‘భ‌యో’టెక్‌…ఆయ‌న ఆనంద‌య్యః అదే తేడా

అది ఒక ఫార్మ‌సీ పారిశ్రామిక సంస్థ‌. ఆయ‌నొక సామాన్యుడు. ఇద్ద‌రూ పేరుకు త‌గ్గ‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తుండడం విశేషం. సామాన్యుడేమో ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాల‌ని త‌ప‌న ప‌డుతుంటే, స‌ద‌రు ఫార్మ‌సీ సంస్థ మాత్రం ప్రాణాల‌కు కార్పొ‘రేట్’ క‌డుతోంది.…

అది ఒక ఫార్మ‌సీ పారిశ్రామిక సంస్థ‌. ఆయ‌నొక సామాన్యుడు. ఇద్ద‌రూ పేరుకు త‌గ్గ‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తుండడం విశేషం. సామాన్యుడేమో ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాల‌ని త‌ప‌న ప‌డుతుంటే, స‌ద‌రు ఫార్మ‌సీ సంస్థ మాత్రం ప్రాణాల‌కు కార్పొ‘రేట్’ క‌డుతోంది. క‌రోనాను సామాన్యుడు ఓ మ‌హ‌మ్మారిగా చూస్తూ అంతిమొందించాల‌ని త‌ప‌న ప‌డుతుంటే, కార్పొరేట్ దిగ్గ‌జ సంస్థ‌ మాత్రం కాసులు కురిపించే మ‌హ‌మాన్విత శ‌క్తిగా భావిస్తోంది.

క‌రోనా పుణ్య‌మా అని మ‌నుషులు, వ్య‌వ‌స్థ‌ల నైజాలేంటో తెలుసుకునే అవ‌కాశం క‌లిగింది. నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం గ్రామానికి చెందిన‌ ఆయుర్వేద త‌యారీదారుడు ఆనంద‌య్య సామాన్యుల ప్ర‌తినిధి. సుచిత్ర ఎల్లా కార్పొరేట్ రంగానికి ప్రతినిధి. ఈమె భార‌త బ‌యోటిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ (జేఎండీ). 

భార‌త బ‌యోటిక్ నేతృత్వంలో కోవాగ్జిన్ టీకా త‌యారు చేశారు. దేశ వ్యాప్తంగా అంద‌రికీ టీకా అందించ‌డానికి కోవాగ్జిన్ త‌యారీ ఫార్ములాను మ‌రికొన్ని ఫార్మా ప‌రిశ్ర‌మ‌ల‌కు అందించాల‌ని ఢిల్లీ, ఏపీ ముఖ్య‌మంత్రులు కేజ్రీవాల్‌, వైఎస్ జ‌గ‌న్ ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. అప్పుడే టీకాల ఉత్ప‌త్తి వేగ‌వంత‌మై ప్ర‌తి ఒక్క‌రికీ అందించి క‌రోనా క‌ట్ట‌డికి మార్గం సుగ‌మం అవుతుంద‌ని సూచించారు.

ఈ నేప‌థ్యంలో భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) సుచిత్ర ఎల్లా వెల్ల‌డించిన అభిప్రాయం ఏంటంటే…

‘కోవాగ్జిన్‌ టీకా భారత్‌ బయోటెక్‌దే.. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీల నుంచి మాకు వ్యాక్సిన్‌ తయారీ పరిజ్ఞానమేదీ బదిలీ కాలేదు. పూర్తిస్థాయిలో కంపెనీ నిధులతో, సొంత ల్యాబ్‌లలోస్ట్రెయిన్‌ను పరీక్షించడం దగ్గరి నుంచి ప్రయోగాత్మక టీకాను మనుషులపై పరీక్షించే దాకా ప్రతిచోటా భారత్‌ బయోటెక్‌ శ్రమే ఇమిడి ఉంది. ఇతర ఫార్మా కంపెనీలకు కొవాగ్జిన్‌ పేటెంట్లు, తయారీ పరిజ్ఞా నాన్ని బదిలీ చేసే ప్రసక్తి లేదు’ ఆమె తేల్చిచెప్పారు.

ఇదే నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం నివాసి ఆనంద‌య్య నోటి నుంచి ఇలాంటి మాట‌లు ఊహించ‌గ‌ల‌మా? అస‌లు క‌ల‌లో కూడా ఆయ‌న అలా మాట్లాడ‌రు. ఎందుకంటే ఆయ‌న‌కు సామాన్యుల క‌ష్ట‌న‌ష్టాలు తెలుసు. క‌రోనా వ‌ల్ల కుటుంబాల‌కు కుటుంబాలే ఎలా విచ్ఛిన్నం అవుతున్నాయో ప్ర‌త్య‌క్షంగా చూస్తున్న వ్య‌క్తి. ఆయ‌నో సామాన్యుడు కావ‌డం వ‌ల్లే నేరుగా వెళ్లి ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడ‌గ‌లుగుతున్నారు. త‌మ గోడు చెప్పుకుంటూ ఆయ‌న నుంచి మందు తీసుకుంటూ ఎంతోకొంత ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు.

