ఈటల పని పట్టడమంటే ఆయన్ని రాజకీయంగా భూస్థాపితం చేయడమని అర్థం. ఆయన్ని తిరిగి లేవకుండా చేయడమని అర్ధం. ఆయనకు హుజూరాబాద్ లో స్థానం లేకుండా చేయడమని అర్ధం. ఈ అన్ని పనులు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రబుల్ షూటర్ కు అప్పగించారు.
టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ ఎవరో అందరికీ తెలుసు కదా. అతనే కేసీఆర్ మేనల్లుడు, ఆర్ధిక మంత్రి హరీష్ రావు. ప్రతి రాజకీయ పార్టీలో అది ప్రాంతీయ పార్టీ కావొచ్చు, జాతీయ పార్టీ కావొచ్చు ట్రబుల్ షూటర్లు ఉంటారు. తెలుగులో చెప్పుకోవాలంటే సమస్యల పరిష్కర్త అని అర్ధం.
పార్టీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని జాగ్రత్తగా డీల్ చేసి పార్టీకి ప్రయోజనం చేకూర్చడం ట్రబుల్ షూటర్ల బాధ్యత. అధినేతకు చాలా నమ్మకంగా ఉండే నాయకుడికి, అప్పగించిన పని కచ్చితంగా చేస్తాడనే నమ్మకం ఉండే లీడర్ కు సమస్యలను పరిష్కరించే బాధ్యతలు అప్పగిస్తుంటారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీకి ట్రబుల్ షూటర్ గా పేరుండేది. ప్రత్యేక తెలంగాణా ఇవ్వాలని సోనియా గాంధీ అనుకున్నప్పుడు అందుకు సంబంధించిన అభిప్రాయాలు సేకరించడానికి ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలోనే కమిటీ వేశారు.
ప్రత్యేక తెలంగాణా మీద రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ప్రణబ్ కమిటీకి చెప్పాలని సోనియా గాంధీ అప్పట్లో పార్టీలకు చెప్పారు. ప్రణబ్ కమిటీకి లేఖలు ఇవ్వాలని కోరారు. తెలంగాణా ఏర్పడిన తరువాత కేసీఆర్ ట్రబుల్ షూటర్ గా హరీష్ రావును ఎంచుకున్నారు. ఈటల వ్యవహారంలాంటి బాధ్యతలే కాకుండా, ముఖ్యమైన ఎన్నికల బాధ్యతలు కూడా హారీష్ రావుకు అప్పగిస్తుంటారు కేసీఆర్. ఇప్పటివరకు హరీష్ రావు తనకు అప్పగించిన బాధ్యతలను చాలావాటిని విజయవంతంగా నెరవేర్చాడు కూడా.
కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ ఆయన నియోజకవర్గ బాధ్యతలు చూసుకునేది హరీష్ రావే. ఈ విషయంలో హరీష్ రావును కేసీఆర్ చాలాసార్లు ప్రశంసించారు. ఇప్పుడు ఈటల బాధ్యతను కూడా కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారు. హుజూరాబాద్ లో ఉపఎన్నిక జరగడం గ్యారంటీ. ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడు జరిగినా ఈటలను ఓడగొట్టాలి. ఇదీ కేసీఆర్ లక్ష్యం.
హుజూరాబాద్ ప్రజలంతా తనవైపే ఉన్నారని ఈటల ఈమధ్య చెబుతున్నాడు. అక్కడి టీఆర్ఎస్ నాయకుల్లోనూ కొందరు ఈటల సానుభూతిపరులున్నారని అంటున్నారు.
అలాంటి వారిని కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు జై కొట్టేలా చేయాలి. ఈ పని చేయగల నాయకుడు హరీష్ రావేనని కేసీఆర్ నమ్మకం. అందుకే ఇప్పటినుంచే వ్యూహాలు రచించే బాధ్యత హరీష్ కు అప్పగించారు.
నిజానికి ఈ కరోనా గొడవ లేకుండా ఉన్నట్లయితే ఈపాటికి ఈటల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా మరింత హాట్ టాపిక్ గా మారి ఉండేది. రాష్ట్రాన్ని కరోనా ఎంతగా పీడిస్తున్నా, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఈటల వ్యవహారాన్ని మాత్రం వదిలిపెట్టలేదు కేసీఆర్.
