మే 23… ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇదో చరిత్రాత్మక దినం. ఏపీ ప్రజానీకం టీడీపీకి రాజకీ యంగా సమాధి కట్టిన రోజు. అలాగే వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీకి బ్రహ్మరథం పట్టిన రోజు.
నాడు ప్రధాన ప్రతిపక్షానికి మోదం, అధికార పక్షానికి ఖేదం మిగిల్చిన రోజు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడి, అఖండ మెజార్టీతో వైసీపీ తన పతాకాన్ని రెపరెపలాడించింది. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 2019, మే 23న వెలువడ్డాయి.
వైసీపీ 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్ స్థానాలతో తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చింది. నాడు అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకుని అత్యంత పేలమైన ఫలితాలు దక్కించుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాల తెలుగుదేశం చరిత్రలో ఇదో మాయని మచ్చగా మిగిలింది.
వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా జగన్ తల పెట్టిన ప్రజాసంకల్ప యాత్రం కీలక పాత్ర పోషించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ పొత్తు కలిసొచ్చింది.
కాంగ్రెస్ పాలనపై దేశ, రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత, మరోవైపు మోదీ ప్రభంజనం, జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు…ఇలా అనేక రాజకీయ సమీకరణలు చంద్రబాబు అధికారంలోకి రావడానికి పనిచేశాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీలకు కలిపి 46.6 శాతం ఓట్లు రాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 45 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాలను దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ టీడీపీ-బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఇలా దాదాపు నాలుగేళ్ల పాటు అధికారంలో కలిసి ప్రయాణం సాగించాయి. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధికార పక్షంపై తీవ్ర ఒత్తి చేసింది.
ఈ క్రమంలో పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం, అనంతరం ఎంపీలతో రాజీనామాలు చేయించిన వైసీపీ ప్రజల్లో అంతకంతకూ ఆదరణ చూరగొంది. ఇదే సమయంలో టీడీపీ-బీజేపీ ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్నాయి. ఇది గ్రహించిన టీడీపీ నెపాన్ని బీజేపీపై వేసి, తాను ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే క్రమంలో పొత్తు విచ్ఛిన్నం చేసుకుంది.
ఇదిలా ఉండగా, మరో వైపు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017, నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్‌మో హన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు.
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఏకంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చారిత్రక ఘట్టానికి తెరలేపారు. ఈ పాదయాత్రలో జనం సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ అడుగులు ముందుకేశారు. జనం ఘోషకు చలించి.. తాను విన్నానని, తాను ఉన్నాననే నినాదంతో ఏపీ ప్రజానీకానికి ఓ భరోసా కల్పించారు. ఒక్క అవకాశం ఇస్తే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల బతుకులు మారుస్తానని నమ్మబలికారు.
ఈ నేపథ్యంలో 2019లో సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమరశంఖం పూరించింది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడ తలో ఏప్రిల్ 11న 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అనంతరం దేశ వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాక… మే 23న కౌంటింగ్ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొదటి రౌండ్ నుంచే వైసీపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి ప్రధాన ప్రతిప క్షం వైసీపీ కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. సర్వేలకు కూడా అందని రీతిలో 50 శాతం ఓటింగ్ షేర్‌తో 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది.
అధికారంలో ఉన్న టీడీపీ 39.18 శాతం ఓట్లతో 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు పరిమితమైంది. రెండు పార్టీల మధ్య దాదాపు 11 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంది. ఇదే 2014 సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా రెండు శాతం మాత్రమే. టీడీపీ 79 స్థానాలు కోల్పోయి వైసీపీకి అధికారం కట్టబెట్టింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వారానికి 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేతగా 8 ఏళ్లు, ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పాటు నిత్యం ప్రజా సమస్యలే శ్వాసగా రాజకీయ ప్రస్థానం సాగించిన వైఎస్ జగన్ తన లక్ష్యాన్ని ,కలలను నెరవేర్చుకున్న రోజుగా మే 23 ఏపీ రాజకీయ చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
ప్రజలను నమ్ముకున్న నేతను ఎప్పుడైనా ఆదరిస్తారనేందుకు జగన్ ఓ నిలువెత్తు నిదర్శనం. ప్రభంజనానికి పర్యాయపదంగా సువర్ణాక్షరాలతో జగన్ లిఖించింది ఈ రోజే. అలాగే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండేళ్లలో హామీలను నెరవేర్చడంలో జగన్‌కు జగనే సాటి అనేలా పాలన సాగిస్తున్నారు.
జగన్ పాలనలో ఇతరత్రా అనేక లోపాలుండొచ్చు. అభివృద్ధి పనులేవీ చేపట్టలేదనే విమర్శలు లేకపోలేదు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వ సొమ్మును పప్పుబెల్లాల మాదిరిగా పంచేస్తున్నారనే విమర్శలకు తక్కువేం లేదు. కానీ సంక్షేమ పథకాల అమల్లో మాత్రం జగన్ చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ శంకించడానికి వీల్లేని విధంగా పాలన సాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సొదుం రమణ