ఆత్మకూరు ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్‌లోనూ వైసీపీ హవా కనబరిచింది. అందులో ఆధిక్యత కనబరచడంపై అధికార పార్టీనే ఆశ్చర్యపోతోంది. నూతన పీఆర్సీ, ఇతరత్రా అంశాల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. లక్షలాది మంది ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు రాష్ట్ర రాజధానిలో కదంతొక్కి, ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపారు.
దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలు పూర్తిస్థాయిలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తాయని అందరూ అంటున్న మాట. ఈ నేపథ్యంలో ఆత్మకూరు ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.
వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యోగులు ఓట్లు వేసి తమ నిరసన, అసంతృప్తిని ప్రభుత్వానికి పంపుతారని భావించారు. అనూహ్యంగా వాళ్ల నుంచి ప్రభుత్వానికి 80 శాతం మద్దతు రావడం విశేషం.
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మొత్తం 205 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీకి 167 ఓట్లు దక్కాయి. అంటే 80 శాతం మంది వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించే విషయం తెలిసిందే.
వైసీపీ ఇంకా రెండేళ్లు అధికారంలో ఉండనున్న పరిస్థితిలో వ్యతిరేకంగా ఓట్లు వేసి, అనవసర సమస్యలను కొని తెచ్చుకోవడం ఎందుకనే భావనతో అధికార పార్టీకి మద్దతుగా నిలిచి వుంటారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏది ఏమైనా పోస్టల్ బ్యాలెట్లో మాత్రం 80 శాతం మద్దతు దక్కడంపై వైసీపీ ఖుషీగా వుంది.