ఈ ఏడాది మే మొదటి వారంలో దేశంలో కరోనా కేసులు పీక్ స్టేజ్ కు వెళ్లాయి. ఏకంగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి మే నెల మొదటి వారంలో. ఆ సమయంలో రోజు వారీ కేసుల సంఖ్య ఐదు లక్షల స్థాయికి కూడా వెళ్తుందేమో అనే భయాందోళనలు ఏర్పడ్డాయి. అయితే అనూహ్యంగా ఆ తర్వాత గ్రోత్ రేట్ తగ్గింది.
మే నెల రెండో వారంలో రోజువారీ కేసుల సంఖ్య నాలుగు లక్షల దిగువకు వచ్చింది. ఆ వారమంతా రోజుకు మూడున్నర లక్షల స్థాయిలో కేసుల సంఖ్య కొనసాగుతూ వచ్చింది. మే 15 తర్వాత కేసుల సంఖ్య మరింత తగ్గింది. మూడున్నర లక్షల స్థాయి నుంచి కేసుల సంఖ్య రెండున్నర లక్షల స్థాయి మధ్యన నమోదైంది. రోజువారీగా కాస్త హెచ్చు తగ్గులున్నా.. వారం రోజుల వ్యవధిలో రోజువారీ కేసుల సంఖ్య సగటున లక్ష చొప్పున తగ్గింది.
ఇక ఈ వారం ప్రారంభంలోనే రోజువారీ కేసుల సంఖ్య రెండున్నర లక్షల్లోపు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో కేసుల సంఖ్య 2.40 లక్షలుగా నమోదైంది. రికవరీలు కొత్త కేసుల సంఖ్య కన్నా లక్ష అదనంగా నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల స్థాయికి చేరింది.
గత మూడు వారాల ట్రెండ్ ను బట్టి చూస్తే.. ఈ వారంలో కేసుల సంఖ్య మరింత గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య ఈ వారాంతానికి లక్షన్నర స్థాయికి, అంతకన్నా తక్కువ స్థాయికి చేరితే అది మరింత ఊరట అవుతుంది. అలాగే ఈ వారంలో రికవరీల సంఖ్య కూడా భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల లోడ్ కూడా తగ్గవచ్చు.
మరోవైపు పల్లెల్లో కరోనాను చాలా మంది మామూలుగా తీసుకుంటున్నారు. టెస్టుల జోలికి కూడా వెళ్లడం లేదు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రలు వాడాలో సోషల్ మీడియాలో పూసగుచ్చినట్టుగా వివరిస్తున్నారు. డాక్టర్ల సూచనలు, సలహాలు.. ట్యాబ్లెట్ల పేర్లు కూడా ఇప్పుడు వాట్సాప్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో కరోనా తరహా లక్షణాలు కనిపిస్తే మెడికల్ షాపుల నుంచి ఆ మాత్రలు తెచ్చుకుని మింగే వారు అధికంగా కనిపిస్తూ ఉన్నారు.
మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన వారే ఆసుపత్రుల వరకూ వెళ్తున్నారు. చాలా మంది అయితే తమకు కరోనా వచ్చి వెళ్లిపోయిన తర్వాతే ఈ విషయాన్ని ఇతరులకు చెప్పుకుంటున్న పరిస్థితి కూడా గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో కనిపిస్తూ ఉంది. దీంతో అనధికారికంగా కూడా కరోనా కేసుల సంఖ్య కోట్లలో ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి వరకూ పరిస్థితులను గమనిస్తే.. గ్రామాల్లో నూటికి 10 నుంచి 20-30 మందికి కరోనా సోకి ఉండవచ్చనేది క్షేత్ర స్థాయిల్లో పరిస్థితులను గమనిస్తే అర్థం అవుతుంది. వీరిలో వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రమే ఆసుపత్రుల్లో చేరడం, అనేక మంది మరణించిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి.
కరోనా తొలి వేవ్ లోనే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని కొంతమంది చెప్పుకొచ్చారు. చాలా మందికి వారికి తెలియకుండానే కరోనా వచ్చి వెళ్లిందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. ఆ సంగతేమో కానీ.. ఇప్పుడు మాత్రం భారతీయుల్లో కొన్ని కోట్ల మందికి కరోనా సోకి ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఉచితంగా కరోనా టెస్టులు చేయిస్తున్నా, వాటి వైపు వెళ్లని వారే అధికమంది ఉన్నారు తరచి చూస్తే. సెకెండ్ వేవ్ లో వైరస్ కూడా విజృంభించడంతో.. మారుమూల పల్లెల్లోకి కూడా పాకిపోయింది.
కరోనా సెకెండ్ వేవ్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తొలి వేవ్ గత ఏడాది జూలై మొదటి వారం నుంచి భారీగాపెరగడం ప్రారంభించి.. సెప్టెంబర్ రెండో వారం నుంచి తగ్గుముఖం పట్టింది. దాదాపు 70రోజుల్లో ఫస్ట్ వేవ్ అవరోహణ క్రమానికి చేరింది.
ఈ ఏడాది మార్చి 10 నుంచినే వేగంగా వ్యాపించడం మొదలుపెట్టిన సెకెండ్ వేవ్ సరిగ్గా 70 రోజులు గడుస్తున్న తరుణంలో అవరోహణ దిశగా సాగుతోంది. అయితే ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఇప్పటికీ కేసుల సంఖ్య భారీగా ఉంది. ఇక నిపుణులేమో.. ఈ నెలాఖరుకు సెకెండ్ వేవ్ మరింత తగ్గినా, జూన్ లో కూడా కొంత వరకూ కేసుల సంఖ్య నమోదు కావొచ్చని అంటున్నారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నాగేశ్వరరెడ్డి జూన్ 15 నాటికి కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టవచ్చిన అన్నారు. ఇది వరకూ కేంద్ర ప్రభుత్వ నిపుణులు స్పందిస్తూ.. జూన్ నెలాఖరుకు కరోనా తగ్గుతుందని అంచనా వేశారు.
అంటే ఇంకా కనీసం నెల రోజుల పాటు కరోనా కేసుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో అధికారికంగా కరోనా సోకిన వారి సంఖ్య 2.6 కోట్లకు పైనే ఉంది. సెకెండ్ వేవ్ లో అనధికార కేసుల సంఖ్య, పరీక్షలు చేయించుకోని వారి సంఖ్య ఎన్ని కోట్లల్లో ఉంటుందో అంచనా వేయడం అంత తేలికైన అంశమే కాదు.
ఒక్కో అధికారిక కేసు వెనుక కనీసం ఐదారు అనధికారిక కేసులు ఉండటం పెద్ద విడ్డూరం కాకపోవచ్చు! ఈ స్థాయిలో ప్రబలింది సెకెండ్ వేవ్ కరోనా. మరి ఇంకా నెల పాటు.. ఇలానే వేవ్ కొనసాగితే, అధికారికంగా మరిన్ని లక్షల మందికి, అనధికారికంగా మరెంతో మందికి ఈ వైరస్ సోకే అవకాశాలున్నట్టే. ఈ తీరును పరిశీలిస్తే.. బహుశా ఈ వేవ్ ముగిసే సరికి ఫస్ట్ వేవ్ లో చెప్పుకున్న హెర్డ్ ఇమ్యూనిటీ కూడా వచ్చేస్తుందేమో!