బాబుకు ప్ర‌కృతి ప్ర‌సాదించిన రిట‌ర్న్ గిఫ్ట్ అత‌నే…

2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు. టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒంట‌రిగానూ, బ‌ద్ధ శ‌త్రువులైన కాంగ్రెస్‌, టీడీపీతో పాటు సీపీఐ, కోదండ‌రాం పార్టీలు క‌ల‌సి ఉమ్మ‌డిగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. చివ‌రికి అంద‌రూ…

2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు. టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒంట‌రిగానూ, బ‌ద్ధ శ‌త్రువులైన కాంగ్రెస్‌, టీడీపీతో పాటు సీపీఐ, కోదండ‌రాం పార్టీలు క‌ల‌సి ఉమ్మ‌డిగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ్డాయి. చివ‌రికి అంద‌రూ క‌లిసినా కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌లేక‌పోయారు.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజు సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చారు. త‌న విజ‌యంపై మీడియాతో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ మీడియా స‌మావేశంలో రిట‌ర్న్ గిఫ్ట్ గురించి ప్ర‌స్తావించారు. అది ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఆ మీడియా స‌మావేశంలో కేసీఆర్ ఏమ‌న్నారంటే…

‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాకు ఇయ్యాల లక్ష ఫోన్లు వచ్చినై. అక్కడ కట్టలక్కట్టల మెసేజ్‌లు ఉన్నాయ్‌. ఫోన్లు పగిలిపోతున్నాయి.  నేను జోక్‌ చేస్తలేను. నిజాయితీగా చెబుతున్నా. మీరు ఏపీ రాజకీయాల్లో కలుగచేసుకోవాలె అని అడుగుతున్నారు. దేశ రాజకీయాలను బాగు చేసే క్రమంలో ఏపీ రాజకీయాల్లోనూ కలుగజేసుకుంటాం. చంద్రబాబు వచ్చి ఇక్కడ పని చేశారు. మేం పోయి అక్కడ పనిచేయొద్దా? ఇప్పుడు మనం బర్త్‌డే పార్టీ చేస్తం.. మనం తిరిగి గిఫ్ట్‌ ఇస్తమా లేదా? ఇయ్యకపోతె మనది తప్పయితది మరి. చంద్రబాబు నాకు గిఫ్టు ఇచ్చారు. నేను రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా? లేకపోతే తెలంగాణ ప్రజలకు సంస్కారం లేదని అంటారు..’ అని బాబుపై కేసీఆర్ త‌న‌దైన శైలిలో పంచ్ విసిరారు.

ఆ త‌ర్వాత కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్‌పై తీవ్ర దుమారం చెల‌రేగింది. ఎలాగైతే కేసీఆర్ తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌రోసారి బాబు బూచీ చూపి…ప్రాంతీయ సెంటిమెంట్‌ను ర‌గిల్చి సొమ్ము చేసుకున్నాడో, అదే రీతిలో ఆంధ్రాలో కూడా కేసీఆర్‌ను చూపి రెచ్చ‌గొట్టాల‌ని బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది.

కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ సంగ‌తేమో గానీ, చంద్ర‌బాబుకు ప్ర‌కృతి ఏనాడో రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చింద‌ని చెప్పొచ్చు. త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రినైనా బాబు బ‌లిపెడ‌తార‌ని యూనివ‌ర్సిటీ రోజుల్లో రాజ‌కీయాలు చేస్తున్న‌ప్ప‌టి  నుంచీ కూడా ఓ ప్ర‌చారం ఉంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఎవ‌రెవ‌రికి చంద్ర‌బాబు వెన్నుపోట్లు ఎలా పొడిచారో కూడా క‌థ‌లు క‌థ‌లుగా చెబుతారు.

ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రాజ‌కీయ రంగంలోకి అడుగు పెట్టిన‌ప్పుడు చాలా మంది ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప్రోత్స‌హించారు, స‌హ‌క‌రించారు. కానీ సొంత అల్లుడు బాబు మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ స‌హ‌క‌రించ‌డం మాట ప‌క్క‌న పెడితే, అధిష్టానం ఆదేశిస్తే మామ‌పై పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌లేడ‌నే అనుమానంతో టీడీపీకి మొద‌ట్లో దూరంగా ఉన్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఎప్పుడైతే కాంగ్రెస్‌ను మ‌ట్టి క‌రిపించి…ఎన్టీఆర్ సీఎం అయ్యారో, చంద్ర‌బాబు ఇక ఆగ‌లేదు. ఇక్క‌డో విష‌యం చెప్పాలి. ఎన్టీఆర్ గాలిలో చంద్ర‌గిరి నుంచి బాబు ఓట‌మిపాల‌య్యారు.

ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు టీడీపీలో చేరిపోయి….చివ‌రికి రాజ‌కీయ భిక్ష పెట్టిన మామకే వెన్నుపోటు పొడిచారు. ఇది బాబు వెన్నుపోటుకు ప‌రాకాష్ట కావ‌డంతో అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయ్యారు.  బాబు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో ఎంత‌మందిని బ‌లి చేశారో లెక్క క‌ట్ట‌డం క‌ష్టం. ఏ ఊరు చూసినా బాబు బాధితులే క‌నిపిస్తారు. మ‌రి ఇంత మందిని ముంచిన బాబుకు మిగిలింది ఏమ‌నే ప్ర‌శ్న రాక మాన‌దు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో బాబు 14 ఏళ్లు సీఎం ప‌ద‌విలో ఉన్నారు. ఇక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా, టీడీపీ అధ్య‌క్షుడిగా ద‌శాబ్దాల త‌ర‌బ‌డి కొన‌సాగుతూనే ఉన్నారు.

అయితే వ‌య‌సు పైబ‌డుతున్న నేటి ప‌రిస్థితుల్లో బాబు మాన‌సికంగా కుంగిపోతున్నారు. దీనికి కార‌ణం త‌న ర‌క్తం పంచుకుని పుట్టిన కొడుకు లోకేశ్ రాజ‌కీయంగా అంత స‌మ‌ర్థ‌త చూప‌లేక పోవ‌డ‌మే. లోకేశ్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని చేశారు. త‌న చేతుల్లో ఉన్న‌వ‌న్నీ చేస్తున్న‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల నుంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. మంగ‌ళ‌గిరి నుంచి మొన్న‌టి ఎన్నిక‌ల్లో పోటీ నిలిపితే ఓట‌మి చ‌వి చూడాల్సి వ‌చ్చింది.

రాజ‌కీయాల్లో త‌న స‌మకాలికుడైన ప్ర‌త్య‌ర్థి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌నిపోయిన త‌ర్వాత ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ 35 ఏళ్ల లోపు సొంత పార్టీని స్థాపించారు. కానీ ఇప్పుడు 35 ఏళ్లున్న లోకేశ్ పార్టీ (డిన్న‌ర్లు)లు ఇవ్వ‌డం త‌ప్ప‌, ఆల్రెడీ మ‌నుగ‌డ‌లో ఉన్న టీడీపీని బ‌లోపేతం చేయాల‌నుకోవ‌డం లేదు. పార్టీ అధికారాన్ని కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉంది. నిజానికి లోకేశ్ త‌న నాయ‌క‌త్వంపై కేడ‌ర్‌తో పాటు నాయ‌కుల‌కు న‌మ్మ‌కం క‌ల్పించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. కానీ లోకేశ్ ఇప్ప‌టికీ ట్విట‌ర్ త‌ప్ప‌, ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల్లోకి వెళుతున్న దాఖ‌లాలే లేవు.

క‌ళ్లెదుట చెట్టంత కొడుకు నిష్ప్ర‌యోజ‌కుడిగా తిరుగుతుండ‌టం, మ‌రోవైపు పార్టీ రోజురోజుకూ ప‌త‌న‌మ‌వుతుండ‌టంతో బాబు మాన‌సికంగా కుంగిపోతున్నారు. టీడీపీతో పాటు కొడుకు రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై బాబుకు బెంగ ప‌ట్టుకొంది. ప్ర‌జ‌ల‌కు, త‌న‌ను న‌మ్ముకున్న వారికి బాబు చేసిన ద్రోహానికి ప్ర‌కృతి స‌రైన గిఫ్ట్ ఇచ్చింద‌ని….అది లోకేశ్ రూపంలోన‌ని వ్యంగ్యంగా అంటున్నారు.

ఈ స‌మాజానికి తానెంతో చేశాన‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబుకు కూడా లోకం కూడా గిఫ్ట్ ఇవ్వాలి క‌దా! కేసీఆర్ మాట‌ల్లో చెప్పాలంటే చంద్రబాబు తెలుగు స‌మాజానికి త‌న కుట్ర‌లు, కుతంత్రాల‌తో గిఫ్టు ఇచ్చారు. మ‌రి ఆయ‌న‌కు కూడా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా? లేకపోతే తెలుగు స‌మాజానికి సంస్కారం లేదని అంటారు. తెలుగు స‌మాజం త‌ర‌పున ఎప్పుడో 35 ఏళ్ల క్రితమే ప్ర‌కృతి లోకేశ్ అనే బంగారు ల‌డ్డులాంటి కొడుకుని ప్ర‌సాదించింది. బాబు త‌న జిత్తుల‌మారి తెలివి తేట‌ల‌తో కొన్నేళ్లుగా త‌ప్పించుకుంటున్నాన‌ని సంబ‌ర‌ప‌డుతుండొచ్చు. కానీ లోకేశ్ విష‌యంలో మాన‌సిక శిక్ష నుంచి త‌ప్పించుకోలేక పోయారు.

తను పక్కన ఉంటే అన్నీ మర్చిపోతా

ద్యేవుడా…బ‌ట్ట‌ల్లేకుండా క‌నిపించ‌డం స్టార్ హీరోయిన్‌కు స‌ర‌దా అట‌!