హ్యాండ్ వాష్ ఛాలెంజ్.. ఎవడికి ఉపయోగం?

ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ వీటిలో ఏది గొప్ప. నలుగురికి కడుపు నింపే రైస్ బకెట్ ఛాలెంజ్ ని తీసుకోవడమే గొప్ప. ఆ మధ్య సోషల్ మీడియాలో ఈ రెండూ విపరీతంగా…

ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ వీటిలో ఏది గొప్ప. నలుగురికి కడుపు నింపే రైస్ బకెట్ ఛాలెంజ్ ని తీసుకోవడమే గొప్ప. ఆ మధ్య సోషల్ మీడియాలో ఈ రెండూ విపరీతంగా ట్రెండ్ అయినా.. సెలబ్రిటీలు మాత్రం ఐస్ బకెట్ తో ఫోజులిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈమధ్య మొక్కలు నాటే ఛాలెంజ్ లు కూడా సెలబ్రిటీలు బాగానే ఓన్ చేసుకున్నారు. ఎవరో తీసిన గుంతలో అలా అలా నాజూగ్గా ఓ మొక్క నాటేసి, కాసిన్ని నీళ్లు చిలకరించి.. హ్యాష్ ట్యాగ్ లో ఇంకెవరి పేరో చేర్చి సవాల్ విసురుతున్నారు. దీని వల్ల కూడా ఎంతో కొంత మేలు ఉంది. మరి ఈ హ్యాండ్ వాష్ చాలెంజ్ పైత్యం ఏంటి?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ లో ఉన్న ఛాలెంజ్ ఇది. కేంద్ర మంత్రుల దగ్గర్నుంచి సినీ తారలు, క్రీడాకారులు.. అందరూ హ్యాండ్ వాష్ లోషన్లు పోసుకుని చేతులు తెగ రుద్దేస్తూ వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. అసలు దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఏంటి ఉపయోగం? పబ్లిసిటీ తప్ప ఇలాంటి వీడియోలు, ఛాలెంజ్ లు దేనికైనా పనికొస్తాయా? సామాన్యులకు ఈ వీడియోలు చూడటం వల్ల నిజంగా ఏం ఉపయోగం ఉంటుందో సదరు సెలబ్రిటీలే నోరు విప్పి చెప్పాలి.

అసలు చేతులు కడుక్కోవడం ఎలా అనే విషయం ఆ వీడియోలో హైలెట్ అవుతుందా? ఆయా సెలబ్రిటీల హావభావాలు, వారి బాత్రూమ్ యాక్సెసరీస్ వీడియోల్లో హైలెట్ అవుతున్నాయా? వారే తెలుసుకోవాలి. ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేసే బదులు, పేదల కాలనీల్లో సబ్బులు, హ్యాండ్ వాష్ లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేయొచ్చు కదా.

ఆ పనులు చేయడానికి వేరే బ్యాచ్ ఉంది. వారు ఎలాంటి పబ్లిసిటీ కోరుకోరు. స్వచ్ఛంద సేవకులు ఇప్పటికే వివిధ కాలనీల్లోకి వెళ్లి ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. తమ పని తాము పూర్తి సైలెంట్ గా చేసేస్తున్నారు. కరోనా హ్యాష్ ట్యాగ్ కొడితే ఇలాంటి వారి పనులు కనిపించవు, సెలబ్రిటీలు చేతులు కడుక్కునే వీడియోలే సోషల్ మీడియాలో ఎక్కువ.

ఇప్పటికైనా సెలబ్రిటీలు ఈ పైత్యం ఆపి, కాస్త అసలు సమస్యపై దృష్టిపెడితే ప్రజలకు మంచిది. పైసా ఖర్చు పెట్టకుండా చేసే పనుల గురించి ఆలోచించడం మానేసి, జనాలకు ఉపయోగపడే పనులు చేయండి చాలు.

జ‌‘గ‌న్’ మిస్ ఫైర్ అవుతున్న‌దెక్క‌డ‌?