ప్రారంభమైన కౌంటింగ్.. లక్ష మెజార్టీ అసాధ్యం!

ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితం మరికాసేపట్లో తేలిపోతుంది. కొద్దిసేపటి కిందట కౌంటింగ్ మొదలైంది. మధ్యాహ్నం 1 గంటకు తుది ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం 20 రౌండ్లలో ఓట్ల…

ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితం మరికాసేపట్లో తేలిపోతుంది. కొద్దిసేపటి కిందట కౌంటింగ్ మొదలైంది. మధ్యాహ్నం 1 గంటకు తుది ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆత్మకూరులోని కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీ అంచనా వేసింది. కానీ పోలైన ఓట్లు చూస్తే అధికార పార్టీకి లక్ష ఓట్ల మెజార్టీ అసాధ్యంగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పోటీలో లేకున్నా.. బీజేపీకి మద్దతిచ్చారనే విషయం వాస్తవం. చాలా గ్రామాల్లో జనసైనికులు బీజేపీ తరపున ఏజెంట్లుగా నిలబడ్డారు, టీడీపీ కార్యకర్తలు చివరి నిమిషం వరకు సైలెంట్ గా ఉన్నా.. ఆఖర్లో బీజేపీకి మద్దతుగా పోలింగ్ కి హాజరయ్యారు.

దీంతో మూడు పార్టీల అక్రమ పొత్తు వల్ల ఇక్కడ వైసీపీకి మెజార్టీ తగ్గే అవకాశముందని అంటున్నారు. అయినా సరే.. గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే మూడు రెట్లు ఎక్కువ మెజార్టీ ఆయన తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డి సాధిస్తారని, కనీసం 70వేల ఓట్ల మెజార్టీ ఇక్కడ వస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

లక్ష టార్గెట్ నిజమే కానీ..!

ఆత్మకూరులో మేకపాటి కుటుంబంపై ఉన్న సెంటిమెంట్, సీఎం జగన్ పథకాలపై ఉన్న నమ్మకంతో లక్ష ఓట్ల మెజార్టీ సునాయాసంగా వస్తుందని వైసీపీ అంచనా వేసింది. ఇక్కడ 2.13 లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా కేవలం 1.37 లక్షలమంది మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతానికి పైగా పోలింగ్ జరగగా ఇప్పుడది 64 శాతానికి పడిపోయింది. 

సహజంగానే ఉప ఎన్నికలంటే ఓటర్లకు ఆసక్తి తక్కువ. అందులోనూ ఇక్కడ విజయం ఎవరిదో అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది ఓటింగ్ వేళ నిరాసక్తితో ఉన్నారని సమాచారం. అందుకే పోలింగ్ శాతం తగ్గింది, మెజార్టీ కూడా అనుకున్నంత రాకపోవచ్చు.

రెచ్చిపోతున్న బీజేపీ, టీడీపీ..

ఆత్మకూరులో పోలింగ్ శాతం తగ్గిపోవడంతో.. బీజేపీ, టీడీపీ రెచ్చిపోతున్నాయి. పోలింగ్ శాతం తగ్గిందని, మెజార్టీ కూడా తగ్గుతుందని, లక్ష ఓట్ల మెజార్టీ రాదని సవాళ్లు విసురుతున్నాయి. లక్ష టార్గెట్ పెట్టుకుంటే కనీసం 70వేల ఓట్లతో సత్తా చూపించొచ్చనే అంచనాతో వైసీపీ బరిలో దిగింది. వైసీపీ ప్రకటించిన లక్ష కాకుండా, వాస్తవంగా అంచనా వేసిన 70వేల మెజార్టీని ఆ పార్టీ సునాయాసంగా చేరుకోగలదని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. బాలినేని లాంటి నేతలు ఇదే విషయం చెబుతున్నారు.

సీఎం జగన్ మూడేళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పు ఇదని.. 2019 సార్వత్రిక ఎన్నికలకంటే మూడు రెట్లు ఎక్కు మెజార్టీ సాధించి.. ప్రజలంతా వైసీపీవైపే చూస్తున్నారనే విషయాన్ని రుజువు చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ అంచనాలు ఏమారకు ఫలిస్తాయో.. మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.