వైసీపీ సర్కార్ పరువును, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చడానికి ఎంత నీచానికైనా దిగజారుతుంది టీడీపీ, దాని అనుకూల మీడియా. అవసరమైతే నకిలీ పత్రాలు సృష్టించి మరీ ప్రాపగాండ చేయడానికి రెడీ అవుతున్నాయి. మొన్నటికి మొన్న విశాఖ విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగితే దానికి టీడీపీ, దాని అనుకూల మీడియా ఎలాంటి వక్రభాష్యం ఇచ్చిందో అందరం చూశాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా అలాంటి నకిలీ రాద్దాంతాన్నే సృష్టిస్తోంది టీడీపీ.
తనకు రక్షణ కావాలంటూ స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్ర హోంశాఖకు రాసినట్టు ఓ లేఖ నిన్న బయటపడింది. అది ఫేక్ లెటర్ అనే విషయం నిర్థారణ అయ్యేలోపే, చంద్రబాబు అనుకూల మీడియా తన పని ప్రారంభించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా తగ్గిపోయాయని, ఎన్నికల కమిషనర్ కే రక్షణ లేదంటూ వార్తలు అల్లేసింది. ఏకంగా దీనిపై చర్చలు కూడా ప్రారంభించింది.
కేవలం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి టీడీపీ ఈ కుట్ర పన్నిందనే విషయం ఇక్కడ స్పష్టం అవుతూనే ఉంది. గతంలో విశాఖ విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నాన్ని కూడా టీడీపీ ఇలానే సైడ్ చేసింది. దాన్ని కోడికత్తి దాడి అంటూ ఎద్దేవా చేసింది. అక్కడితో ఆగకుండా.. జగన్ అభిమానే అతడ్ని పొడిచాడంటూ నకిలీ ఫ్లెక్సీని నిమిషాల్లో రెడీ చేయించింది.
ఇలాంటి దిక్కుమాలిన, నీచమైన ఐడియాలు టీడీపీకి, దాని అనుకూల మీడియాకు తప్ప మరెవరికి రావు. కేంద్రానికి తను లేఖ రాయలేదంటూ రమేష్ కుమార్ వెంటనే స్పష్టంచేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రోజంతా ఆ నకిలీ లేఖ పట్టుకొని బాబు అనుకూల మీడియా రచ్చరచ్చ చేసి ఉండేది.
అయితే ఈసారి మాత్రం వైసీపీ శ్రేణులు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలాలనుకోవడం లేదు. ఈరోజు కొంతమంది వైసీపీ నేతలు దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయబోతున్నారు. అసలు ఈ లెటర్ ఎక్కడ్నుంచి వచ్చింది, ఎవరు తయారుచేశారనే విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఇలాంటి “విషప్రయోగాల”కు ఇప్పుడే చెక్ పెట్టకపోతే.. రానున్న రోజుల్లో టీడీపీ నుంచి, దాని అనుకూల మీడియా నుంచి మరిన్ని వైపరీత్యాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.