తెలుగు రాష్ట్రాల్లో మరో న్యూస్ ఛానెల్ దివాలా దిశగా దూసుకుపోతోంది. గడిచిన ఐదేళ్లలో పలు న్యూస్ ఛానెళ్లు మూతపడగా.. చాలా ఛానెళ్లు బిక్కుబిక్కుమంటూ నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ ఛానెల్ నిజస్వరూపం బట్టబయలైంది. AP 24X7 అనే ఛానెల్ ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. స్వయంగా ఛానెల్ ఛైర్మన్ మురళి కృష్ణంరాజు, తన పదవికి రాజీనామా చేస్తూ.. ఛానెల్ లో జరుగుతున్న అవకతవకల్ని బట్టబయలు చేశారు.
“AP24x7 అనే న్యూస్ ఛానెల్ కు మొదట్నుంచి నేను ఛైర్మన్ గా ఉన్నప్పటికీ.. రోజువారీ ఛానెల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేకపోవడం, చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడం జరిగింది. కష్టాల్లో ఉన్న మీడియా రంగ ప్రభావం, పరిపాలన అపరిపక్వత కలిసి కంపెనీ అసాధారణ పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది.”
ఇక్కడితో ఆగకుండా ఛానెల్ లో అంతర్గతంగా జరుగుతున్న అవ్యవస్థను కూడా బయటపెట్టారు కృష్ణంరాజు. నెలల తరబడి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని, కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగుల మధ్య వివాదాలు, కొట్లాటలు జరిగి పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చేవరకు పరిస్థితి వెళ్లిందనే విషయాన్ని బయటపెట్టారు.
వ్యవస్థల్ని సరిదిద్దాల్సిందిగా సంస్థ యాజమాన్యానికి చాన్నాళ్ల కిందటే లేఖ రాసినప్పటికీ స్పందించకపోవడంతో.. ఇలా ప్రెస్ నోట్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారాయన. కృష్ణంరాజు రాసిన లేఖలో అన్యాపదేశంగా రెండు విషయాలు గోచరిస్తున్నాయి. ప్రారంభమైన కొత్తలో ఈ ఛానెల్ తటస్థంగా ఉండేది. జనసేనకు కాస్త మొగ్గుచూపినట్టు అనిపించినా తర్వాత కుదురుకుంది. అయితే ఛానెల్ లో కీలక పొజిషన్ లో ఉన్న వెంకటకృష్ణ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ ఛానెల్ “టీడీపీ ఛానెల్”గా మారిపోయింది.
దీంతో పాటు సీనియర్ల మధ్య సఖ్యత లేకపోవడం, ఆర్థిక సమస్యలు ఈ ఛానెల్ ను మరింత కష్టాల్లోకి నెట్టాయి. ఒక దశలో ఛానెల్ లో వెంకటకృష్ణ అన్నీ తానై వ్యవహారాలు నడిపించారు. గత ఎన్నికల సమయంలో సంస్థ యాజమాన్యాన్ని కూడా ఆయన పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు ఈ రంగంలో స్వతహాగా ఉన్న ఆర్థిక కష్టాలు ఛానెల్ ను నష్టాల ఊబిలోకి నెట్టాయి.
ప్రస్తుతానికైతే కృష్ణంరాజు అధికారికంగా తప్పుకున్నారు. అతడి బాటలో మరో ఇద్దరు బోర్డ్ సభ్యులు కూడా తప్పుకోవాలని ఆలోచిస్తున్నారు. వీళ్లంతా ఈ ఛానెల్ లో డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్లే. పోనీ.. ఛానెల్ ను వేరే వాళ్లకు అమ్ముదామంటే.. రకరకాల కొర్రీలు పెట్టి వెంకటకృష్ణ అమ్మకం కాకుండా అడ్డుపడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మొత్తమ్మీద ఛైర్మన్ రాజీనామాతో మరో ఛానెల్ బండారం బయటపడింది. ఎక్స్ ప్రెస్ టీవీ తరహాలో రేపోమాపో ఈ ఛానెల్ మూతపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఛానెల్ లో తెరవెనక జరిగే ఇలాంటి రాజకీయాలకు అంతిమంగా బలయ్యేది ఉద్యోగులే. పాపం, ఈ ఛానెల్ ను నమ్ముకొని హైదరాబాద్ వదులుకొని మరీ విజయవాడ వెళ్లారు చాలామంది జర్నలిస్టులు. వాళ్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.