వాయిదా పడిన చైతూ సినిమా

ఊహించని విధంగా నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా వాయిదా పడింది. లెక్కప్రకారం ఈ సినిమా జులై 8న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ మూవీని 2 వారాలు ఆలస్యంగా జులై 22న…

ఊహించని విధంగా నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా వాయిదా పడింది. లెక్కప్రకారం ఈ సినిమా జులై 8న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ మూవీని 2 వారాలు ఆలస్యంగా జులై 22న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సినిమా యూనిట్, పోస్ట్ పోన్ కు కారణాలు మాత్రం చెప్పలేదు.

నాగచైతన్య-రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా థాంక్యూ. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి నిన్ననే ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. చైతూ-రాశిఖన్నాను కూర్చోబెట్టి ఓ కామన్ ఇంటర్వ్యూ పూర్తి చేశారు. ఇక రేపోమాపో ఛానెల్స్ కు అది రిలీజ్ చేస్తారనుకుంటుండగా, అంతలోనే వాయిదా బాట పట్టింది ఈ సినిమా.

మనం మూవీ తర్వాత విక్రమ్ కుమార్, చైతూ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో థాంక్యూపై అంచనాలున్నాయి. దీనికితోడు రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మాళవికా నాయర్, అవికా గౌర్ కూడా ఇందులో హీరోయిన్లుగా నటించారు.

థాంక్యూ వాయిదా పడ్డంతో జులై 1న విడుదలకాబోతున్న పక్కా కమర్షియల్ సినిమాకు మరింత స్పేస్ దొరికినట్టయింది. లేదంటే, గోపీచంద్ సినిమా రిలీజైన వారం రోజులకే చైతూ సినిమా వచ్చి ఉండేది.