దేశంలో అయిదుగురు సిఎమ్ లు, పలువురు మాజీ సిఎమ్ లు మద్దతు ఇస్తున్న బ్లాక్ డే కు తెలుగు రాష్ట్రాల సిఎమ్ లు మద్దతు ఇస్తారా? ఇవ్వరనే అనుకోవాలి. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న దేశం మొత్తం మీద బ్లాక్ డే గా పాటించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
దీనికి వెనుక 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా వుంది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన ఈ రోజు వెలువడింది. రైతు ఉద్యమం ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బ్లాక్ డే ప్రకటన వెలువడింది.
మమత, స్టాలిన్, ఉద్దవ్, హేమంత్ సోరెన్ లాంటి సిఎమ్ లు సంతకాలు చేసారు. ఈ లేఖ బయటకు రావడానికి ముందే జగన్ ను, కేసిఆర్ ను అడిగే వుంటారు. అడగకుండా అయితే వుంటారని అనుకోవడానికి లేదు. కానీ వారి సంతకాలు లేవు అంటే అంగీరించకపోవడమో, లేదా నాట్ ఇంట్రస్ట్ అని చెప్పడమో జరిగి వుండాలి.
నిజానికి మోడీ విషయంలో అస్సలు వ్యతిరేకత అన్నది వైఎస్ జగన్ వ్యక్తం చేయడం లేదు. మొన్నటి మొన్న హేమంత్ సోరెన్ ట్వీటుకు బదులు ఇచ్చినపుడే ఇది స్పష్టం అయిపోయింది.
కానీ కేసిఆర్ విషయంలో అలా కాదు. అవకాశం చిక్కినపుడల్లా కేసిఆర్ రాజకీయ వారసుడు కేటిఆర్ భాజపాను, దాని విధానాలను తూర్పారపడుతూనే వస్తున్నారు. సాగుచట్టాల విషయంలో కూడా గతంలో స్పష్టమైన ప్రకటన చేసారు.
కానీ మరి ఇప్పుడు ఎందుకు ఈ లేఖ మీద కేసిఆర్ ముద్ర లేదో తెలియదు. దీన్ని బట్టి కెసిఆర్ కూడా పరోక్షంగా జగన్ బాటలోనే వెళ్తున్నారని అర్థం అయిపోతోంది. ఈ ఇద్దరి సంగతి ఇలా వుంచితే లేఖ మీద పలువురు మాజీ లు కూడా సంతకాలు చేసారు.
ఈ మాజీలు అంతా ఒకప్పుడు చంద్రబాబుతో కలిసి పని చేసినవారే. వీళ్లందరికీ నాయకత్వం వహించే రేంజ్ లో బాబు హఢావుడి చేసిన సంగతి కూడా గుర్తుంది. కానీ ఇప్పుడు దీని మీద బాబు సంతకం కూడా లేదు.
బాబును కూడా అడగకుండా వుండి వుండరు. కానీ లేదంటే ఆయన కూడా జస్ట్ సింపుల్ గా నో చెప్పి ఎస్కేప్ అయి వుండాలి. అధికారంలో వున్నారు కాబట్టి జగన్, కేసిఆర్ ఇబ్బందులు వారికి వుండొచ్చు. కానీ కేసులు లేని, అధికారం లేని చంద్రబాబుకు ఏమి ఇబ్బందో? ఎప్పటికైనా మోడీకి దగ్గర కావాలని కానీ, అవుతానని కానీ బాబుగారి లోలోపల వుండి వుండొచ్చు. అదే రీజన్ తో సంతకానికి నో చెప్పారేమో?
మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముగ్గురు కీలక నాయకులు ప్రతిపక్షాలకు దూరంగా, మోడీకి దగ్గరగానే వుంటారేమో ఎప్పటికీ?