క‌రోనా నివార‌ణ‌కు ఆనంద‌య్య త‌యారు చేస్తున్న మందుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కానీ ఆయ‌న మందుపై విశ్వాసం ఉంచుకున్న వాళ్లే ఎక్కువ‌. మందు అంటే విశ్వాసంతో సంబంధం లేద‌ని, శాస్త్రీయ‌త‌తో ముడిప‌డి ఉంటుంద‌ని …ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. కానీ తాను త‌యారు చేసే మందులో వాడుతున్న ప‌దార్థాల గురించి ఆయ‌న ఏమాత్రం దాచుకోవ‌డం లేదు. అలాగే త‌న ఊళ్లో మ‌రో ప‌ది మందితో మందు త‌యారు చేయిస్తున్నారు.

ఎందుకంటే విప‌త్తులో కాకుండా మ‌నుషుల‌ను మ‌రెప్పుడు కాపాడుతామ‌ని ఆయ‌న అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తారు. ఔను, ఆయ‌న డ‌బ్బు విలువ తెలియ‌ని అమాయ‌కుడు. క‌రోనాను సొమ్ము చేసుకోవాల‌నే తాప‌త్ర‌యం ప‌డ‌ని వాడు. తెలివితేట‌లంటే మ‌నిషి అవ‌స‌రాల‌ను సొమ్ము చేసుకోవ‌డ‌మే అనుకుంటే, అలాంటి నేర్ప‌రిత‌నంలో మ‌చ్చుకైనా అత‌నిలో క‌నిపించ‌దు. మ‌నిషి సాటి మ‌నిషి కోసం బ‌త‌కాలే త‌ప్ప‌, ‘మ‌నీ’ కోసం కాద‌నేది ఆయ‌న ఫిలాస‌ఫీ.

అందుకే త‌న త‌ల్లి నుంచి నేర్చుకున్న నాటు వైద్యం ప‌ది మంది ప్రాణాల‌ను కాపాడితే, అంత‌కు మించిన ఆనందం మ‌రెందు లోనూ లేద‌ని తృప్తి ప‌డే అతి సామాన్యుడు. ఔను, ఇత‌రుల క‌ళ్ల‌లో ఆనంద‌మే త‌న ఆనందంగా భావించే అల్ప సంతోషి. 

అత‌ను జ‌నం ప్రాణాల‌కు, ఆస్తిపాస్తుల‌కు కార్పొ‘రేట్’ క‌ట్టే తెలివితేట‌లు లేనందు వ‌ల్లే మందు త‌యారీలో తిప్పతీగ, తాటిబెల్లం, పట్ట, తేనె, లవం గాలు, వేపాకు, మామిడి చిగురు, నేరేడు ఆకు, పిప్పింటాకు, బుడబుడసాకు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, జాజికాయ తది తరాలు ఉప‌యోగిస్తున్న‌ట్టు అమాయ‌కంగా చెబుతారు. ఈ ప్ర‌కృతి కంటే తాను గొప్ప కాద‌నే జీవిత స‌త్యం తెలుసుకున్న వ్య‌క్తి కావ‌డం వ‌ల్లే ఏదీ ర‌హ‌స్యంగా పెట్టుకోలేదు.

క‌రోనా ట్రీట్‌మెంట్ కోసం వెళ్లే జ‌నాన్ని జల‌గ‌ల్లా పీక్కుతినే కార్పొరేట్ ఆస్ప‌త్రుల కంబంధ హ‌స్తాల నుంచి కొద్ది మందినైనా బ‌య‌ట ప‌డేయ‌గ‌లిగితే అదే ప‌దివేల‌ని …స‌మాజానికి ఏదో చేయాల‌నే త‌ప‌న ఆనంద‌య్య‌లో క‌నిపిస్తోంది. ఆనంద‌య్య మందు త‌యారీకి ప్ర‌కృతే ఓ పెద్ద వ‌న‌రు. ఆయ‌న‌కు పేటెంట్లు పొంద‌డం తెలియ‌దు. 

మందు త‌యారీ ప‌రిజ్ఞానాన్ని ఇత‌రుల‌కు బ‌దిలీ చేయకూడ‌ద‌నే కార్పొరేట్ దృష్టిలో ఆనంద‌య్య ఎంతో అజ్ఞాని. అవును మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడైనా డ‌బ్బు సంపాదనే ప‌ర‌మావ‌ధిగా రాజ్య‌మేలే కార్పొరేట్ ప్ర‌పంచంలో ఆనంద‌య్య ఓ అజ్ఞాని, మూర్ఖుడు, అస‌మ‌ర్థుడు. అందుకే ప్ర‌జారోగ్యం త‌ప్ప‌, డ‌బ్బు చింత‌న చేయ‌ని ఆయ‌న ఆనంద‌య్య అయ్యారు.

క‌రోనాతో ఈ దేశం ఏమైపోయినా, మ‌నుషులు ప్రాణాలు గాల్లో దీపాలైనా, ప‌ల్లె, ప‌ట్నం అనే తార‌త‌మ్యం లేకుండా ఊళ్ల‌కు ఊళ్లు శ్మ‌శాన వాటిక‌ల‌వుతున్నా త‌మ టీకాకు సంబంధించి త‌మ‌దే పేటెంట్‌, త‌యారీ ప‌రిజ్ఞానాన్ని ఏ ఒక్క‌రికీ ఇవ్వ‌మ‌నే చెప్పే కార్పొరేట్ క‌ర్క‌శ‌త్వానికి ఏం పేరు పెడ‌దాం… ‘భ‌యో’టెక్‌ అని పిలుద్దామా?

సొదుం ర‌మ‌ణ‌