ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కన్నా లక్ష్మినారాయణ ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. కనీసం సొంత పార్టీలో కూడా ఆయన్ను పట్టించుకునే పరిస్థితి కూడా లేనట్టుంది.
పార్టీలో ఆయన సామాజిక వర్గానికి చెందిన కొంత మంది చిన్నస్థాయి నేతలు తప్ప, మరే ఒక్కరూ ఆయనతో మాట్లాడ్డానికి కూడా భయపడుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియా ముందుకొచ్చారు. జోకులు పేల్చారు.
కరోనాను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకోలేదని కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు రావటం లేదని, వాటిపై సీఎం జగన్ అసలు సమీక్షే నిర్వహించడం లేదని కన్నా లక్ష్మినారాయణ హాస్యం పండించారు. అతంటితో ఆయన జోకులు చెప్పడం ఆపలేదు.
సెకండ్ వేవ్‌లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని, వ్యాక్సిన్ త్వరగా తీసుకురావాలని ప్రధాని మోదీ రూ. 35,000 కోట్లు బడ్జెట్ కేటాయించారని చెప్పడం గమనార్హం. ఒక్క మన దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా కరోనా కట్టడిలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు గుప్పిస్తున్న సంగతి పాపం కన్నాకు తెలిసినట్టు లేదు.
కుంభమేళాలు, ఎన్నికలు నిర్వహించి కరోనా విజృంభణకు మోదీ ప్రభుత్వం కారణమైందని అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తున్న సంగతి కన్నా దృష్టికి వచ్చినట్టు లేదు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఇక దేవుడే దిక్కు అని అలహాబాద్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యల సంగతి తెలిసి ఉంటే, కన్నా మీడియా ముందుకు వచ్చే వారు కాదేమో!
ఒకవైపు కోవిడ్‌ను రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తూ, అదే పని కన్నా లక్ష్మినారాయణ చేయడం విశేషం. వైసీపీ మద్దతు లేని ఆస్పత్రులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నట్టు కన్నా ఆరోపించడాన్ని గమనించాలి.
అలాగే ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ ఇవ్వొద్దని సిఎం లేఖ రాయటాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కన్నా పేర్కొన్నారు. మొత్తానికి కన్నా లక్ష్మినారాయణ తాజా ప్రెస్‌మీట్‌లో వ్యక్తపరిచిన ఆవేదన చూస్తుంటే …ఆయనకు, ప్రైవేట్ ఆస్పత్రులకు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్టు అనుమానం కలగకమానదు. ఏమో, ఎవరి మాట వెనుక ఏ శక్తులున్నాయో ఎవరికి తెలుసు?