త్వరలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అంటున్నాడు ఈటల. రాజీనామా చేస్తే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వచ్చే అవకాశముంది. ఆ ఎన్నికలో ఈటలను ఓడించి.. సత్తా చాటాలని టీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఉమ్మడి కరీంనగర్‌పై మంచి పట్టున్న ఈటల రాజేందర్‌ను కట్టడి చేసే బాధ్యలను మొదట్లో అదే జిల్లాకు చెందిన బీసీ మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించారు. దీంతో చాలారోజులు గంగులకు – ఈటలకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. గంగుల తక్కువోడు కాదని, ఆయన కథ బయట పెడతానని ఈటల చెప్పాడు.
ఎందుకో ఈటలను గంగుల సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నాడని భావించడంతో హరీష్ రావును తెర మీదికి తీసుకొచ్చారు. మంత్రి హరీష్‌రావుతో ఆపరేషన్ హుజురాబాద్‌ను ప్రారంభించింది టీఆర్ఎస్ హైకమాండ్. నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలెవరూ ఈటెల వెంట వెళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే శనివారం కమలాపూర్ మండల టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు.
మాజీ ఎంపీ వినోద్ కూడా సమావేశంలో పాల్గొన్నాడు. తాము టీఆర్ఎస్‌తోనే ఉంటామని..హుజురాబాద్ నియోజవర్గ అభివృద్ధి టీఆర్ఎస్‌తో సాధ్యమని అక్కడి నేతలు మంత్రి హరీష్ రావుతో చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. 2001 నుంచి టీఆర్ఎస్‌తోనే నడిచామని.. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వెంటే ఉంటామని తెలిపారు. దీన్నిబట్టి ఈటెల వ్యవహారం బాధ్యతలను సీఎం కేసీఆర్.. హరీష్ రావుకే అప్పగించినట్లు అర్ధమవుతోంది. ఈటల వైపు వెళ్లేవారిని కూడా కన్విన్స్ చేసే సత్తా హరీష్ రావుకి ఉంది.
టీఆర్ఎస్‌లో హరీష్ రావుకు ట్రబుల్ షూ!టర్‌గా పేరుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకొని.. తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఆ పార్టీ నేతలకు ఉంది. కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యతను అప్పగించగా.. దానిని సమర్థవంతంగా నిర్వహించాడు. తన వ్యూహాలతో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాడు.
ఒక్క దుబ్బాక ఉపఎన్నిక మినహా చాలా చోట్ల ఆయన వ్యూహాలు విజయవంతమయ్యాయి. మరోవైపు ఈటల రాజేందర్ బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇతర పార్టీల నేతలతోనూ వరుసగా భేటీ అవుతూ మద్దతు కూడగడుతున్నాడు. ముదిరాజ్ సామాజికవర్గం కూడా ఆయన వెంటనే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటలను ఎదుర్కొనేందుకు ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని.. ఐతే కరోనా ముగిసిన తర్వాతే ఆ నిర్ణయం ఉంటుందని ఈటల ఈమధ్య చెప్పాడు. ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారానే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందినట్లు హైకోర్టు, సుప్రీంకోర్టు మండిపడ్డాయని ఈటల గుర్తు చేశారు. ఇప్పుడు తాను రాజీనామా చేస్తే, మళ్లీ ఉపఎన్నికలు వస్తాయని.. అప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే ఉద్దేశ్యమని అన్నాడు.
మరోవైపు కేబినెట్ నుంచి ఈటల నుంచి తప్పించిన తర్వాత.. మొన్నటి వరకు ఆయన నిర్వహించిన వైద్య,ఆరోగ్యశాఖ బాధ్యతను స్వయంగా సీఎం కేసీఆర్ చూస్తున్నారు. ఐతే కోవిడ్ కట్టడిపై జరుగుతున్న సమీక్షా సమావేశాల్లో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొంటున్నాడు. కేంద్ర వైద్యఆరోగ్య సమీక్షలోనూ రాష్ట్రం తరపున ఆయనే పాల్గొంటున్నాడు.
ఇటీవల సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రిని సందర్శించినప్పుడు ఆయన వెంట హరీష్ రావు ఉన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖను హరీష్ రావుకే అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.