం ఘ‌న విజ‌యం సాధించింద‌నే సందేశాన్ని బాబు అనుకూల ప‌త్రిక క‌థ‌నం తీసుకెళ్లింది. జ‌గ‌న్‌కు చెడు త‌ల‌పెట్టాల‌ని భావించినా, చివ‌రికి మంచే జ‌రిగింది. 

మ‌రో 24 గంట‌ల్లో ఫ‌లితం వ‌స్తుంద‌ని తెలిసి కూడా, అత్యుత్సాహంతో వైసీపీపై జ‌నంలో మొహ‌మెత్తిం దంటూ క‌థ‌నం రాసి, ఆ పార్టీకి ఎంతో మేలు చేసింది. అధికారులంతా నిక్క‌చ్చిగా ప‌ని చేశార‌ని ఎల్లో ప‌త్రిక స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం అధికార పార్టీకి ఆయాచిత వ‌రం. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ ఎండీ ఆర్కే చేసిన మేలు అంతాఇంతా కాద‌ని ఈ క‌థ‌నమే నిద‌ర్శ‌నం.